మీ వాట్సాప్‌లో త్వరలో ఫోన్ నంబర్ కనిపించకుండా… కేవలం యూజర్‌నేమ్తోనే చాట్ చేసే కొత్త ఫీచర్ రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. యూజర్ల ప్రైవసీని మరింత పెంచే ఈ ఫీచర్‌పై తొలుత అందరూ ఆసక్తి చూపించారు. కానీ ఇప్పుడు ఇదే ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మెటాకు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ… భారత్‌లో ఈ ఫీచర్ అమలుపై తాత్కాలికంగా బ్రేక్ వేసింది. అసలు ఈ యూజర్‌నేమ్ ఫీచర్‌లో ఉన్న ప్రమాదాలేంటి? కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందడానికి గల కారణాలేంటి? సైబర్ నిపుణులు చెబుతున్న హెచ్చరికలు ఏమిటి? ఈ ఫీచర్ నిజంగా ప్రైవసీకి వరమా… లేక సైబర్ మోసాలకు కొత్త దారినా?
ముందుగా అసలు ఈ యూజర్‌నేమ్ ఫీచర్ ఏంటో తెలుసుకుందాం. ఫోన్ నంబర్ ప్రైవసీని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వాట్సాప్ కొత్త యూజర్‌నేమ్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో ఇతరులతో చాట్ చేయడానికి మీ ఫోన్ నంబర్‌ను షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం మీరు ఎంచుకున్న యూజర్‌నేమ్ ద్వారానే చాటింగ్ కొనసాగించవచ్చు. ప్రస్తుతం యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకునే ప్రక్రియను వాట్సాప్ ప్రారంభించింది. యూజర్‌నేమ్‌లో కనీసం 3 నుంచి గరిష్ఠంగా 35 అక్షరాలు ఉండేలా నిబంధనలు ఉన్నాయి. అలాగే ప్రముఖులు, సెలబ్రిటీలు లేదా అత్యున్నత హోదాల్లో ఉన్న వ్యక్తుల పేర్లను యూజర్‌నేమ్‌గా ఉపయోగించకుండా పరిమితులు విధిస్తోంది. ముఖ్యంగా పెద్ద వాట్సాప్ గ్రూపుల్లో చేరినప్పుడు ఫోన్ నంబర్ ఇతరులకు కనిపించకుండా, యూజర్ల వ్యక్తిగత గోప్యతను కాపాడటమే ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశమని వాట్సాప్ చెబుతోంది.
ఇక,వాట్సాప్‌లో కొత్త యూజర్‌నేమ్‌ను ఎంచుకునే ముందు, కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. కొత్త యూజర్‌నేమ్ ఇంతకు ముందు ఎవరూ ఉపయోగించనిదిగా ఉండాలి. కొన్ని నియమాలు వర్తిస్తాయి, ఉదాహరణకు, చాలా చిన్న పేర్లు, కేవలం అంకెలు మాత్రమే ఉన్న పేర్లు, లేదా కొన్ని ప్రత్యేక అక్షరాలు ఉన్న పేర్లు ఆమోదించరు. మీరు ఎంచుకున్న యూజర్‌నేమ్ అందుబాటులో లేకపోతే, మీరు మరొకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ ఈ ఏడాది జూన్ 29న తన యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రకటించింది. కంపెనీ చెప్పిన దాని ప్రకారం, వినియోగదారులు ఇప్పుడు తమ ఫోన్‌లను సురక్షితంగా ఉంచుకోవడానికి యూజర్‌నేమ్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ కొందరు యూజర్‌లకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ ఫీచర్ సంవత్సరం చివరి నాటికి పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావాలని మెటా ఆలోచన చేస్తోంది.
ఈ కొత్త ఫీచర్ ప్రైవసీకి మరో రక్షణ లేయర్‌గా కంపెనీ భావిస్తోంది. మెసేజ్ పంపాలనుకునే ఎవరైనా వారి యూజర్‌నేమ్ స్పెల్లింగ్‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులు ఒక ప్రత్యేకమైన పేరును ఎంచుకోవాల్సి ఉంటుందని వాట్సాప్ తన బ్లాగ్‌లో పేర్కొంది. కావాలనుకుంటే, వారు యూజర్‌నేమ్ జనరేటర్ ఫీచర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ క్రియేటర్లు ,వ్యాపార సంస్థలు తమ ఆన్‌లైన్ ఇమేజ్‌ను బలోపేతం చేసుకోవడానికి సహాయపడుతుంది. వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లడం ద్వారా ఈ ఫీచర్‌ను పొందవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్ళాక, అకౌంట్‌పై క్లిక్ చేసి, అక్కడ మీ యూజర్‌నేమ్‌ను నమోదు చేసుకోవచ్చు. ఇలాంటి యూజర్ నేమ్ ఫీచర్‌ను ఇప్పటికే టెలిగ్రామ్‌లో అందుబాటులో ఉంది. ఆ యూజర్ నేమ్ ఫీచ్ కారణంగా టెలిగ్రామ్‌లో చాలా మోసాలు జరుగుతున్నాయనే ఆందోళన బలంగా ఉంది.
అయితే, మెటా మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీసుకొచ్చిన ఫీచర్ విషయంలో సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుపరిచిత వ్యక్తుల పేర్లతో నకిలీ యూజర్‌నేమ్స్ సృష్టించి, ప్రజలను మోసం చేసేందుకు ఈ ఫీచర్ అవకాశం కల్పిస్తోందని హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏదో ఒక యూజర్‌నేమ్‌ను అంచనా వేసి నేరుగా మెసేజ్ చేసే అవకాశం ఉండటంతో స్పామ్ కాల్స్, సందేశాలు పెరిగే అవకాశం ఉందని సైబర్ నిపుణుల వాదన. ఫోన్ నంబర్లు గోప్యంగా ఉంచడం వరకు బాగున్నా.. మోసాలను అరికట్టడానికి తగిన భద్రతా చర్యలు లేకపోతే టెలిగ్రాం తరహా మోసాలకు వాట్సప్ వేదికగా మారుతుందన్న ఆందోళనలూ నెలకొన్నాయి. కానీ, వాట్సాప్ మాత్రం యూజర్‌నేమ్‌ను క్రియేట్ చేసుకోవడం వల్ల పరిచయం లేని వ్యక్తులు, కొత్తవాళ్లలతో ఇకపై ఫోన్ నంబర్‌ను ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెబుతోంది. ఈ ఆందోళనల నడుమ కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని మెటాను ఆదేశించింది. యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకునే ప్రక్రియ ఇప్పటికే మొదలు కావడంతో భారత్‌లో దీనిని ఆపేయాలని సూచించింది.
మరోవైపు, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, మొబిక్విక్ సహవ్యవస్థాపకుడు బిపిన్ ప్రీత్ సింగ్ సహా పలువురు పరిశ్రమ ప్రముఖులు కూడా ఈ ఫీచర్‌పై సందేహాలు వ్యక్తం చేశారు. ప్రముఖులు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలను పోలిన యూజర్‌నేమ్‌లతో మోసాలు పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ప్రకారం, మీరు మీ ఫోన్ నంబర్ ఇవ్వకుండానే ఒక యూజర్‌నేమ్ పెట్టుకుని ఇతరులతో మాట్లాడవచ్చు. ఇది ప్రైవసీకి మరింత భద్రత కల్పించే ఫీచర్‌గా అనిపించినా, ప్రభుత్వం దీనిపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందో ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త ఫీచర్‌కు బ్రేక్ వేయడానికి ప్రధానంగా 8 ముఖ్య కారణాలు ఉన్నాయని కేంద్రం పేర్కొంటోంది.అవేంటంటే..
మొదటిది.నిజమైన ఐడెంటిటీ తెలుసుకోవడం కష్టం: ప్రస్తుతం వాట్సాప్ నంబర్ ద్వారా ఎవరనేది ట్రాక్ చేయడం సులభం, యూజర్‌నేమ్ వస్తే అది కష్టమవుతుంది.
2.డిజిటల్ అరెస్ట్ స్కామ్స్: ఫేక్ యూజర్‌నేమ్స్‌తో సైబర్ నేరగాళ్లు అమాయకులను ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తామని బెదిరించే ప్రమాదం ఉంది.
3.ఐడెంటిటీ థెఫ్ట్: బ్యాంకులు, ప్రభుత్వ శాఖల పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించి మోసాలు చేయవచ్చు.
4.ఫిషింగ్ దాడులు: బ్యాంకింగ్ లావాదేవీల పేరుతో లింకులు పంపి, మీ డబ్బును కొల్లగొట్టే అవకాశం ఉంది.
5.పోలీస్ ఇన్వెస్టిగేషన్: ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు, నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు చాలా కష్టతరమవుతుంది.
- ఐటీ చట్టం (IT Rules 2021): ఈ ఫీచర్ దేశంలోని ప్రస్తుత ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అనే స్పష్టత లేదు.
7.ముఖ్యంగా వృద్ధులకు చాలా ప్రమాదం: టెక్నాలజీపై అవగాహన తక్కువ ఉన్నవారిని, ఈ ఫేక్ అకౌంట్స్ ద్వారా సులభంగా నమ్మించి మోసం చేయవచ్చు.
8.సోషల్ ఇంజనీరింగ్: నమ్మకమైన వ్యక్తుల్లా నటించి, మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఛాన్స్ ఉంది.
యాంకర్
“సో.. ఈ కొత్త ఫీచర్ వెనకున్న ప్రమాదాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకునే ఉంటారు. మీ భద్రత కోసమే ప్రభుత్వం మెటాని (Meta) వివరణ కోరింది. ‘ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు?’, ‘ఒకవేళ మోసం జరిగితే బాధ్యత ఎవరిది?’ అనే ప్రశ్నలకు మెటా సమాధానం ఇచ్చే వరకు ఈ ఫీచర్ రాదు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రైవసీ ముఖ్యం అంటారా, లేక భద్రత ముఖ్యమంటారా? కామెంట్ చేయండి.

Leave a Reply