EPFO 2026 New Rules:పీఎఫ్‌లో భారీ మార్పులు! 20 రోజుల్లో క్లెయిమ్ సెటిల్

ఉద్యోగుల భవిష్యనిధి వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. పీఎఫ్ క్లెయిమ్‌లు, పెన్షన్ ఫిక్సేషన్, ఇన్సూరెన్స్ సెటిల్‌మెంట్లు ఇకపై మరింత వేగంగా పూర్తయ్యేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సోషల్ సెక్యూరిటీ కోడ్-2026 పేరుతో రూపొందించిన ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఇప్పటి వరకు అమల్లో ఉన్న పాత పథకాలు పూర్తిగా కొత్త రూపంలోకి మారుతున్నాయి. దీంతో ఉద్యోగుల పీఎఫ్ వ్యవస్థలో పెద్ద రిఫార్మ్ ప్రారంభమైంది.

ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఈపీఎఫ్-1952, ఈపీఎస్-1995, ఈడీఎల్‌ఐ-1976 స్థానాల్లో ఇకపై కొత్త పథకాలు అమల్లోకి రానున్నాయి. అవి… ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్-2026, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్-2026, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్-2026. ఈ మూడు పథకాల ప్రధాన లక్ష్యం ఒక్కటే… ఉద్యోగులకు క్లెయిమ్‌లు వేగంగా అందించడం, వ్యవస్థను పూర్తిగా డిజిటల్‌గా మార్చడం.

ఈ కొత్త నిబంధనల్లో అత్యంత కీలకమైన అంశం క్లెయిమ్ సెటిల్‌మెంట్ టైమ్‌లైన్. ఇకపై అర్హత ఉన్న పీఎఫ్ క్లెయిమ్‌లను ఎలాంటి సహేతుక కారణం లేకుండా 20 రోజుల్లోగా పరిష్కరించాల్సిందే. ఒకవేళ ఆలస్యం జరిగితే సంబంధిత ఈపీఎఫ్‌ఓ అధికారిపై 12 శాతం వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. అంతేకాదు… ఆలస్యానికి సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ఆ అధికారి జీతం నుంచే మినహాయించి ఉద్యోగికి పరిహారంగా చెల్లించే విధానాన్ని కూడా కేంద్రం స్పష్టం చేసింది.

ఈ నిబంధనతో పీఎఫ్ క్లెయిమ్‌లు ఇకపై ఆలస్యం అయ్యే అవకాశం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. గతంలో క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో నెలల తరబడి ఆలస్యం జరుగుతుందనే ఫిర్యాదులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు టైమ్‌బౌండ్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు.

ఇక మరో కీలక మార్పు డిజిటల్ సేవలకు సంబంధించినది. ఈపీఎఫ్‌ఓ సేవలు ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉండాలి. ఎంప్లాయర్లు, పీఎఫ్ కార్యాలయాలు, అలాగే పీఎఫ్ నుంచి మినహాయింపు పొందిన ట్రస్టులు కూడా ఉద్యోగులకు ఆన్‌లైన్ క్లెయిమ్ సదుపాయం తప్పనిసరిగా ఇవ్వాలి. దీంతో ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంటి నుంచే అన్ని సేవలు పొందే అవకాశం ఉంటుంది.

పాక్షిక ఉపసంహరణల విషయంలో కూడా కేంద్రం కఠిన మార్పులు చేసింది. ఇకపై పీఎఫ్ ఖాతా నుంచి ఏడాదికి గరిష్ఠంగా రెండు సార్లు మాత్రమే పాక్షిక విత్‌డ్రా చేయడానికి అనుమతి ఉంటుంది. గతంలో అనారోగ్యం వంటి కారణాలతో ఎన్ని సార్లైనా ఉపసంహరణకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నిబంధనను కట్టుదిట్టం చేశారు. అయితే అనారోగ్య కారణం ఉన్నప్పటికీ, ఒక ఏడాదిలో రెండుసార్లకే పరిమితం చేయనున్నారు.

విద్యా అవసరాల కోసం మాత్రం కొంత వెసులుబాటు ఇచ్చారు. ఉద్యోగి తన సర్వీసు కాలంలో గరిష్ఠంగా పది సార్లు విద్య కోసం పీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవచ్చు. అలాగే గృహ నిర్మాణం, ఫ్లాట్ కొనుగోలు, రుణ చెల్లింపు వంటి అవసరాల కోసం గతంలో రెండుసార్లు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని ఐదు సార్లకు పెంచారు.

ఇక మరో కీలక మార్పు కనీస నిల్వ నిబంధన. కొత్త పథకం ప్రకారం పీఎఫ్ ఖాతాలో కనీసం 25 శాతం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. పాక్షిక ఉపసంహరణ చేసిన తర్వాత కూడా ఖాతాలో ఈ కనీస నిల్వ ఉండేలా లెక్కలు రూపొందించారు. ఇందులో ఉద్యోగి వాటా, యజమాని వాటా, అలాగే వడ్డీ మొత్తాన్ని కలిపి లెక్కిస్తారు. దీని ఉద్దేశ్యం ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను కాపాడటం.

సంస్థల పరిధిని కూడా కేంద్రం విస్తరించింది. ఇకపై 20 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థ ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి వస్తుంది. దీనివల్ల ఎక్కువ మంది ఉద్యోగులు సామాజిక భద్రతా వ్యవస్థలోకి వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. యజమాని, ఉద్యోగి ఇద్దరూ 12 శాతం చొప్పున చందా జమ చేయాలి. యజమాని వాటాను ఉద్యోగి జీతం నుంచి మినహాయించడం పూర్తిగా నిషేధించబడింది. అలా చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటారు.

చందా చెల్లింపుల ఆలస్యంపై కూడా కొత్త పెనాల్టీ వ్యవస్థను తీసుకొచ్చారు. రెండు నెలల వరకు ఆలస్యం అయితే 0.25 శాతం అదనపు వడ్డీ, నాలుగు నెలల వరకు 0.5 శాతం, అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే 1 శాతం పెనాల్టీ విధించనున్నారు. దీంతో సంస్థలు సమయానికి చందాలు చెల్లించేలా ఒత్తిడి పెరుగుతుంది.

ఉద్యోగి విత్‌డ్రా సమయంలో వడ్డీ లెక్కింపుపై కూడా మార్పులు చేశారు. ఆర్థిక సంవత్సరానికి వడ్డీ నిర్ణయించకపోతే గత సంవత్సరం వడ్డీ ఆధారంగానే చెల్లింపు జరుగుతుంది. ఒకవేళ వడ్డీ తగ్గినా ఉద్యోగికి నష్టం జరగకుండా, ముందుగా ఉన్న రేటును పరిగణలోకి తీసుకుంటారు. ఈ విధంగా ఉద్యోగికి రక్షణ కల్పించారు.

నామినీ నిబంధనల్లో కూడా మార్పులు చేశారు. వివాహానికి ముందు ఇచ్చిన నామినీ వివరాలు ఇకపై చెల్లవు. వివాహం జరిగిన వెంటనే కొత్త నామినీ వివరాలు సమర్పించడం తప్పనిసరి. లేకపోతే క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

పెన్షన్ వ్యవస్థలో పెద్దగా మార్పులు చేయకపోయినా, దాన్ని పూర్తిగా డిజిటల్, పారదర్శకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. పెన్షన్ లెక్కింపు ఫార్ములా యథాతథంగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

ఈ కొత్త పథకాల అమలు కోసం ఈపీఎఫ్‌ఓ ఐటీ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసింది. అందుకోసం జూన్ 26 నుంచి సర్వర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు అప్‌గ్రేడ్ పూర్తవడంతో సేవలు మళ్లీ ప్రారంభం కానున్నాయి.

మొత్తానికి ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్-2026 ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యనిధి వ్యవస్థను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లింది. క్లెయిమ్‌ల వేగవంతమైన పరిష్కారం, డిజిటల్ సేవల విస్తరణ, కఠిన నిబంధనలు… ఇవన్నీ కలిపి ఉద్యోగుల సామాజిక భద్రత వ్యవస్థను మరింత బలపరిచే ప్రయత్నంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.