Jahnavi Missimg Case

జాహ్నవి మిస్సింగ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..
ఘటనా స్థలంలో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌..
ఫెన్సింగ్‌కు వేలాడుతున్న రెండు మాంసపు బొమ్మలు..
కేసులో కీలకంగా మారిన కుక్క పోస్టుమార్టం రిపోర్ట్‌..
పెంపుడు కుక్కపై విష ప్రయోగం జరిగిందా?
12 రోజులైనా కనిపించని చిన్నారి జాడ..
500 మందితో జల్లెడ పట్టినా.. నో క్లూ !
జాహ్నవి ఏమైనట్టు..?
అసలేంటీ మిస్సింగ్‌ మిస్టరీ!




12 రోజులైంది.. చిన్నారి జాహ్నవి కానరాక. అడవంతా జల్లెడ పట్టినా.. ఈ కేసులో ఇప్పటివరకూ చిన్న క్లూ కూడా దొరకలేదు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేపట్టారు. కానీ నో యూజ్‌.. నెక్ట్స్‌ ఘటనా స్థలంలో థర్మల్ డ్రోన్స్‌, హనుమాన్‌ బృందాలు వంటి స్పెషల్‌ టీమ్స్‌తో గాలింపు చేపట్టారు. రెండేళ్ల పాప కనిపించకుండాపోయి పన్నెండు రోజులైనా ఇంకా కనిపెట్టకపోవడమేంటి? ఇప్పుడిదే అందరిమదిలో ఉన్న ప్రశ్న.

జాహ్నవి ఏమైనట్టు..?

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. మొదట పెద్దాపురం డివిజన్‌కు చెందిని 200 మంది పోలీసులతో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ.. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయినా ఫలితం దక్కలేదు…! చిన్న చీమ కదిలినా వెంటనే పసిగట్టే థర్మల్‌ డ్రోన్స్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీని వాడారు. కానీ నో యూజ్‌..! ఈ కేసులో అడవి జంతువుల దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాల నుంచి కిడ్నాప్ వరకు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పటివరకూ చిన్న క్లూ కూడా దొరక్కపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కేసులో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు:

మిస్సైన మొదటి రోజు నుంచి ఇవాళ్టి వరకు చిన్నారి మిస్సింగ్‌ మిస్టరీ ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. మొదట ఇది మిస్సింగ్ కేసు అన్నారు. కుటుంబ సభ్యులతో పాటు కలిసి పోలీసులంతా చుట్టుపక్కల ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. డే2, డే3 కూడా అదనపు బలగాలను రంగంలోకి దించి… డ్రోన్‌లను ఎగరేసి అడవంతా అణువణువూ గాలించారు.. అయినా, పాప దొరకలేదు. ఇక డే4 ఈ మిస్సింగ్‌ మిస్టరీలో మరో ట్విస్ట్.. అప్పటిదాకా మిస్సింగ్ మిస్సింగ్ అన్నోళ్లంతా… ఇది పక్కా కిడ్నాపంటూ… మిస్సింగ్ కేసుని కాస్త కిడ్నాప్‌గా మార్చేశారు. జాహ్నవి తల్లి కూడా తోట దాటి పాప ఎక్కడికి వెళ్లదని… ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఆరోపించింది. దీంతో, అప్పటిదాకా ఉన్న మిస్సింగ్ కేసు.. కిడ్నాప్‌ కేసుగా మారింది.

మిస్సింగ్ కేసులో కొత్త అనుమానాలు

రోజులు గడిచేకొద్దీ… మరింత మిస్టరీగా మారుతున్న ఈ కేసులో ఏడో రోజు తర్వాత కొత్త అనుమానాలు వ్యక్తమయ్యాయి. జాహ్నవి కొండచిలువ బారిన పడి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు. అలాంటప్పుడు మాత్రమే దుస్తులు సహా ఎలాంటి ఆనవాళ్లు కూడా కనిపించకపోవచ్చని అభిప్రాయపడటం అందరికి ఆవేదనకు గురిచేసింది. అదిగో వస్తుంది… ఇదిగో వస్తుందనుకుంటున్న తల్లిదండ్రుల బాధను రెట్టింపు చేసింది. ఇక డే 10 అండ్ డే 11కి పరిస్థితి మొత్తం మారిపోయింది. ఓవైపు ఖచ్చితంగా తిరిగొస్తుందన్న జ్యోతిష్యుడి మాటలు, మరోవైపు పోలీసుల సీన్ రీకన్‌స్ట్రక్షన్‌తో పాప దొరుకుతుందని భావించినా ఫలితం దక్కలేదు. ఇక పదకొండో రోజు జాహ్నవి అదృశ్యం అయిన ప్రాంతంలో మాంసంతో కూడిన రెండు బొమ్మలను అమర్చి, కెమెరాలు పెట్టారు. ఏదైనా అడవి జంతువు అటువైపు సంచరిస్తూ బొమ్మపై దాడి చేస్తే… కేసుకి ఉపయోగం అవుతుందని భావించి ఈ తరహా ప్రయోగం చేసినా ఫలితం శూన్యం.

ఘటనా స్థలంలో మాంసపు బొమ్మలు

సీహెచ్‌ అగ్రహారం గ్రామం కొండ ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది గనుక అక్కడ కొండచిలువలు, ఇతర క్రూర మృగాల సంచారం ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పాపపై ఏదైనా జంతువు దాడి చేసి ఉంటే, అదే జంతువు మళ్లీ అదే ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మాంసం వాసన ఆ జంతువుల త్వరగా ఆకర్షిస్తుంది. జంతువుల ద్వారా ప్రమాదం జరిగిందా లేదా అన్న సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి పోలీసులు మాంసం నింపిన బొమ్మలు పెట్టారు. బొమ్మలు పెట్టడంపై పెద్దాపురం డీఎస్పీ తిలక్ స్పష్టతనిచ్చారు. బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా ఇచ్చిన ఆయన, పాప ఆచూకీ కోసం గత 12 రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం సెల్‌ఫోన్ టవర్ల డంప్ డేటాను కూడా పరిశీలిస్తున్నామన్నారు. పాప తన పెంపుడు కుక్కతో కలిసి ఫెన్సింగ్ వరకు వెళ్లినట్లు ఒక వ్యక్తి చూశాడని, ఆ సమయంలో కుక్క ఆ వ్యక్తిని కరిచినట్లు విచారణలో తేలిందన్నారు. అడవి జంతువు దాడి చేసి ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని, ఒకవేళ జంతువు దాడి చేస్తే అది మళ్లీ అదే ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నందునే ఘటనా స్థలంలో రెండు బొమ్మలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వివరించారు. అలాగే పామాయిల్ తోటల్లో పనిచేసే కూలీల కదలికలపై కూడా నిఘా ఉంచినట్లు తెలిపారు.

పెంపుడు కుక్కకు పోస్టుమార్టం పూర్తి..రిపోర్టుపై సర్వత్రా ఆసక్తి

జాహ్నవి మిస్సింగ్‌ కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క జూన్ 13న అనుమానస్పదంగా చనిపోయింది. అయితే కుక్కది సహజ మరణమా, అనారోగ్య కారణమా లేక విష ప్రయోగం వంటిది ఏమైనా జరిగిందా అనే దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో, కుక్కకు ఎన్.సూరవరం వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించి, నమూనాలను సేకరించి విశాఖ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో ఏం తేలుతుందనేదీ ఆసక్తికరంగా మారింది.

చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసుపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. చిన్నారి క్షేమంగా ఇంటికి రావాలని ఆకాంక్షించిన ఆమె.. ఈ కేసు పురోగతిపై ప్రతిరోజు జిల్లా ఎస్పీతో మాట్లాడుతున్నానని తెలిపారు. త్వరలోనే పాప తల్లిదండ్రులైన భవాని, గణేష్‌లను తాను స్వయంగా వెళ్లి కలుస్తానని, ఆ తల్లికి తన పూర్తి మద్దతు ఉంటుందని హోంమంత్రి హామీ ఇచ్చారు. అలాగే చిన్నారిని గుర్తించడంలో సహాయపడుతూ అకస్మాత్తుగా చనిపోయిన డాగ్ స్క్వాడ్ కుక్కకు పోస్ట్ మార్టం నిర్వహించారని, ఆ రిపోర్ట్ వస్తే మరింత స్పష్టత వస్తుందని ఆమె తెలిపారు.

మరింత మిస్టరీగా మారిన కేసు

జాహ్నవి అదృశ్యమై పదకొండు రోజులైనా అనేక ప్రశ్నలు స్థానికులను వేధిస్తున్నాయి. నివాస ప్రాంతానికి సమీపంలోనే ఉన్న పామాయిల్ తోటల నుంచి పాప అంత ఆకస్మికంగా ఎలా మాయమైంది? ఒకవేళ అడవి జంతువు దాడి చేస్తే దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేదా ఆనవాళ్లు ఎక్కడ? పాప,పెంపుడు కుక్క వెళుతుండగా చూసిన మనిషి మాట నిజమేనా? ఆ రోజు ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తులెవరు, తోటల్లో పనిచేసే కూలీల ప్రమేయం ఏమైనా ఉందా? లేక పాపను కిడ్నాప్ చేశారా అన్న ప్రశ్నలు ఈ కేసును మిస్టరీగా మార్చుతున్నాయి.

కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

ఇక మరోవైపు, గ్రామ పరిసర ప్రాంతాల్లో పోలీసులు,ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యల్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ఎంత ప్రయత్నించినా జాహ్నవి జాడ మాత్రం దొరకట్లేదు. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసుని.. ఆ దేవుడైనా చేధించకపోడా అన్న ఆశతో తల్లిదండ్రులు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. చిన్నారి క్షేమంగా ఇంటికి రావాలని కుటుంబ సభ్యులతో పాటుగా స్థానికులు ప్రార్థిస్తున్నారు.



Leave a Reply

Your email address will not be published.