మీ ఇంట్లో ఎవరైనా క్యాన్సర్‌తో బాధపడుతున్నారా? క్యాన్సర్ రకాన్ని బట్టి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, లేదా ఇమ్యునోథెరపీ,టార్గెటెడ్ థెరపీ వంటి పద్ధతులను ఫాలో అవుతున్నారా? అయితే ఈ రియల్ స్టోరీని మీరంతా తెలుసుకోవాలి. మొదటగా నా విన్నపం. ఇక్కడ నేను క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పడం లేదు. కానీ మేం ఎదుర్కొన్న పరిస్థితిని చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలామందికి అవగాహన కల్పిస్తుందని, ఇక ఎవరూ మాలాగా బాధపడకూడదని నా ఆశ. తపన. నేను ఇందులో నా కుటుంబంలో నేను ఎదుర్కొన్న అనుభవాలను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఈ సమాజానికి తెలియాలి. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే క్షమించండి.
ఇదంతా నేను ఈ లోకానికి ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే.. మేం చేసిన కొన్ని తప్పులు ఇక ఏ ఒక్కరూ కూడా చేయకూడదని మా అక్కచెల్లెళ్ల తపన. ఓ ఎనిమిది నెలల పాటు స్వయానా మా కళ్లతో చూసి, మేం అనుభవించిన బాధను చెప్పుకోవాలని అనిపించింది.
నాకు బాగా గుర్తుంది. ఆరోజు జనవరి 26, 2025. ఆ రోజు నా రెండో అక్కకి డెలివరి అయ్యింది. మా ఫ్యామిలీ అంతా హాస్పిటల్ వద్దే ఉన్నాం. నా పెద్ద అక్క కూడా ఎంతో సంతోషంగా అక్కడకు వచ్చింది. బేబీని చూసి అందరం చాలా ముచ్చటపడ్డాం. కుటుంబమంతా కలిసి అప్పుడే పుట్టిన మా చిట్టి మహాలక్ష్మీని చూసుకుంటూ ఎంతో ఆనందగా ఉన్నాం. ఆ రోజు మధ్యాహ్నం అందరం కలిసి ఎంతో సంబరంగా ముచ్చట్లు చెప్పకుంటూ భోజనం చేశాం.
అయితే, ఆ రోజు హాస్పిటల్ దగ్గరకు రావడానికి ముందు మా పెద్ద అక్క తనకు కడుపులో నొప్పిగా ఉందని, ఏం తినకపోయినా కడుపు ఉబ్బరంగా ఉందని డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఫుడు పాయిజన్ అయ్యిండొచ్చు అనుకుంది. డాక్టర్‌ను కలిసి విషయం చెప్పింది. పొత్తికడుపు పైభాగంలో, కుడివైపు, ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే పక్కటెముకల పంజరం కింద ఏదో నొప్పిగా ఉంటుందని డాక్టర్‌తో చెప్పింది. డాక్టర్ బెడ్‌పైన పడుకోమని చెప్పి ఒకసారి అక్క చెప్పిన ప్లేస్‌లో గట్టిగా ప్రెస్ చేశారు. అంతే… అక్క నొప్పితో కొన్ని క్షణాలు విలవిలలాడిపోయింది. ఎందుకంటే అది సాధారణ నొప్పి కాదు. వెంటనే డాక్టర్‌కు అనుమానం వచ్చింది.. కొన్ని టెస్టులు చేయాలన్నారు. ఇక అదే రోజు టెస్టుల కోసం బ్లడ్ సాంపిల్స్ ఇచ్చి, రెండో అక్కకు డెలివరీ అయినా హాస్పిటల్‌కు బేబీని చూడ్డానికి వచ్చింది. రిపోర్ట్ రెండ్రోజుల్లో వస్తాయ్ అని. . ఏదో సాధారణ గ్యాస్ ప్రాబ్లం అని చెప్పింది. మేం కూడా అదెదో సాధారణంగా వచ్చిపోయే ఆరోగ్య సమస్య అనుకున్నాం. కానీ ఆ రోజు మాకు తెలియలేదు. అది ప్రాణంతక వ్యాధి అని. తనకు అదే చివరి ఏడాది అవుతుందని.
తర్వాత వారంలో రిపోర్ట్స్ రానే వచ్చాయ్.. డాక్టర్ వెంటనే సిటీ స్కాన్ , అల్ట్రాసౌండ్ తియ్యాలన్నారు. ఆ రిపోర్టులు కూడా వచ్చాయ్. అక్కకు ఫోన్ చేసి అడిగాం రిపోర్ట్ లు అంతా ఓకేనా అని.. అప్పుడు చెప్పింది.. చిన్నబోయిన గొంతుతో.. ఎంతో దిగులుగా.. లేదు..లివర్ మీద ఏవో చిన్న చిన్న గడ్డలు ఉన్నాయ్ అని. డాక్టర్ బయాప్సీ తీయాలన్నారు. బసవతారకం వెళ్లమన్నారు అని. విన్న తర్వాత నాకు నోట మాట రాలేదు. వెంటనే ఫోన్ పెట్టాశాను. నా రెండో అక్కతో షేర్ చేశాను. అప్పటికే అక్కకు కూడా విషయం తెలిసింది. తనూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. అసలు ఏదో జరగబోతుందో తెలియదు కానీ, మా మనసంతా భయం ఆవహించింది.
కరెక్ట్‌గా ఆ రోజు, వరల్డ్ క్యాన్సర్ డే, ఫిబ్రవరి 4. అదే రోజున బసవతారకంలో అడుగు పెట్టారు. బయాప్సీ కోసం.. అక్కడ ఎండోస్కోపీ, బయాప్సీ, ఆ తర్వాత ఐహెచ్సీ టెస్టులు చేశారు. వారం తర్వాత రిపోర్టుల కోసం అందరం వెళ్లాం. రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నాం. బుర్రలో వంద ఆలోచనలు…క్యాన్సర్ హాస్పిటలో ఇన్ని టెస్టులు ఎందుకు చేశారు. అసలు ఏం జరగబోతుందో తెలియడం లేదు. డాక్టర్ రావడం లేట్ అయ్యింది. ఇక డాక్టర్ వచ్చే వరకూ ఆగలేక ఆ రిపోర్టులను తెలిసిన డాక్టర్లకు పంపాం. వారు క్యాన్సర్ అని నిర్ధారించారు. కన్నీటిని కిందకు ఏమాత్రం జారనీయకుండా.. బరువెక్కిన గుండెతో, నోటి వెంట సాయిరాం సాయిరాం తప్ప రెండో పదం లేదు..
ఇంతలో డాక్టర్ రానే వచ్చారు. అక్కని బయటనే కూర్చోబెట్టి.. మేమంతా రిపోర్ట్స్‌తో డాక్టర్ వద్దకు వెళ్లాం. డాక్టర్ అడిగారు మీ పెద్ద వాళ్లలో ఎవరికైనా క్యాన్సర్ ఉందా అని.. లేదని చెప్పాం, అప్పుడు డాక్టర్ చెప్పారు అక్కకు పాన్‌క్రియాస్ క్యాన్సర్ అని.. మా గొంతులు మూగబోయాయ్. డాక్టర్ మళ్లీ రోజు రమ్మన్నారు. బయటకు రాగానే అక్క అడిగింది. డాక్టర్ ఏమన్నారని, తనకు ఏమని చెప్పాలి. కనీసం ఆ టైమ్‌లో తన ముఖం చూసే ధైర్యం కూడా లేకపోయింది. ఎందుకంటే నిజం దాచి అబద్ధం చెప్పాలి కదా.. ఏం లేదు లివర్ మీద చిన్న గడ్డ ఉంది. అది ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది అని చెప్పాం. హమ్మయ్యా.. అదే కదా నాకు క్యాన్సర్ ఏమో అని భయపడ్డా..అయినా నా ఏజ్‌కు లివర్ కి క్యాన్సర్ రాదులే అంటూ నవ్వుతూ రిలాక్స్ అయ్యింది. ఇక ఆ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాం పిల్లలను ఎంతో ఆప్యాయంగా హత్తుకుంది. తనకు క్యాన్సర్ కాదు అనే భావనతో తనూ ఎంతో ఆనందంగా ఉంది.
మళ్లీ రోజు డాక్టర్ దగ్గరకు వెళ్లాం.. క్యాన్సర్‌ను ఎలా అయినా నయం చేయండి డాక్టర్ ఆమె వయస్సు 35 ఏళ్లు, చిన్న బిడ్డలు ఉన్నారు అని చెప్పాం. డాక్టర్ అన్నారు ఇది చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉంది. ఇది పాన్‌క్రియాస్ క్యాన్సర్.. అందులోనూ లివర్ మీద 11 cm గడ్డ ఉంది అని. మరో విషయం ఏంటంటే ప్యాన్క్రియాస్ క్యాన్సర్‌లో లైఫ్ టైమ్ ఈ స్టేజ్‌లో చాలా తక్కువ ఉంటుంది. మాగ్జిమం 3 టు 6 మంత్స్ అన్నారు. అంతా షాక్. వెంటనే డాక్టర్ కాళ్లమీద పడి వేడుకున్నాం. దీంతో డాక్టర్ మా బాధను చూసి.. ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం.. కీమో + ఇమ్యూనోథెరపీ అన్నారు. అయితే డాక్టర్ ముందే చెప్పారు. ఈ క్యాన్సర్‌లో టైప్స్ ఉన్నాయి. అందులోనూ ఇది కొలాంజియో కార్సినోమా. ఇది ట్రీట్మెంట్కు రెస్పాండ్ కాదు. ఒకవేళ రిజల్ట్ ఉంటే మాత్రం సర్జరీకి ట్రై చేద్దాం లేదంటే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసి కనీసం 5 ఐళ్ల లైఫ్ టైమ్‌కు ట్రై చేద్దాం అన్నారు. కానీ డాక్టర్ పేషంట్ కి క్యాన్సర్ అనే విషయం చెప్పడమే మంచిదన్నారు. తనకు ఇష్టమైన ప్లేసేస్, ఇష్టమైన ఫుడ్ ఇలా తను ఏం అడిగితే అది చేయమన్నారు. ఇక చేసేదేం లేక క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. కిమోస్ ఇప్పిస్తే తగ్గిపోద్ది. తర్వాత చిన్న సర్జరీ చేస్తారు అని చెప్పాం. అప్పుడు తలవంచుకుని సైలెంట్‌గా ఉండిపోయింది.
అసలు అక్క చేసి తప్పు ఏంటి? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? కనీసం ఎప్పుడూ బయట ఫుడ్ కూడా తినదు, చాలా హెల్త్ కేర్ ఎక్కువ. బయటకు వెళ్తున్నా, వాటర్ బాటిల్, అండ్ హోమ్ ఫుడ్ మెయింటైన్ చేసేది. అలాంటి అమ్మాయికి ఇంతటి దారుణమైన క్యాన్సర్ ఎలా వచ్చింది. వారసత్వంగా ఎవరికీ లేదు.. ఆమెకు ఎలాంటి డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ హాబిట్స్ లేవు.. మరి ఈ క్యాన్సర్ ఎలా వచ్చింది. ఇదే ప్రశ్న డాక్టర్ దగ్గర వెళ్లి అడిగా. డాక్టర్ అన్నారు ఇది చాలా రేర్ క్యాన్సర్.. ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది షుగర్ పేషంట్స్ లో లేదా ఎక్కువ స్మోకింగ్ హాబిట్స్ ఉన్నవారిలో వస్తుంటుంది. అది కూడా ఈ క్యాన్సర్ అంత త్వరగా బయటపడదు.. 50 ఏళ్ల తర్వాత లేట్‌గా బయటపడుతుంటుంది. కానీ, ఇంత ఎర్లీ ఏజ్‌లో ఈ క్యాన్సర్ రావడం బాధాకరం అన్నారు.
అక్కకు 2025 ఫిబ్రవరి లో క్యాన్సర్ బయటపడిన నాటికి ఆరేళ్ల బాబు, అలాగే మరో ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నారు. తనూ జీవితంలో చాలా కష్టపడింది, తనో సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఇటు ఇంటిని,అటు ఉద్యోగాన్ని సమన్వయం చేసుకుంటూ ఎవ్వరిని నొప్పించకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా తనలోనే దాచుకున్న ఓ పల్లెటూరి రైతు బిడ్డ. ఆ ఇంటికి పెద్ద బిడ్డ. తన వెన్నంటి పుట్టిన ఇద్దరి చెల్లిళ్లకు ఓ గొప్ప మార్గదర్శి. ముగ్గురు చూడముచ్చటైన అక్కచెల్లెళ్లు. ఆ ముగ్గురే వారి ఆస్తి అనుకుని ఆ రైతు దంపతులు ఎంతో కష్టపడి చదివించుకున్నారు. ముగ్గురిని పీజీలు చదివించి పెళ్లిళ్లు చేశారు. అందరూ ఎక్కడి వాళ్లక్కడ సంతోషంగా బతుకుతున్నారని సంబరపడ్డారు. ఇంతలోనే కాలం కన్నుకుట్టింది. ఇంతటి దారుణం జరిగింది.
ఇక మొత్తంగా అక్కకు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేపించాం. నెలలో మూడు శనివారాలు ట్రీట్మెంట్, ఒక్కో వారానికి రెండున్నర లక్ష ఖర్చు, ఒక నెల గడిచిపోయింది. బరువు తగ్గడం, జుట్టు ఊడిపోవడం మొదలైంది. మానసికంగా భయం కూడా మొదలైంది. ఒక్కసారి యాదగిరిగుట్టకు వెళ్లొద్దాం అని అడిగింది. క్యాన్సర్ అని తెలిసి కూడా ధైర్యం కూడగట్టకుని యాదగిరి గుట్టకు వెళ్లి ఈ జబ్బు నయం చెయ్యి నాయనా అనుకుంటూ గుండు చేపించుకుంది. రోజులు గడుస్తూ ఉన్నాయ్..మళ్లీ నెల కూడా ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యింది. అలా రెండు నెలలు గడిచాయ్, అలానే మూడు, నాలుగు, ఐదు నెలలు గడిచాయ్. డాక్టర్ మళ్ళీ టెస్టులు చేసి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవడం లేదు. ఇక ట్రీట్మెంట్ ఆపేద్దాం అన్నారు. వేరే మెడిసిన్ ట్రై చేద్దాం అన్నారు, ఆ ట్రీట్మెంట్కు అరికాళ్లు, అరిచేతులు నల్లగా పోతాయి, చల్లగాలి తగిలితే షాక్ కొట్టినట్టుగా ఉంటుందన్నారు. అప్పటికే అక్క జీవితం మీద విసిగిపోయింది అయినా సరే ఆ ట్రీట్మెంట్కు కూడా సరే అంది. ఎందుకంటే తన మనసంతా తన బిడ్డల మీదే ఉంది. వాళ్ల కోసం ఎలా అయినా బతకాలని ఎంత కష్టమైనా భరించాలని అనుకుంది. ఆ ట్రీట్మెంట్ కూడా మొదలైంది..ఒంట్లో శక్తి అంతా క్షీణించింది. ఒక్క అడుగు కూడా వేయలేని స్థితికి వచ్చింది. చివరికి ఇక లేవలేని స్థితి. ఒక్కొసారి సడెన్‌గా కంటిచూపు పోయేది. కొన్ని క్షణాల పాటు చూపు కనబడకుండా కళ్లు బ్లాంక్ అయ్యేవి. అంతా చీకటిగా అనిపించగానే పెద్దగా అమ్మ అమ్మ అంటూ తన అమ్మ కోసం వెతుకుతూ పెద్దగా అరుస్తూ తన అమ్మను హత్తుకుని ఏడ్చేది. నన్ను ఎందుకు కన్నావమ్మా అంటూ భోరున విలపించింది. ఈ కష్టం నేను భరించలేకపోతున్నా అంటూ, ఏడ్చే శక్తి కూడా లేక మనసులోనే బాధను అనుభవిస్తూ మౌనంగా పడుకునేది. తన చివరి రోజుల్లో చూసేవారికి ఒక స్కెలెటన్ బెడ్ మీద పడుకుని ఉంది అనిపించేలా మనిషి రూపం పూర్తిగా కోల్పోయింది. ఆ టైమ్‌లో తనూ ఎవరిని కలవడానికి ఇష్టపడలేదు. బంధువులు, ఫ్రెండ్స్ ఎవ్వరినీ తన వద్దకు రానివ్వలేదు. చాలా వరకూ ఒక్కటే తలుపు వేసుకుని తన దుప్పటి మొత్తం తడిచిపోయేలాగా మౌనంగా కన్నీరు కార్చేది. ఎప్పుడు చూసినా మొహం ఎవరికీ కనబడకుండా తలవంచుకునే మాట్లాడేది. అది ఇప్పటికీ నా కళ్లలోనే మెదులుతోంది.
క్యాన్సర్ బయటపడింది మొదలు తనతో ఎదురుగా కూర్చుని మాట్లాడే ధైర్యం మాకు లేకపోయింది. ఎందుకంటే తననూ చూడగానే ఏడుపు కంట్రోల్ చేసుకునే శక్తి మాలో లేదు. మేమంతా షాక్‌లో ఉన్నాం. తన ముందుకు వెళ్లిన కాసేపు కూర్చుని ఏవో మాటలు చెప్పి, నవ్వించడానికి ప్రయత్నించేవాళ్లం, ఇంట్లో అందరం ఒకరు మార్చుకుని ఒకరు తన వద్ద కూర్చుని తనకు కాళ్లు పడుతూ.. మాటలు చెబుతూ ఉండేవాళ్లం. అప్పుడు తను కూడా నాకు త్వరగా తగ్గిపోతుంది, నాకు క్యాన్సర్ అని మీరు బాధపడకండి అని మాకు బదులు చెప్పేది.
రోజులు గడుస్తున్నాయ్…గడ్డ పెరిగిపోయింది. లివర్ పూర్తిగా పాడైపోయింది. పొట్టకు ఒక పైప్ ఫిక్స్ చేశారు. రోజుకు మూడు లీటర్ల రక్తపు రంగులో నీటిని బయటకు తీసేవాళ్లం. ఆ నీరు పొట్టలో ఉంటే 9 నెలల గర్భిణీలా ఉండేది. ఆ నీటిని బయటకు తీయగానే మళ్లీ అస్థిపంజరంలా మారిపోయేది. అలా చివరికి తనను మనుషులను గుర్తుపట్టలేని స్థితి రానే వచ్చింది.డైలీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఆకలి దప్పిక మర్చిపోయి మరీ తన ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నించాం. ఎంత ప్రయత్నం చేసినా తనకు చివరి రోజులు రానే వచ్చాయి. మాట పడిపోయింది. మూడు రోజుల పాటు పెయిన్ తెలియకుండా డాక్టర్లు తనకు మత్తు ఇస్తూ వచ్చారు. ఎవర్నీ గుర్తుపట్టడం లేదు. ఇక లాభం లేదు.. ఆమెను ప్రశాంతంగా పంపించేద్దామా లేక ఇలా నరకం అనుభవించేలాగా ఉంచుదామా అని డాక్టర్ అడిగారు. మా అమ్మ అడిగింది.. ఒక్కసారి మత్తు ఇవ్వకుండా సృహలోకి తెప్పించి మాట్లాడిపించండి సార్ అని. డాక్టర్ కాళ్ల మీద పడిపోయింది. డాక్టర్ ఒక్కటే అన్నారు అలా చేయడం వల్ల నీ బిడ్డ నరకం అనుభవిస్తది అని. అంతే చివరికి ఆ తల్లే తన బిడ్డ ప్రశాంతంగా చనిపోవడానికి అంగీకరించింది. డాక్టర్లు తన చావుకు 24 గంటల సమయం పెట్టారు. గంట గంట సమయం గడిచిపోతుంది. బంధువులంతా వచ్చి చూసిపోతున్నారు.
మనసులో వంద ఆలోచనలు..తను ఆ నరకం నుంచి విముక్తి అవుతుందనే భావన ఒకవైపు.. తను ఇక పూర్తిగా ఈ లోకం నుంచి మమ్మల్ని విడిచి వెళ్లిపోతుందే అనే వేదన మరోవైపు.. ఏడుపు కూడా ఆగిపోయింది.. ప్రతిక్షణం నరకం అనుభవిస్తున్న తన ఆఖరి క్షణం కోసం అలా చూస్తూ ఉండిపోయాం. అప్పుడు అనిపించింది…ఎక్కడైనా తప్పు చేశామా అనే భావన మనసులో వస్తూ ఉంది. తను బతకదని తనకు ముందే ఎందుకు చెప్పలేదు..చివరి నెల వరకూ అక్క ఎక్కువ రోజులు బతకదనే నిజం.. అమ్మ నాన్నలకు కూడా తెలియదు. నీవు బతుకుతావు అని అక్కకు, అక్క బతుకుతుంది అని అమ్మ నాన్నకు ఆశ కల్పిస్తూ కాలం వెళ్లదీశాం. ఇలానే చివరి వరకూ రోజులు నెట్టుకొచ్చాం. ఇప్పుడు అనిపిస్తుంది.. మా ఇద్దరి అక్కచెల్లెళ్లకు..అక్కకు నిజం చెప్తే బాగుండేదేమో అని.. ఎందుకు అలా చేశామా అనే బాధ మాలో ఉండిపోయింది. ఒక రకంగా ఆ బాధ మమ్మల్ని మానసికంగా వేధిస్తోంది. ఇక మా జీవితాంతం ఆ గీల్టీ ఫీల్ ఉండిపోతుంది. ఈ బాధ ముందు ఇక ఏ ఆనందాన్ని మేం మా జీవిత కాలంలో అనుభవించలేం ఏమో అనే వైరాగ్యం వచ్చేసింది. ఇప్పుడు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఒకే ఎక్స్ప్రెషన్. ఎక్కువ బాధపడటం లేదు. ఎక్కువ సంతోషపడటం లేదు.
అయినా మీరే చెప్పండి.. అసలు ఆ టైమ్‌లో అక్కకు నిజాన్ని ఎలా చెప్పాలి.. ఏడాది బిడ్డను కలిగి ఉన్న అక్కకు బతుకు మీద కొండంత ఆశ ఉంది. క్యాన్సర్‌తో పోరాడి గెలిచి మళ్లీ తన ఇద్దరు బిడ్డలను మనసారా హత్తుకోవాలని, వారికి ఇష్టమైనవన్నీ వండి పెట్టాలని తపించింది. ఆ సమయంలో నీకు బతుకు లేదు అని ఎలా చెప్పాలి. అందుకే నువ్వు చనిపోతుబోతున్నావ్ అని.. చెప్పకపోవడమే బెటర్ అనిపించి మౌనంగా ఉండిపోయాం.
నిజం చెప్పాలంటే మేం చెప్పకపోయినా చివరి రోజుల్లో తనకు తన లైఫ్ అర్ధమైంది. మా కళ్లలోకి చూసి మాట్లాడలేక తల వంచుకుని, తన గొంతులోని బాధ మాకు తెలియకుండా మాట్లాడుతూ మాకు ధైర్యం చెప్పేది. మా నాన్నకు చెప్పేది. నువ్వు బాధపడకు నాన్న.. నాకు తగ్గిపోతుంది అని. ఒక్కటే బాధ.. మనసారా తనతో మాట్లాడి ఇది పరిస్థితి అని చెప్పి, తన మనసులోని బాధనంతా మేం తన మాటల్లో వినివుంటే తను మాకు ఏం చెప్పి ఉండేది. చివరిలో ఏదో చెప్పడానికి ట్రై చేసింది అప్పటికీ నోరు పడిపోయింది. చేతులు కాళ్లు పనిచేయలేదు.
క్యాన్సర్ రకాన్ని బట్టి కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్లు ముందే చెప్పేస్తారు. మనం ఏం చేసినా సరే… పేషంట్ లైప్ టైమ్ మహా అయితే ఇంకో 6 నెలలు అని. ఏడాదిలోపే అని. అయినా సరే పేషంట్ కుటుంబ సభ్యులు ఎంత ఖర్చైనా మేం అప్పు చేసైనా పెట్టుకుంటాం డాక్టర్.. ట్రీట్మెంట్ చేసి ఎలా అయినా బతికించండి అని అడుగుతుంటారు. కానీ వాళ్లకు తెలియని దారుణమైన నిజం ఏంటంటే అలా అడగి ఆ పేషంట్‌కు మనమే నరకం చూపించబోతున్నాం అని. మొత్తంగా డాక్టర్‌ను బతిమాలి ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు చేస్తారు. అలా నాలుగైదు నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాకా..ఇక ఆ పేషంట్ చివరికి పాలియేటివ్ కేర్ వార్ట్కు చేరుతుంది. పాలియేటివ్ కేర్ అంటే తెలుసు కదా.. చావుకు ముందు రోజుల్లో ఆ వార్డులో పేషంట్‌కు పెయిన్ తెలియకుండా ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే నొప్పి తెలియకుండా చనిపోయేందుకు సాయం చేస్తారు. ఇక నో ఎమర్జెన్సీస్..అప్పటికే ఆ కుటుంబ సభ్యులు కూడా అలసిపోయుంటారు. సిచ్యుయేషన్ ఎలా మారుతుందంటే ముందు ఆ పేషంట్ ని బతికించమని డాక్టర్ కాళ్ల మీద పడి అడిగిన వారే చివరికి, అయ్యో, ఈ మనిషికి త్వరగా చావు వస్తే బాగుండు.. ఈ బాధ చూడలేకపోతున్నాం అనే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ పాన్‌క్రియాస్ క్యాన్సర్‌లో ట్రీట్మెంట్కు వెళ్లే ముందు మాకు ఏం చెప్పారు అంటే.. 6 వీక్స్ వరకూ ట్రీట్మెంట్కి మీరు మనీ పెట్టుకోవాలి , ఆ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ, నెలలో మూడు వారాలు ఉంటుంది. ఒక వారం గ్యాప్ ఉంటుంది. ప్రతీ వారం రెండున్నర లక్ష అవుతుంది. ఆ తర్వాత 5 వారాల వరకు మేం ఫ్రీగా ఆ మెడిసిన్ ఇస్తాం అన్నారు. కానీ మాకు అర్థమైన అసలు విషయం ఏంటంటే.. ఈ ఆరు వారాల తర్వాత ఆ అసలు ఆ మెడిసన్ అవసరం ఉండదని. ఎందుకంటే ఆ ఆరువారాల ట్రీట్మెంట్లోనే తెలిసిపోతుంది ఆ మెడిసిన్‌కు క్యాన్సర్ రెస్పాండ్ అవుతుందా లేదా అని.. అనుకున్నట్టే.. ఇక ఆ ట్రీట్మెంట్తో నో యూజ్ అన్నారు డాక్టర్. వేరే మెడిసిన్ మార్చాలన్నారు. ఏంటో ఈ మెడికల్ సిస్టం. కొంచం ఆలోచించాల్సిందే. అయినా తప్పు మాదే లే.. లైఫ్ టైమ్ లేదని డాక్టర్ ముందే చెప్తే…. లేదు లేదు… ప్లీజ్ ట్రీట్మెంట్ చేయండి అని కాళ్లమీద పడి మరీ అడిగింది మేమే కదా..సో ఇలాంటివి అనుభవించాల్సిందే.
చివరిగా దయచేసి నా విన్నపం ఒక్కటే. క్యాన్సర్ అనేది 1,2, 3 స్టేజెస్‌లో లేదా 4వ స్టేజ్ఉన్నప్పటికీ డాక్టర్ ఈ పేషంట్ కి నయం చేయగలం అని భరోసా ఇస్తేనే డబ్బు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించండి. అలాకాకుండా ఆ పేషంట్ బతకడం కష్టం చాలా క్రిటికల్ స్టేజ్‌లో ఉంది అని డాక్టర్ చెప్తే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్కి వెళ్లకండి. ఇక్కడ నాఉద్దేశ్యం డబ్బు వృధా పోతుంది అని కాదు.. ఆ పేషంట్ ను స్వయాన మీరే ఇబ్బంది పెట్టిన వారవుతారు. మనసు గట్టిగా చేసుకుని ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటారాని భావిస్తున్నాను. ఇంతగా ఎందుకు చెబుతున్నా అంటే ఈ పరిస్థితిని స్వయానా మేం అనుభవించాం. ఇక లాస్ట్ 24 గంటలే ఆమె లైఫ్ టైమ్ అని డాక్టర్ చెప్పిన ఆ క్షణం ఎప్పటికీ మరిచిపోలేం. అది తలుచుకుంటే ఇప్పటికీ గుండె బరువెక్కి గూస్‌బంస్స్ వస్తుంటాయ్. బెడ్‌మీద నుంచి ఎన్నిసార్లు ఉలిక్కి పడి లేచానో.. మా కళ్ల ముందే ఆమె పడిన నరకయాతనను చూశాం. రోజుకు 24 ట్యాబ్లెట్లు, అన్నం తినాలనే కోరిక కానీ తినలేని పరిస్థితి, ఓన్లీ వాటర్‌లో ప్రోటీన్ పౌడర్ కలిపి తాగించేవాళ్లం, ఆ సమయంలో నేను తినే ప్రతీ అన్నం ముద్దా ఎంతో వేదనతో తిన్నాను. అక్క ఈ ముద్ద తినలేకపోతుందే అనే బాధతో అల్లాడిపోయాను. ఇప్పటికీ ఆమె లేదు అనే ఫీలింగ్ నా మైండ్లోకి రావడం లేదు. మా కుటుంబం కంటినిండా నిద్రపోయి ఎన్నిరోజులవుతుందో కూడా చెప్పలేను.
మా కుటుంబంలో జరిగిన ఈ విషాదాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఇది చాలా మందికి అవగాహన కల్పిస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్యూ సో మచ్

Leave a Reply