మరింత మిస్టరీగా జాహ్నవి మిస్సింగ్ కేసు..
13 రోజులుగా అడవంతా అణువణువూ గాలింపు..
చిన్నారి ప్రాణాలతోనే ఉందా?
లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టుగా..
ఇంతవరకూ ఒక్క క్లూ కూడా దొరక్కపోవడమేంటి?
మిస్సింగ్ కేసు ఇక మిస్టరీగానే మిగిలిపోనుందా?
మరి, అడవిలోకెళ్లిన చిన్నారి ఏమైనట్టు?
ఏపీలో సంచలనంగా మారిన చిన్నారి జాహ్నవీ అదృశ్య ఘటన రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. చిన్నారి జాడ కోసం అడవంతా అణువణువూ జల్లెడ పట్టినా.. ఈ కేసులో ఇప్పటివరకూ ఒక్క క్లూ కూడా దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారం అటవీ ప్రాంతంలో జూన్ 6న నాన్న దగ్గరకంటూ ఇంటి నుంచి బయటకెళ్లిన రెండేళ్ల చిన్నారి ఇంతవరకూ తిరిగిరాలేదు. జాహ్నవి ఆచూకీ కోసం భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. డ్రోన్లు, ట్రాకింగ్ బృందాలు, ప్రత్యేక పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్లు, అటవీ శాఖ సిబ్బంది కలిసి గాలింపు చేపడుతున్నప్పటికీ ఒక్క ఆధారం కూడా దొరక్కపోవడం దర్యాప్తు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇక సీహెచ్.అగ్రహారం తోటలో నివాసం ఉంటున్న బాధిత తల్లిదండ్రులు భవానీ, గణేష్ దంపతులను బుధవారం హోంమంత్రి అనిత, ఎంపీ సతీష్‌బాబు, ఎమ్మెల్సీ రాజశేఖరం తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు. దర్యాప్తు వివరాలను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మంత్రికి వివరించారు.
అదేవిధంగా, సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా కొండ ప్రాంతంలో అడవి జంతువులు, కొండ చిలువలు ఏమైనా సంచరిస్తున్నాయా..? అని తెలుసుకునేందుకు థర్మల్ కెమెరాలను అమర్చారు. అందులో భాగంగానే మంగళవారం ఏర్పాటు చేసిన మాంసాహారంతో కూడిన బొమ్మల్ని, సీసీ కెమెరాలను అధికారులు పరిశీలించారు. ఎక్కడా జంతువుల సంచారం కనిపించకపోవడంతో చిన్నారి జంతువుల బారిన పడలేదని కొంతవరకూ స్పష్టమవుతోంది.మరోవైపు, స్థానిక చెరువులు, నేల బావులను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు పూర్తిస్థాయిలో జల్లెడ పట్టాయి. పెంపుడు కుక్క పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కొంత స్పష్టత రావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇక, పెద్దాపురం డీఎస్పీ తిలక్ (Peddapuram DSP Tilak)ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. కేవలం 35 నిమిషాల వ్యవధిలో బాలిక మిస్సయిందని చెప్పుకొచ్చారు. చిన్నారి జాహ్నవి సమాచారం తెలిసిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. జీడీ పిక్కలు ఏరుకునే వారిని కూడా పిలిచి చిన్నారి గురించి విచారించామని తెలిపారు. పాప మిస్సయిన చోట బొమ్మలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని ఎలాంటి క్లూ దొరకలేదని వెల్లడించారు. దీంతో, రోజురోజుకూ చిన్నారి ఆచూకీపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
మరోపక్క, చిన్నారి అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైందా.. అన్న కోణంలోనూ పరిశీలిస్తున్నామన్నారు డీఎస్పీ తిలక్. 6 కిలోమీటర్ల పరిధిలో వెతికామని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 10 కిలోమీటర్ల వరకు గాలించాయని వివరించారు. 170 ఫోన్ కాల్స్‌నూ విశ్లేషించి ఆయా వ్యక్తులను నాలుగు బృందాలు విచారిస్తున్నాయన్నారు. చిన్నారి ఇనుప కంచె దాటి వెళ్లిన తర్వాత ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే దిశగా కేడీపేట వరకు రెండు బృందాలు వెళ్లాయన్నారు. 15 రోజుల క్రితం సంచార జాతులకు చెందిన కొందరు ఈ ప్రాంతానికి వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్లారని, వీరి కోసం ఆరా తీస్తున్నామని వెల్లడించారు.
ఇక, అటవీ ప్రాంతంలో జంతువుల కదలికలను గుర్తించేందుకు ఫారెస్టు అధికారులు థర్మల్ డ్రోన్లు, ట్రాకర్లను వినియోగిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కాకినాడ రేంజర్ శ్రీదీప్తి ఆధ్వర్యంలో శ్రీశైలం నుంచి వచ్చిన హనుమాన్ టీమ్, ఫారెస్టు అధికారులు నాలుగు ప్రదేశాల్లో ట్రాకర్లు అమర్చారు. మరోపక్క పెంపుడు కుక్క పోస్టుమార్టం నివేదిక వచ్చేందుకు వారం రోజులు సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ నివేదికపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply