జాహ్నవి ఎక్కడ..? గోడలపై వెలసిన చిన్నారి పోస్టర్లు.. పోలీసుల సంచలన ప్రకటన!

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్. అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై 25 రోజులు దాటినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసు మరింత మిస్టరీగా మారుతోంది. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పోలీసులు, తుని పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు.

చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయిన వెంటనే తుని రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కాకినాడ జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లోనూ విస్తృతంగా గాలింపు చేపట్టారు. గ్రామ పరిసర ప్రాంతాలు, పొలాలు, చెరువులు, కాలువలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ప్రధాన రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను జల్లెడ పట్టారు. డ్రోన్ల సాయంతో గాలింపు నిర్వహించడంతో పాటు అడవులు, నిర్మానుష్య ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

Jahnavi Missimg Case
Jahnavi Missimg Case

అంతేకాదు, అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా కూడా అన్ని కోణాల్లో విచారణ కొనసాగించినప్పటికీ, చిన్నారి ఆచూకీకి దారితీసే కీలక సమాచారం మాత్రం ఇప్పటివరకు లభించలేదు. ఇప్పటికే 12 ప్రత్యేక బృందాలు నిరంతరం దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ, కేసును ఛేదించే కీలక క్లూ దొరకలేదని పోలీసులు వెల్లడించారు. దీంతో జాహ్నవి అదృశ్యం మరింత మిస్టరీగా మారింది.

ఇక, దర్యాప్తులో భాగంగా చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పరిచయస్తులు, సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో సంచరించిన పలువురిని పోలీసులు విచారించారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, ఇతర డిజిటల్ సమాచారం వంటి అంశాలను కూడా పరిశీలిస్తూ అన్ని అవకాశాలను పరిశోధిస్తున్నారు. ఎలాంటి చిన్న సమాచారం వచ్చినా వెంటనే ధృవీకరిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు.

ఎన్డీఆఫ్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ స్పష్టమైన ఆధారం దొరకకపోవడంతో పోలీసులు ఇప్పుడు ప్రజల సహకారంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. చిన్నారి ఫొటో, వివరాలతో కూడిన గోడపత్రికలను కాకినాడ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతికిస్తున్నారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లను ఏర్పాటు చేసి ఎవరైనా చిన్నారిని గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Missing Toddler Mystery in Kakinada | Police Attach GPS Tracker to Dog in Search Operation
Missing Toddler Mystery in Kakinada | Police Attach GPS Tracker to Dog in Search Operation

చిన్నారి జాడ తెలిపిన వారికి రూ.1 లక్ష నగదు పారితోషికం అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మరింత మంది నుంచి ఉపయోగకరమైన సమాచారం లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు చిన్నారి కుటుంబ సభ్యులు ఆశను వదులుకోకుండా ప్రతి రోజూ ఆమె క్షేమంగా తిరిగి వస్తుందనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. గ్రామస్తులు కూడా పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే తెలియజేస్తున్నారు. చిన్నారి అదృశ్యం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఆమె ఆచూకీ త్వరగా లభించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

జాహ్నవి గురించి ఎవరైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే తుని రూరల్ పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. సమాచారం అందించేందుకు 9440796508, 9440796531, 9440796573 ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. చిన్నారి ఆచూకీకి దారితీసే ప్రతి సమాచారం కీలకమని, ప్రజల సహకారమే దర్యాప్తుకు బలమని పోలీసులు తెలిపారు.

ఇక, మొత్తంగా జాహ్నవి మిస్సింగ్‌ కేసు వివరాలు చూస్తే.. జూన్ 6వ తేదీన మధ్యాహ్నం 11.50 గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న జాహ్నవి కనిపించకుండా పోయింది. పాపతో పాటు పెంపుడు కుక్క కూడా అదృశ్యమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ కుక్క తిరిగి ఇంటికి చేరినప్పటికీ, పాప ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క కూడా మృతి చెందింది.. అయితే.. పాప కనిపించకుండా పోయిన రోజు, ఆ శునకం ఊరిలోని ప్రధాన రహదారిపై ఆందోళనగా తిరుగుతున్న దృశ్యాలు ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కానీ, తర్వాత అది ఎటువైపు వెళ్లిందనే దానిపై పూర్తిగా స్పష్టత రాలేదు. ఆ తర్వాత.. వందలాది మంది సిబ్బంది గాలించినా ఆచూకీ దొరకలేదు. దాదాపు నెల రోజులు కావస్తున్నా పాప ఆచూకీ లభించకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.