ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల చూపంతా.. ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రం పైనే ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో జరిగే శ్రీ జగన్నాథుడి రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ఈ మహాయాత్రను ప్రత్యక్షంగా చూడాలని, జగన్నాథుడి రథాన్ని ఒక్కసారి అయినా దర్శించాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పవిత్ర క్షేత్రంగా పూరీ జగన్నాథ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. లక్షలాది మంది భక్తుల “జై జగన్నాథ” నినాదాల మధ్య వైభవంగా జరిగే ఈ రథయాత్రకు ఉన్న విశిష్టత ఏమిటి? జగన్నాథుడి రథయాత్ర భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్లలో కూడా జరుగుతుందని మీకు తెలుసా? ఈ రథయాత్ర విశేషాలతో పాటు.. పూరీ క్షేత్రం ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి తమ తమ భారీ రథాలపై గుండిచా ఆలయం వరకు ఊరేగే ఈ మహా వైభవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్నానయాత్రతో ప్రారంభమై నీలాద్రి బిజేతో ముగిసే ఈ ఉత్సవంలో ప్రతి ఆచారానికీ విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. రథాలను భక్తిశ్రద్ధలతో లాగడం, జగన్నాథుడిని దర్శించుకోవడం వల్ల దైవానుగ్రహం, పుణ్యం, ఆధ్యాత్మిక శుద్ధి, మోక్షం లభిస్తాయని కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తున్నారు.
ఇక, ప్రపంచంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే హిందూ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పూరీ జగన్నాథ రథయాత్ర ఒకటి. ప్రతి ఏడాది ఒడిశాలోని పూరీ క్షేత్రానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తారు. జగన్నాథుడు, అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి భారీ రథాలపై గుండిచా ఆలయానికి ఊరేగే ఈ యాత్ర… భక్తి, సమానత్వం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ శుద్ధ విదియ రోజున ఈ పూరీ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది.
ఈ ఏడాది ఆషాఢ శుక్ల విదియ తిథి జూలై 15వ తేదీ ఉదయం 11:50 గంటలకు ప్రారంభమై, జూలై 16వ తేదీ ఉదయం 8:52 గంటలకు ముగియనుంది. ఈ పవిత్ర తిథిలోనే శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి తమ తమ భారీ రథాలపై ఆలయం నుంచి గుండిచా ఆలయానికి మహా వైభవంగా బయలుదేరుతారు. ఈ దివ్య రథయాత్రను ప్రత్యక్షంగా దర్శించడం, రథాల తాళ్లను భక్తిశ్రద్ధలతో లాగడం వల్ల జగన్నాథుడి అనుగ్రహం లభించి పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని కోట్లాది మంది భక్తులు విశ్వసిస్తారు.
ఇక, పూరీ జగన్నాథ రథయాత్రలో ప్రధాన వేడుకతో పాటు ముందు, తర్వాత జరిగే ప్రతి ఆచారానికీ విశేష ప్రాధాన్యత ఉంటుంది. స్నానయాత్రలో దేవతలకు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం కొద్ది రోజుల పాటు భక్తులకు దర్శనం ఉండదు. ఆ తర్వాత జూలై 15న నబజౌబన దర్శన్‌తో తొలి దర్శనం కల్పిస్తారు. అనంతరం జూలై 20న హేరా పంచమి, జూలై 24వ తేదీన తిరుగు ప్రయాణమైన బహుదా యాత్ర.. జూలై 25వ తేదీన బంగారు ఆభరణాలతో అలంకరించే సునా బేష.. జూలై 27వ తేదీన జరిగే నీలాద్రి బిజేతో జగన్నాథ రథోత్సవాలు ముగుస్తాయి
ప్రతి ఏడాది ప్రత్యేక పవిత్ర వృక్షాలతో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి కోసం మూడు భారీ చెక్క రథాలను కొత్తగా నిర్మిస్తారు. జగన్నాథుడి నందిఘోష రథం పసుపు-ఎరుపు రంగు వస్త్రాల అలంకరణతో, 16 చక్రాలతో, సుమారు 45 అడుగుల ఎత్తులో నిర్మిస్తారు. బలభద్రుడి తాళధ్వజ రథం ఆకుపచ్చ-ఎరుపు రంగుల కలయికతో 14 చక్రాలతో గంభీరంగా కనిపిస్తుంది. ఇక సుభద్రాదేవి దర్పదళన లేదా దేవదళన రథం నలుపు-ఎరుపు రంగు వస్త్రాలతో 12 చక్రాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మూడు రథాల ఆకృతులు, రంగుల అలంకరణ, చక్రాల సంఖ్య భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ రథాల నిర్మాణం కూడా జగన్నాథ రథయాత్రలో ప్రత్యేక సంప్రదాయం.
ఇక, రథయాత్ర రోజున పహండి బిజే ఆచారంలో దేవతల విగ్రహాలను ఆలయం నుంచి రథాల వరకు నృత్య భంగిమల్లో తీసుకువస్తారు. తర్వాత పూరీ గజపతి మహారాజు బంగారు చీపురుతో రథాల పరిసరాలను శుభ్రం చేసే ‘ఛేరా పహన్రా’ ఆచారాన్ని నిర్వహిస్తారు. దేవుని ముందు రాజైనా, సామాన్యుడైనా అందరూ సమానమే అనే సందేశాన్ని ఈ ఆచారం చాటిచెబుతుంది. ఆ తర్వాత లక్షలాది మంది భక్తులు రథాలను గుండిచా ఆలయం వరకు భక్తిశ్రద్ధలతో లాగుతారు.
పూరీ జగన్నాథ ఆలయ గర్భగుడిలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉన్నప్పటికీ, రథయాత్రను మాత్రం అన్ని మతాల వారు, విదేశీయులు కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహోత్సవానికి విస్తృత భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణలు అమలు చేస్తారు. అందువల్ల ముందుగానే ప్రయాణం, వసతి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సమానత్వం, సేవాభావం, భక్తి, మోక్ష మార్గాన్ని చాటిచెప్పే ఈ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక మహోత్సవంగా నిలిచింది.
ఈ జగన్నాథ రథయాత్రను భారతదేశంలో పాటు పాకిస్తాన్‌లో, ముఖ్యంగా ఆ దేశంలోని అతిపెద్ద నగరం, సింధ్ రాష్ట్ర రాజధాని అయిన కరాచీలో కూడా జరుపుకుంటారు. ఈ వేడుకలు ప్రధానంగా కరాచీలో, అక్బర్ రోడ్‌లోని రత్తన్ తలావ్ వద్ద ఉన్న శ్రీ స్వామినారాయణ మందిరం , మారి మాతా ఆలయం చుట్టూ నిర్వహిస్తారు. ఇస్కాన్ పాకిస్తాన్, పాకిస్తాన్ న్యూ వైకుంఠ ధామ్ భక్త సమాజ్ వంటి సమూహాలతో సహా హిందూ సమాజం ఈ ఉత్సాహభరితమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ… వందలాది మంది భక్తులు అలంకరించిన రథాలను లాగడానికి, భక్తి గీతాలు ఆలపించడానికి, ఊరేగింపులో పాల్గొనడానికి గుమిగూడతారు. ముఖ్యంగా,పాకిస్తాన్‌లోని హిందూ మైనారిటీ ప్రజలకు ఈ పండుగ చాలా ముఖ్యమైనది.
అత్యంత వైభవమైన ఈ రథయాత్ర ఒకప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్‌లో జరిగిందని చాలా తక్కువ మందికి తెలుసు. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ధమ్రాయి రథయాత్ర, ఆ ప్రాంతంలోని అత్యంత వైభవమైన జగన్నాథ ఉత్సవాలలో ఒకటిగా పరిగణిస్తారు. ధమ్రాయ్ అనేది ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఢాకా నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణం. ఇక్కడ ఆషాఢ బీజ మాసంలో జరిగే రథయాత్రను దాదాపు ఐదు శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు.
Leave a Reply