America-Iran Peace Deal

అమెరికా -ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో ఇప్పుడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ భీకర యుద్ధం మధ్యప్రాచ్యాన్ని కుదిపేస్తోంది. ఇలాంటి తరుణంలో అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ అమెరికాతో కుదుర్చుకోబోయే డీల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తాను నమ్ముతున్నట్లు ట్రంప్ ఓవల్ ఆఫీస్ నుండి వెల్లడించారు.

ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించే దిశగా ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని, ఖమేనీ శాంతి ఒప్పందానికి ఆమోదం తెలిపారని ట్రంప్‌ చెప్పారు. మరికొన్ని రోజుల్లో డీల్ ఒప్పందంపై సంతకాలు చేస్తామని, ఒప్పందంపై సంతకాలు కాగానే హోర్ముజ్‌ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. అంతేకాకుండా, ఇరాన్‌పై జరగాల్సిన దాడులను కూడా రద్దు చేస్తున్నట్లు తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ప్రకటించారు.

అయితే, ట్రంప్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని మరోసారి తేలింది. అమెరికాతో ఇరాన్ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ఇరాన్‌కు చెందిన అధికారిక మీడియా వెల్లడించింది. ట్రంప్ ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ మీడియా ప్రకారం, అమెరికాతో ఏ ఒప్పందంపై కూడా ఇరాన్ ఇప్పటివరకు సంతకం చేయలేదని, చర్చలు మాత్రమే జరుపుతున్నట్లు వెల్లడించింది. ట్రంప్ గతంలో కూడా ఇలాంటి ప్రకటనలే చేశారని, వీటిని నమ్మాల్సిన అవసరం లేదని సదరు మీడియా పేర్కొంది.

అయితే, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘేయి మాట్లాడుతూ, “చాలా వరకు ఒప్పందం ముగిసింది.. కానీ, అమెరికా పదేపదే తమ వైఖరిని మారుస్తోందన్నారు. ఇరాన్ తన ‘రెడ్ లైన్స్’ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఖతార్ రాయబారి అలీ అల్-తవాది, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి మధ్య మూడు ప్రధాన అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అవేంటంటే ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, హార్ముజ్ జలసంధిని తెరవడం, ఇరాన్‌ అణు కార్యక్రమం.

ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం చాలా కాలంగా అమెరికా, పాశ్చాత్య దేశాలకు ఆందోళన కలిగిస్తున్న అంశం. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియాన్ని అమెరికాకు అప్పగించాలని, లేదా పూర్తిగా నాశనం చేయాలని డిమాండ్ చేసింది. అయితే తాజా చర్చల్లో ఇరాన్ తన అణు ఆయుధ కార్యక్రమాన్ని కొనసాగించబోమని హామీ ఇవ్వడం, అలాగే అణు నిల్వల భవిష్యత్‌పై ప్రత్యేక చర్చలకు అంగీకరించడం వల్ల చర్చల్లో పురోగతి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక, ట్రంప్ గతంలో పలుమార్లు ఇరాన్ యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని, వాటిని ఇరాన్ వద్ద ఉంచబోమని ప్రకటించారు. అయితే, తాజా చర్చల్లో దీనిపై ట్రంప్‌ కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్‌లోనే ఉంచేందుకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. అయితే, అది ఐక్యరాజ్యసమితి ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలని మెలిక పెట్టారట. ఇక, అణు కార్యక్రమాలపై టెహ్రాన్ ఎలాంటి చర్యలు చేపట్టాలన్నా.. అది అమెరికాతో రెండో డీల్‌ కుదిరిన తర్వాతేనని ట్రంప్‌ షరతు విధించినట్లు తెలుస్తోంది. అయితే, వీటన్నింటికీ ఖమేనీ నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది.

తాజా అవగాహన ఒప్పందంలో భాగంగా 30 రోజుల్లోపు హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz)ని ఎలాంటి టోల్‌ రుసుములు లేకుండా నౌకల రవాణాకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి ప్రతిగా.. అమెరికా ఈ జలమార్గంలో నిర్బంధాన్ని ఎత్తివేయనుంది. ఇక, హర్మూజ్‌ను తెరిచిన తర్వాత 60 రోజుల పాటు ఇరాన్‌కు అగ్రరాజ్యం ఆంక్షల మినహాయింపు కల్పించనుందని తెలుస్తోంది. అంటే టెహ్రాన్‌ చమురు విక్రయాలు చేపట్టేందుకు అనుమతులివ్వనుంది. ఆ తర్వాత ఇరాన్‌ ప్రవర్తనను బట్టి ఈ మినహాయింపులను మరికొన్ని రోజులు పొడిగించే అంశాన్ని కూడా అమెరికా పరిశీలించనుంది.

ఇక, ఈ డీల్ ఎక్కడ జరగనుంది అనే విషయానికొస్తే.. ఇరాన్‌-అమెరికా మధ్య జరగబోయే ఈ బిగ్‌ డీల్‌ జెనీవాలో జరగనున్నట్లు ట్రంప్‌ సంకేతాలిచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ దీనిపై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పర్యటన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. అమెరికాకు చెందిన నాలుగు ఎయిర్‌ఫోర్స్‌ సీ-17 విమానాలు ఇప్పటికే యూరప్‌కు చేరుకున్నాయి. ఇందులో వాన్స్‌ పర్యటనకు అవసరమైన వాహనాలు, ఇతర పరికరాలను తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ వారాంతంలోగా డీల్‌ కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

యూఏఈ, పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌ అధికారుల మధ్య బుధవారం రాత్రి కొన్ని గంటల పాటు చర్చలు జరిపాయి. ఇందులో ఒప్పందంపై ఇరుదేశాల ముఖ్య అధికారులు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తమ ప్రతిపాదనలను ఇరాన్‌ అంగీకరించిందని, ఇక సంతకాలే తరువాయి అని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.