మహిళల్లో 17.8 శాతం..
పురుషుల్లో 20.9 శాతం
ఈ నెంబర్ల వెనుక లెక్క గురించి వింటే గుండె జారిపోతుంది. నాలుక తడారిపోతుంది. గొంతు ఎండిపోతుంది. ఇవి ఓ వ్యాధికి సంబంధించిన నెంబర్లు. పేరులో స్వీట్ ఉంటుంది కానీ.. జీవితంలో స్వీట్ తిననివ్వదు. అదే షుగర్ వ్యాధి.. డయాబెటిస్. నిజానికి ఇది వ్యాధి కాదు. జీవనశైలికి సంబంధించింది. మీకో ఇంకో విషయం చెబుతాను. రోజుకు దాదాపు 8 గంటల పాటు కూర్చొని పని చేస్తున్నారా.. అయితే మీకు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే. దీని గురించి మీకు డీటైల్డ్ గా చెబుతాను. ప్రీ డయాబెటిస్, డయాబెటిస్ స్టేజ్ లో ఏం చేయాలి.. ఎలా ఉండాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
“మన దేశంలో మధుమేహ బాధితుల సంఖ్య రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుతోంది. తాజాగా విడుదలైన NFHS-6 గణాంకాలు యావత్ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఏజ్‌లో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ.. మధ్య వయస్కుల్లోనే డయాబెటిస్ ఎందుకు ఎక్కువగా వస్తోంది? ఇది కేవలం వంశపారంపర్యంగా (Family History) వచ్చే వ్యాధా? లేక మన లైఫ్‌స్టైల్ దీనిని తీవ్రతరం చేస్తోందా? ఫ్యామిలీ హిస్టరీకి, లైఫ్‌స్టైల్ తోడైతే ప్రమాదం ఎంతవరకు పెరుగుతుంది? NFHS-6 గణాంకాలు ఏం చెబుతున్నాయి?
“తాజా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 డేటా ప్రకారం, 2023-24 నాటికి మహిళల్లో డయాబెటిస్ 17.8 శాతానికి, పురుషుల్లో 20.9 శాతానికి చేరుకుంది. 2019-21తో పోలిస్తే ఈ పెరుగుదల చాలా ఆందోళనకరంగా మారింది. ఈ గణాంకాలు యావత్ దేశానికి ఒక పెద్ద హెచ్చరిక. పెరిగిపోతున్న డయాబెటిస్ కేసులను కంట్రోల్ చేయాలంటే.. ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధిపై అవగాహన, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి.
ఇక ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి వస్తోంది. మారుతున్న జీవన శైలి.. ఒత్తిడి.. తగ్గుతున్న శారీరక శ్రమ, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం కారణంగా షుగరు బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. షుగరు ప్రారంభం సమయంలోనే శరీరం పలు సంకేతాలను అందిస్తోంది. చాలామంది ఈ సూచనలను సంవత్సరాల పాటు పట్టించుకోకపోవడం వల్ల.. టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నట్లు గుర్తించారు. షుగరు ప్రారంభం సమయంలో కనిపించే సంకేతాలను నిపుణులు వివరిస్తున్నారు.
ఈ ప్రీ-డయాబెటిస్ అనేది టైప్ 2 మధుమేహం రాకముందు శరీరం ఇచ్చే ఒక హెచ్చరిక, దీన్ని సరైన సమయంలో గుర్తిస్తే షుగర్ రాకుండా నివారించడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రీ డయాబెటిస్ దశలో బ్లడ్ షుగర్ లెవల్స్ సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈ దశలో లక్షణాలు ఎక్కువగా కనిపించవు. టెస్ట్‌లు చేయించుకోవడం ద్వారానే తెలుస్తుంది. దీని నుంచి ఎలా బయటపడాలంటే.. సరైన పోషకాహారం, ముఖ్యంగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే వారానికి కనీసం 150 నిమిషాల మితమైన వ్యాయామం, కండరాలను చురుకుగా ఉంచి ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. అధిక బరువును తగ్గించుకోవడంతో పాటు రోజుకు 7-8 గంటల గాఢనిద్ర మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. లైఫ్స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అవే ఆరోగ్యానికి బలమైన పునాదిని వేస్తాయి.
ప్రీ డయాబెటిక్ సమయంలో శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు మెడ, చేతి కింద భాగాలు లేదా తొడల దగ్గర చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి సాధారణ చర్మ సమస్యలుగా కనిపించినా, వాస్తవానికి శరీరంలో హైపర్ ఇన్సులినీమియా (Hyperinsulinemia) ఉన్నట్లు సూచించే సంకేతాలుగా చెబుతున్నారు. రక్తంలో ఇన్సులిన్ మోతాదు ఎక్కువగా ఉండడం వల్ల ఈ మార్పులు కనిపించే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే మెడ చుట్టూ నల్లగా, వెల్వెట్‌లా కనిపించే చర్మపు మచ్చలను అకాంథోసిస్ నైగ్రికాన్స్గా పిలుస్తారు. అదే విధంగా రాత్రి 3 నుంచి 4 గంటల మధ్య అకస్మాత్తుగా మేల్కొనడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళనగా అనిపించడం వంటి లక్షణాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిల మార్పులతో సంబంధం ఉంటాయి. భోజనం చేసిన తర్వాత మధ్యాహ్న సమయంలో తీవ్రమైన అలసట రావడం కూడా రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగి మళ్లీ పడిపోవడం వల్ల అవుతుంది.
వ్యాయామం చేసినా, తక్కువగా తిన్నా కూడా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గకపోవడం అనేది అధిక ఇన్సులిన్ ప్రభావమే అవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. చక్కెరను ఎక్కువగా తీసుకున్నప్పుడు మెదడులో డోపమైన్ పెరిగి తాత్కాలికంగా హ్యాపీగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. తరువాత బ్లడ్ షుగర్ తగ్గిపోతే మళ్లీ తీపి పదార్థాలు కావాలని శరీరం కోరుకుంటుంది. జీవనశైలిలో మార్పులు కూడా మధుమేహం పెరగడానికి ప్రధాన కారణమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీతో పాటు బిస్కెట్లు తీసుకోవడం, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే అల్పాహారం, తగినంత ప్రోటీన్ లేకుండా భోజనం చేయడం, నిద్రలేమి, ఒత్తిడి, ఎక్కువ సేపు కూర్చునే జీవనశైలి, అధిక చక్కెర వినియోగం వంటి అలవాట్లు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. భోజనం చేసిన వెంటనే నిద్ర వచ్చినట్టు అనిపించడం, ఎప్పుడూ ఆకలిగా ఉండటం, సాయంత్రం అలసట, పొట్ట చుట్టూ కొవ్వు తగ్గకపోవడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ సమస్యలుగా తీసుకుంటారు. ఇవి భవిష్యత్తులో డయాబెటిస్‌కు సంకేతాలు అవుతాయి. శరీరం ముందుగానే ఇచ్చే ఈ చిన్న సంకేతాలను గుర్తిస్తే, జీవనశైలిలో మార్పులు చేసి మధుమేహాన్ని ముందుగానే నియంత్రించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
జీవన శైలిలో మార్పులంటే చాలామంది కాఫీ, టీలలో చక్కెర మానేసి డయాబెటిస్ నుంచి సేఫ్ గా బయటపడ్డామని భ్రమపడుతుంటారు. డయాబెటిస్‌ను అడ్డుకోవాలంటే కేవలం చక్కెరను వదిలేయడం మాత్రమే పరిష్కారం కాదు. దీన్ని అరికట్టాలంటే ఈ చిన్న మార్పులు మాత్రమే సరిపోవు, మీ జీవనశైలి మొత్తం మారాల్సిందే. చక్కెర లేకుండా కాఫీ, టీలు తాగడం మంచిదే, కానీ కేవలం అది మాత్రమే డయాబెటిస్‌ను అడ్డుకోదు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం కోసం చక్కెర మానేయడం కంటే, మీ జీవనశైలిని మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం.
రోజంతా కంప్యూటర్ ముందు 8-10 గంటల పాటు కూర్చోవడం వల్ల కండరాలు గ్లూకోజ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేవు. ఇది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’కు దారితీస్తుంది. ఎక్కువ సేపు కూర్చోవడం అనేది ధూమపానమంత ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మీరు రాత్రిపూట ఆలస్యంగా పడుకుని, తక్కువ సేపు నిద్రపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయకుండా చేస్తుంది. నిరంతర ఒత్తిడి వల్ల శరీరంలో ‘కార్టిసోల్’ హార్మోన్ విడుదలవుతుంది. ఇది మీరు అసలు చక్కెర తీసుకోకపోయినా, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. ‘షుగర్-ఫ్రీ’ లేదా ‘నో షుగర్ యాడెడ్’ అని ఉన్న ప్యాక్డ్ ఫుడ్స్‌లో మైదా, ప్రాసెస్డ్ ఆయిల్స్, అధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి.
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే.. పని వేళల్లో ప్రతి గంటకు ఒకసారి లేచి చిన్నగా నడవడం అలవాటు చేసుకోండి. అలాగే మీ ఆహారంలో పీచు పదార్థం, ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి షుగర్ లెవెల్స్ వేగంగా పెరగకుండా చేస్తాయి. ఇక రోజుకు కనీసం 7-8 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా ప్లాన్ చేసుకోవడంతో పాటు.. యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. చక్కెర మానేయడం మంచి ప్రారంభమే, కానీ పూర్తిస్థాయి రక్షణ కోసం మీ రోజువారీ అలవాట్లే కీలకమని గుర్తుంచుకోండి. చిన్న చిన్న మార్పులే దీర్ఘకాలిక ఆరోగ్యానికి అసలైన పునాది. మీరు నిజంగా డయాబెటిస్ నుండి సురక్షితంగా ఉండాలనుకుంటే మీ లైఫ్‌స్టైల్‌ను ఆరోగ్యకరంగా మార్చుకోవడం ఒక్కటే అసలైన పరిష్కారం.

Leave a Reply