gold valcono


బంగారాన్ని విరజిమ్ముతోన్న అగ్నిపర్వతం
ఏటా రూ.18.9 కోట్ల విలువైన బంగారం ధూళి గాల్లోకి!
గాల్లో 60 మైక్రోమీటర్ల వ్యాసం గల అందమైన బంగారు స్పటికాలు..
అంతుబట్టని మిస్టరీగా మారిన బంగారు అగ్నిపర్వతం..
60 మైక్రోమీటర్ల వ్యాసం గల బంగారు స్పటికాలు గుర్తింపు
గాల్లో బంగారు రేణువులు చిమ్మే..
అంటార్కిటికాలోని మౌంట్‌ ఎరెబస్‌ అగ్నిపర్వతం
రోజూ 80 గ్రాముల బంగారం సూక్ష్మ కణాల విడుదల
బంగారం వెయ్యి కి.మీ. దూరం వరకు ప్రయాణం


సాధారణంగా అగ్నిపర్వతాలు అంటే లావా, బూడిద, విషవాయువులు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ అంటార్కిటికాలో ఉన్న ఓ అగ్నిపర్వతం మాత్రం అందుకు పూర్తి భిన్నం. అది ఏటా కోట్ల రూపాయల విలువైన స్వచ్ఛమైన బంగారాన్ని సూక్ష్మ కణాల రూపంలో గాల్లోకి విడుదల చేస్తోంది. ఈ అరుదైన ప్రకృతి విశేషం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుబట్టని మిస్టరీగా మిగిలింది.

అంటార్కిటికాలోని రాస్‌ ద్వీపం సమీపంలో ఉన్న ‘మౌంట్‌ ఎరెబస్‌’ ప్రపంచంలోనే అత్యంత అరుదైన అగ్నిపర్వతం. భూమిపై దక్షిణ దిశలో ఉన్న క్రియాశీల అగ్నిపర్వతం ఇదే. ఇందులో ఎప్పుడూ మరిగే లావా సరస్సు ఉంటుంది. అదే దీని ప్రత్యేకత. 1991 నాటి సర్వే ప్రకారం.. ఈ అగ్నిపర్వతం రోజూ 80 గ్రాముల స్వచ్ఛమైన బంగారు ధూళిని సూక్ష్మ స్ఫటికాల రూపంలో గాల్లోకి విరజిమ్ముతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుత బంగారం ధరల ప్రకారం చూస్తే ఇది రోజుకు సుమారు రూ.5.6 లక్షలు, ఏడాదికి దాదాపు రూ.18.9 కోట్ల విలువ చేస్తుంది.

ఈ మౌంట్ ఎరెబస్ అగ్నిపర్వతం భౌగోళిక దక్షిణ ధ్రువానికి సుమారు 1,350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులోని లావా సరస్సు నుంచి నిరంతరం వెలువడే అగ్నిపర్వత వాయువుల్లో స్వచ్ఛమైన బంగారు సూక్ష్మ కణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కణాలు గాల్లో దాదాపు 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించి, చివరకు అంటార్కిటికా మంచు పొరలపై పడతాయని వారు వెల్లడించారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌తో చేసిన పరిశీలనల్లో ఇవి సాధారణ ధూళి కణాలు కాదని తేలింది. సుమారు 60 మైక్రోమీటర్ల వరకు పరిమాణం కలిగిన అందమైన స్ఫటికాల రూపంలో ఈ బంగారు కణాలు ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు.

అయితే, అగ్నిపర్వత వాయువుల్లో బంగారం ఆనవాళ్లు కనిపించడం కొత్త విషయమేం కాదు.అమెరికాలోని హవాయి కిలావుయా, ఇటలీలోని మౌంట్ ఎట్నా, అలాస్కాలోని ఆగస్టిన్ అగ్నిపర్వతం, మెక్సికోలోని ఎల్ చిచోన్ అగ్నిపర్వతాల్లో కూడా స్వల్ప పరిమాణంలో బంగారం గుర్తించారు.శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, అధిక ఉష్ణోగ్రత కలిగిన అగ్నిపర్వత వాయువుల్లో క్లోరిన్ లేదా సల్ఫర్ సమ్మేళనాలతో కలిసి బంగారం పైకి వస్తుంది.వాయువులు చల్లబడిన తర్వాత బంగారం విడిపోయి సూక్ష్మ స్ఫటికాలుగా మారుతుంది. అయితే, మౌంట్ ఎరెబస్‌లో ఈ ప్రక్రియ ఇతర అగ్నిపర్వతాల కంటే భిన్నంగా జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

కానీ, ఈ బంగారం ఎలా ఏర్పడి గాల్లోకి చేరుతుందన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కొందరు శాస్త్రవేత్తలు అగ్నిపర్వత వాయువులు చల్లబడే సమయంలో బంగారం స్ఫటికాలుగా మారుతుందని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం లావా సరస్సు ఉపరితలంపైనే ఈ స్ఫటికాలు ఏర్పడి, తర్వాత వాయువులతో కలిసి గాల్లోకి ఎగిరిపోతాయని అంచనా వేస్తున్నారు. మూడు దశాబ్దాలకుపైగా పరిశోధనలు సాగుతున్నా ఈ రహస్యం ఇంకా వీడలేదు.

Leave a Reply

Your email address will not be published.