ఆనందంగా మొదలైన విదేశీ విహారయాత్ర… క్షణాల్లోనే పెను విషాదంగా మారింది. వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫూ క్వాక్ ద్వీపం వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు తెలుగు వారు ఉండటం మరింత విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 16 మంది తెలుగు పర్యాటకులు హైదరాబాద్‌కు చేరుకోగా, వారి కళ్ల ముందే జరిగిన భయానక ఘటనను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ప్రమాదానికి కారణమేంటి? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. వ్యాపార లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసిన తమ డిస్ట్రిబ్యూటర్లకు ప్రోత్సాహకంగా లావా మొబైల్ సంస్థ ప్రత్యేక వియత్నాం టూర్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు ఈ టూర్‌లో పాల్గొన్నారు. అందరూ సంతోషంగా విహారయాత్రను ఆస్వాదిస్తున్న సమయంలో ఊహించని ప్రమాదం వారి జీవితాలను తలకిందులు చేసింది.
ప్రమాదం జరిగిన రోజు 36 మందితో ఉన్న స్పీడ్‌బోటులో నలుగురు సిబ్బంది, 32 మంది భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్నారు. సముద్ర విహారాన్ని ముగించుకుని తిరిగి తీరానికి వస్తున్న సమయంలో… తీరానికి సుమారు 400 మీటర్ల దూరంలో భారీ అలలు ఒక్కసారిగా బోటును ఢీకొట్టాయి. దీంతో, కొన్ని క్షణాల్లోనే పడవ అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ఉన్నవారు ప్రాణాల కోసం సముద్రంలో పోరాడాల్సి వచ్చింది. ఈ దుర్ఘటనలో 15 మంది భారతీయులు జలసమాధి అయ్యారు. మృతుల్లో 13 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. 21 మంది ప్రాణాలతో బయటపడగా,వారిలో కొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతి చెందడం రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన నల్లపేట రవితేజ, కడపకు చెందిన ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయశ్రీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, జయశ్రీ భర్త గెల్లి కిషోర్ తీవ్ర గాయాలతో వియత్నాంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందిస్తూ బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత విదేశాంగ శాఖ, రాయబార కార్యాలయంతో సమన్వయం జరుగుతోందన్నారు. వారి కుటుంబ సభ్యులను విజయవాడలో మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించి ధైర్యం చెప్పారు. గెల్లి కిషోర్‌కు వియత్నాంలో మెరుగైన వైద్యం అందుతోందని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జయశ్రీ మృతదేహం సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటుందని, బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు, కిషోర్ చిన్ననాటి స్నేహితులు, స్థానికులు జయశ్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కిషోర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మరోవైపు, ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ 16 మంది తెలుగు పర్యాటకులు విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. వారిలో విజయవాడకు చెందిన లావా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ మహిపాల్ కూడా ఉన్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… ఆ రోజు జరిగిన భయానక ఘటనను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
మహిపాల్ తెలిపిన వివరాల ప్రకారం… ప్రమాదం జరిగిన సమయంలో తాను ప్రయాణిస్తున్న పడవకు సుమారు 400 మీటర్ల దూరంలో మరో పడవ ఉంది. ఒక్కసారిగా ఆ పడవ తిరగబడడాన్ని తన కళ్ల ముందే చూశానని చెప్పారు. మొదట అది తమ బృందానికి చెందిన పడవేనని గుర్తించలేదన్నారు. వెంటనే అక్కడ ఉన్న వారిని అప్రమత్తం చేశానని… కానీ ఆ తర్వాత ప్రమాదంలో చిక్కుకున్నవారు తమతో వచ్చిన డిస్ట్రిబ్యూటర్లేనని తెలిసి గుండె ఆగినంత పని అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో ముఖ్యమైన విషయం కూడా ఆయన వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు అత్యవసర వైద్యం సకాలంలో అందలేదని, అదే మరణాల సంఖ్య పెరగడానికి ఒక కారణమై ఉండొచ్చని చెప్పారు. తనతో కలిసి వచ్చిన మచిలీపట్నానికి చెందిన దంపతులు గెల్లి కిషోర్, జయశ్రీ గురించి మాట్లాడుతూ… జయశ్రీ మరణించగా, కిషోర్ ఇంకా ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. తాను భారత్‌కు బయలుదేరే ముందు కూడా కిషోర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానని చెప్పారు. “ఎంతో ఆనందంగా విహారయాత్రకు వెళ్లాం…కానీ, ఇలా విషాదాంతం అవుతుందని అస్సలు ఊహించలేదు” అంటూ మహిపాల్ చెప్పిన మాటలు అందరినీ కలిచివేశాయి.
ఇక ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురి మృతదేహాలను ప్రస్తుతం హోచిమిన్ సిటీకి తరలించారు. భారత రాయబార కార్యాలయంలో అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తయిన వెంటనే మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.
మొత్తంగా, ఒక సంస్థ ఉద్యోగులు, డిస్ట్రిబ్యూటర్లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన విహారయాత్ర… చివరకు అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. విదేశాల్లో జరిగే సాహస విహారాల్లో భద్రతా ప్రమాణాలు, అత్యవసర స్పందన వ్యవస్థ ఎంత కీలకమో ఈ ప్రమాదం మరోసారి గుర్తు చేసింది. ప్రాణాలతో బయటపడిన వారి కళ్లలో ఆ భయానక దృశ్యాలు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి.

Leave a Reply