Impact on India’s Monsoon: ఎల్ నినో బలపడుతోంది! ఇస్రో ఉపగ్రహం కీలక సంకేతాలు.. భారత్‌లో వర్షాలపై తీవ్ర ప్రభావం?

భారతదేశంలో వర్షాలు ఎలా ఉండబోతున్నాయో.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న ఓ మార్పు నిర్ణయించగలదు. అదే ఎల్ నినో. ఇప్పుడు ఈ ఎల్ నినో బలపడుతోందనే కీలక సంకేతాలను ఇస్రోకు చెందిన EOS-06.. అంటే Oceansat-3 ఉపగ్రహం గుర్తించింది.

సముద్రంలో ఉండే అతి చిన్న జీవులు ఫైటోప్లాంక్టన్. ఇవే సముద్ర ఆహార గొలుసుకు పునాది. వీటిలో ఉండే క్లోరోఫిల్-ఏ పరిమాణం తగ్గిపోతున్నట్లు Oceansat-3 గుర్తించింది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది.

అసలు ఎల్ నినోకు.. ఈ క్లోరోఫిల్ తగ్గడానికి సంబంధం ఏంటి? ఎల్ నినో సమయంలో పసిఫిక్ సముద్రంలో వెచ్చని నీరు తూర్పు వైపునకు విస్తరిస్తుంది. దీంతో లోతైన సముద్రం నుంచి పైకి వచ్చే చల్లని, పోషకాలు ఉన్న నీరు తగ్గిపోతుంది. ఫలితంగా ఫైటోప్లాంక్టన్ పెరుగుదల కూడా తగ్గుతుంది. ఆ మార్పునే ఉపగ్రహం అంతరిక్షం నుంచి గుర్తిస్తోంది.

అంతేకాదు.. సాధారణంగా తూర్పు నుంచి పడమర వైపు వీచే సముద్రపు గాలులు కూడా మారుతున్నట్లు Oceansat-3 గుర్తించింది. ఈ గాలి మార్పు కూడా ఎల్ నినో బలపడుతుందనే దానికి ముఖ్యమైన సంకేతం.

ఇక్కడే ఇస్రో ఉపగ్రహం పరిశీలనకు ప్రాధాన్యత ఏర్పడుతోంది. సముద్ర ఉష్ణోగ్రతలో పెద్ద మార్పులు స్పష్టంగా కనిపించకముందే.. క్లోరోఫిల్, గాలుల మార్పుల ద్వారా ఎల్ నినో ప్రభావాన్ని ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.

ఇక భారత్ విషయానికి వస్తే.. ఎల్ నినో బలపడితే నైరుతి రుతుపవనాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. వర్షాలు తగ్గితే వ్యవసాయం, నీటి వనరులపై ప్రభావం పడొచ్చు. అయితే ప్రతిసారీ ఎల్ నినో వస్తే కచ్చితంగా కరువు వస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పలేం.

ప్రస్తుతం ఎల్ నినో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే.. భూమికి 741 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భారత ఉపగ్రహం.. పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పులను ముందుగానే గమనిస్తోంది. ఈ ఎల్ నినో ఎంత బలపడుతుంది.. భారత వర్షాలపై ఎంత ప్రభావం చూపుతుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది.

Leave a Reply

Your email address will not be published.