వారం రోజులు కావొస్తోంది.. చిన్నారి జాహ్నవి కానరాక..! ఈ మిస్సింగ్ కేసు చుట్టూ రకరకాల అనుమానాలు, ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు మాత్రం లభించలేదు. అసలు ఆ రోజు ఏం జరిగింది? చిన్నారి ఎక్కడికి వెళ్లింది? నిజంగా నాన్న కోసమే ఇంటి నుంచి బయటకెళ్లిందా? కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఏం చెబుతున్నారు? ఈ మిస్టరీ మిస్సింగ్ కేసు వెనకున్న నిజం..పెంపుడు కుక్కకు తెలుసా? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది?
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహరంలో, రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై, వారం రోజులైనా ఇంకా ఎలాంటి ఆచూకీ తెలియకపోవడం గ్రామంలో తీవ్ర ఆందోళన రేపుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ పాప క్షేమ సమాచారంపై సర్వత్రా ఉత్కంఠ, భయాందోళనలు పెరుగుతున్నాయి. అడవి ప్రాంతానికి సమీపంలో ఉండటంతో క్రూర జంతువుల దాడి జరిగిందా లేక మరేదైనా ఘోరం జరిగిందా అనే కోణంలో అనుమానాలు ముసురుతున్నాయి.
మరోవైపు, పాపతో పాటు మాయమైన పెంపుడు కుక్క బుధవారం రాత్రి రెండోసారి ఒంటరిగా ఇంటికి చేరింది. మూగజీవం సురక్షితంగా వెనక్కి రావడం వెనుక ఏదో పెద్ద రహస్యమే దాగి ఉందన్న అనుమానాలతో డాగ్ స్నాచర్స్ దాన్ని బోనులో బంధించారు. పాపను ఎవరైనా ఒకచోట దాచిపెట్టి, ఈ కుక్కను మాత్రం వదిలేశారా అనే కొత్త అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
ఇంటికి చేరిన పెంపుడు కుక్కను చూసి చిన్నారి తల్లి భవాని కన్నీరుమున్నీరుగా విలపించింది. “నా జాను దగ్గరికి నన్ను తీసుకెళ్తావా?” అంటూ ఆమె కుక్కతో మాట్లాడిన మాటలు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసాయి. ఆ మూగజీవం కూడా తల్లి రోదన చూసి నీరసంగా మూలుగుతూ కన్నీరు కార్చడం అక్కడి వాతావరణాన్ని మరింత శోకసంద్రంగా మార్చేసింది.
జాహ్నవితో బాటు వెళ్లిన పెంపుడు కుక్క ఇంటికి తిరిగొచ్చి కనిపించిన వాళ్లపై దాడి చేసేందుకు ప్రయత్నించడం.. అంతలోనే మరో ప్రాంతానికి వెళ్లిపోవడంతో పాప ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది. ఈ క్రమంలో చిన్నారి ఆచూకీకి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం అందించేందుకే కుక్క పదే పదే ఇంటికి వచ్చిందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీంతో కుక్కను బంధించి దాని ప్రవర్తనను గమనిస్తున్నారు.
జాహ్నవి జాడను కనిపెట్టేందుకు తొలుత పోలీసులు పెంపుడు కుక్కను కీలక ఆధారంగా భావించారు. దాని శరీరానికి జీపీఎస్ పరికరం అమర్చి, అది వెళ్లే మార్గాలను పసిగట్టడం ద్వారా పాప ఎక్కడుందో కనిపెట్టాలని అనుకున్నారు. కానీ బోనులో బంధించిన తర్వాత ఆ పెంపుడు కుక్క మానసిక స్థితి పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించి ఈ ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అది తిండి కూడా తినకుండా ఒకేచోట ముడుచుకుపోవడం చూస్తుంటే పాప అదృశ్యమైన సమయంలో ఏదో భయంకరమైన సంఘటనను కళ్లారా చూసి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు.
జాహ్నవి అదృశ్యం వెనుక పక్కా ప్లాన్ ప్రకారం పనిచేసిన కిడ్నాపర్లు ఉన్నారా అనే కోణం ఇప్పుడు కలకలం రేపుతోంది. అమాయక చిన్నారిని ఎవరో అపహరించారన్న బలమైన అనుమానాలతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేక పిల్లలను ఎత్తుకెళ్లే అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉందా అనే దిశగా ఆరా తీస్తున్నారు. అయినా, ఆ కొండ ప్రాంతంలో జాహ్నవి ఎంత దూరం వెళ్లి ఉంటుంది? మరోవైపు ఓపెన్ బారుబావులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దాపురం డివిజన్‌కి చెందిన 200 మందికి పైగా పోలీసులు.. రెవెన్యూ సిబ్బంది కొండ ప్రాంతాలు, అటవీ మార్గాలు, పరిసర గ్రామాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టినా.. ఎలాంటి క్లూ దొరకలేదు. ఈ కేసుకు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని అధికారులు అత్యంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతూ, చిన్నారిని ఎలాగైనా ప్రాణాలతో కాపాడాలనే పట్టుదలతో విచారణ వేగవంతం చేశారు. స్థానిక అడవులు, పాడుబడిన బావులు, పాత ఇళ్లను డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
తమ కళ్లముందు తిరిగిన చిన్నారి జాహ్నవి ప్రాణాలతో, క్షేమంగా తిరిగి వస్తుందనే ఆశతో తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీళ్లతో ఎదురుచూస్తున్నారు. ఊరంతా ఇదే ఆందోళనతో కాలం గడుపుతోంది. పాప క్షేమం కోసం స్థానిక ఆలయాల్లో గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా, కిడ్నాప్ జరిగిన రోజున.. చిన్న పాపకు జాహ్నవి తల్లి స్నానం చేయించి వచ్చే లోపే జాహ్నవి కనిపించకుండా పోయింది. అదేసమయంలో ఘటనాస్థలానికి అర కిలోమీటర్ దూరంలో పాప వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు ఉండడంతో టెన్షన్ పుడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారి ఆచూకీ దొరక్కపోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే అనూహ్య శక్తుల ప్రయోగాలు ఏమైనా కారణమా అనే సందేహాలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గతంలో ఇక్కడ తిరిగిన కొందరు అపరిచిత వ్యక్తుల కదలికలపై నిఘా వర్గాలు విచారణ జరుపుతున్నాయి.
ఇక, చిన్నారి అదృశ్యం తర్వాత దొండవాక పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఎన్నడూ లేని భయానక వాతావరణం నెలకొంది. తమ పిల్లలకు ఎక్కడ ముప్పు ముంచుకొస్తుందోనని తల్లిదండ్రులు సాయంత్రం కాకముందే ఇళ్లకు తాళాలు వేసుకుని లోపలే ఉండిపోతున్నారు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయి, ఊరంతా ఒక శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది.

Leave a Reply