కాకినాడ జిల్లా, తుని: ఏపీలో సంచలనం సృష్టించిన రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై రెండు వారాలు గడిచినా, ఇప్పటికీ ఈ కేసులో ఎటువంటి కీలక ఆధారం దొరకకపోవడం కలకలం రేపుతోంది. థర్మల్ డ్రోన్లు, వందల మంది పోలీసు బలగాలతో విస్తృత గాలింపు చేపట్టినప్పటికీ, చిన్నారి జాడ దొరక్కపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జూన్ 6న అదృశ్యమైన పాప కోసం జూన్ 22 వరకు గాలింపు కొనసాగుతున్నా, ఫలితం లేకపోవడంతో కేసు దర్యాప్తులో పోలీసులు కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చారు.

అడవి, వన్యప్రాణులు.. కానీ సాక్ష్యాలేవీ!
జాహ్నవి కుటుంబం ఉంటున్న దొండవాక సీహెచ్ అగ్రహారం సమీపంలో దట్టమైన అడవి ఉంది. ఇక్కడ అడవి జంతువులు, కొండ చిలువల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో, పాపను ఏదైనా జంతువు లాక్కెళ్లిపోయిందేమో అన్న అనుమానం మొదట్లో వ్యక్తమైంది. అయితే, అటవీ శాఖ అధికారులు దీనిని తోసిపుచ్చారు. ఆ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ జంతువుల వల్ల మనుషులు మరణించినట్లు దాఖలాలు లేవని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఈ కోణాన్ని పక్కన పెట్టారు.
వేటగాళ్ల ఉచ్చుపై పోలీసుల ఫోకస్
ప్రస్తుతం దర్యాప్తు సంస్థల దృష్టి అడవిలో వేటగాళ్ల కార్యకలాపాలపై పడింది. అడవిలో పిట్టలను, జంతువులను వేటాడేందుకు కొందరు వేటగాళ్లు రకరకాల ఉచ్చులు అల్లడం, కొన్నిచోట్ల అక్రమంగా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ (కరెంట్ తీగలు) ఏర్పాటు చేయడం ఆచారంగా మారింది.
పోలీసుల తాజా అనుమానం ఏంటంటే:
- అప్రమత్తత లోపం: పాప ఆడుకుంటూ వెళ్లిన క్రమంలో తెలియక ఏదైనా విద్యుత్ ఉచ్చులో చిక్కుకొని చనిపోయిందా?
- సాక్ష్యాల మాయం: ఒకవేళ చిన్నారి ప్రమాదవశాత్తు చనిపోతే, తమ అక్రమ వేట బయటపడుతుందనే భయంతో ఆ వేటగాళ్లు పాప మృతదేహాన్ని తరలించారా?
- అపహరణ కోణం: లేక పాపను బ్రతికి ఉండగానే ఎత్తుకెళ్లి, ఎక్కడైనా అమ్మేసే అవకాశం ఉందా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

దర్యాప్తులో సవాళ్లు
వేటగాళ్ల జాబితా సేకరించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఎవరు అడవిలోకి వస్తున్నారు? వేటగాళ్లు ఎవరు? అనే వివరాలు సేకరించడం కష్టసాధ్యంగా మారింది. మరోవైపు, ఈ కేసు దర్యాప్తు తీవ్రత పెరగడంతో, అడవిలోకి ఎవరూ రావడం లేదని, గాలింపులో భాగంగా పెరిగిన జన సంచారం వల్ల జంతువులు కూడా ఆ ప్రాంతం నుండి పారిపోయాయని తెలుస్తోంది.
స్థానిక గ్రామాల్లోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్న పోలీసులు, ఎవరైనా అనుమానితులు పాపను తరలించారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. రెండు వారాలుగా బిడ్డ కోసం తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం. జాహ్నవి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది, కానీ ఆ చిన్నారిని సురక్షితంగా వెతికి పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.

Leave a Reply