పగతో రగిలిపోతోన్న ఇరాన్.. రివెంజ్‌ లిస్ట్‌ లీక్‌. ట్రంప్, మెలోనీ సహా 13 మంది…!

మళ్లీ దద్దరిల్లిన పశ్చిమాసియా..
ఇరాన్‌లో 140 లక్ష్యాలపై విరుచుకుపడ్డ అమెరికా!
అమెరికా దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ట్రంప్, మెలోని సహా ఇరాన్‌ హిట్‌ లిస్ట్ లో 13 మంది..!
సహకరించే దేశాలను కూడా టార్గెట్ చేస్తామని హెచ్చరిక!
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడు గల్లంతు!
హర్మూజ్‌ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించిన ఇరాన్!
మధ్యప్రాచ్యంలో అసలేం జరుగుతోంది?


పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ మరింత మరింత ముదురుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హెర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న జీఎఫ్‌ఎస్ గెలాక్సీ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేయడంతో భారీగా మంటలు చెలరేగాయి. నౌకలో ఉన్న 11 మంది భారతీయుల్లో 10 మంది సురక్షితంగా బయటపడగా.. ఒక భారతీయుడు గల్లంతవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో అమెరికా-ఇరాన్ మధ్య ప్రతిదాడులతో గల్ఫ్ ప్రాంతం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. అసలు హెర్మూజ్‌ జలసంధిలో ఏం జరిగింది? గల్లంతైన భారతీయుడి పరిస్థితి ఏంటి?

మొన్నామధ్య.. పశ్చిమాసియాలో యుద్ధం ఆగినట్టే కనిపించినా.. ఇటీవల మళ్లీ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్, అమెరికా (Iran-USA) పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హెర్మూజ్‌లో ప్రయాణిస్తోన్న నౌకలపై ఐఆర్‌జీసీ దాడులు చేయడం తాజా ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని స్థానిక మీడియా.. 13 మంది విదేశీ నేతల పేర్లతో ఉన్న రివేంజ్‌ లిస్ట్‌ను ప్రచురించింది. ఆ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సహా పలువురు ఐరోపా నేతల పేర్లు ఉన్నాయి.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నాటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. అయితే, తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని మొజ్తాబా ఖమేనీ ఇటీవల ప్రతిజ్ఞ చేశారు. బాధ్యులైనవారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది తమ దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని.. దానిని కచ్చితంగా నెరవేరుస్తానని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ హిట్‌లిస్ట్‌ బయటకు రావడం చర్చనీయాంశమైంది.

హెర్మూజ్‌ జలసంధిలో ఓ వాణిజ్య నౌకపై ఇరాన్‌ దాడి చేయడం, దానికి ప్రతిగా అమెరికా వైమానిక దాడులు నిర్వహించడం, అనంతరం గల్ఫ్‌ అరబ్‌ దేశాలపై టెహ్రాన్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగడం వంటి పరిణామాలతో ఆదివారం ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హెర్మూజ్‌ జలసంధిలో ఒమన్‌ తీరానికి సమీపంలో సైప్రస్‌ జెండాతో ప్రయాణిస్తున్న జీఎఫ్‌ఎస్‌ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) ఆదివారం తెల్లవారుజామున దాడి చేసింది. ఘటన సమయంలో నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉండగా, వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు. సిబ్బందిలో 23 మందిని ఒమన్‌ అధికారులు సురక్షితంగా రక్షించగా, ఒక భారతీయుడు గల్లంతైనట్లు సమాచారం.

దాడి కారణంగా నౌకలో మంటలు చెలరేగగా, ఇంజిన్‌ గది తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. దీంతో నౌక తన ప్రయాణాన్ని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ఈ ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలని కోరింది. వాణిజ్య నౌకలు, పౌర మౌలిక వసతులపై దాడులు వెంటనే నిలిపివేయాలని పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా, హర్మూజ్‌ జలసంధి వినియోగంపై ఇరాన్‌, అమెరికా నుంచి భిన్న ప్రకటనలు వెలువడ్డాయి. ఇరాన్‌ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించగా, ప్రస్తుతం హెర్మూజ్‌ మార్గం అందుబాటులోనే ఉందని అమెరికా వెల్లడించింది.

అదే విధంగా, వాణిజ్య నౌకపై దాడికి ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌పై భారీ స్థాయిలో వైమానిక దాడులు చేపట్టింది. దేశవ్యాప్తంగా మొత్తం 140 లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. వీటిలో క్షిపణి, డ్రోన్‌ ప్రయోగ కేంద్రాలు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, ఇతర సైనిక స్థావరాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ దాడుల్లో తమ నౌకాదళానికి చెందిన ఒక అధికారి మరణించినట్లు ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థలు తెలిపాయి.

ఇక, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ పలు గల్ఫ్‌ అరబ్‌ దేశాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.అయితే, ఖతార్‌ తమ గగనతలంలోకి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు, యూఏఈలో పేలుళ్లలో ముగ్గురు గాయపడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. బహ్రెయిన్‌లో క్షిపణి హెచ్చరికలతో సైరన్లు మోగగా, కువైట్‌ వైపు దూసుకొచ్చిన లక్ష్యాలను ఆ దేశ రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయి. హర్మూజ్‌ జలసంధికి సమీపంలోని తమ భూభాగంపై డ్రోన్‌ దాడులు జరిగాయని ఒమన్‌ తెలిపింది. జోర్డాన్‌పైనా ఇరాన్‌ క్షిపణి దాడులు నిర్వహించినట్లు సమాచారం.

ఇరాన్‌లో మొజ్తాబా ఖమేనీ త్వరలో బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ స్మారక సభను ఈ నెల 23న టెహ్రాన్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొజ్తాబా ఖమేనీ ఇప్పటివరకు ఏ బహిరంగ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.


మొత్తానికి.. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. హెర్మూజ్ జలసంధిలో తాజా పరిణామాలు ప్రపంచ చమురు సరఫరాపై, అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించకపోవడంతో పరిస్థితి ఎటు దారితీస్తుందనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఇదే సమయంలో గల్లంతైన భారతీయ నావికుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.