కేతన్ కేసులో కొత్త ట్విస్ట్..
లోయలోకి తోసింది ఎవరో క్లారిటీ లేదంటున్న పోలీసులు
సియాకు లై-డిటెక్టర్ పరీక్షే కీలకం..!
విచారణలో మౌనం వహిస్తోన్న సియా, చేతన్
కేతన్ కేసులో షాకింగ్ టర్న్..
ఆధారాలు లేవంటున్న పుణె పోలీసులు
ముగియనున్న సియా-చేతన్ కస్టడీ
సియా దగ్గర కేతన్ ఫోన్
మే నెల మొదటి వారం నుంచి కేతన్ హత్యకు ప్లాన్
కొండపైకి వెళ్లి రిహార్సిల్ చేసిన నిందితులు
లోహగఢ్ కోట వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించిన పోలీసులు

ప్రేమ… పెళ్లి… కుట్ర… 400 అడుగుల లోయ… చివరకు దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఒక హత్య కేసు. మొదట ప్రమాదంగా కనిపించిన ఈ ఘటన… దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా మారింది. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. కేతన్ అగర్వాల్‌ను అసలు లోయలోకి ఎవరు తోశారు? కాబోయే భార్య సియా గోయలా? ఆమె ప్రియుడు చేతన్ చౌదరినా? లేక ఇద్దరూ కలిసి చేశారా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ పోలీసుల వద్ద స్పష్టమైన సమాధానం లేదు. అందుకే ఇప్పుడు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు పోలీసులు లై-డిటెక్టర్ పరీక్షను ఆశ్రయించారు. మరోవైపు… కేతన్ మరణించిన తర్వాత కూడా అతని మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉండటం… ఈ కేసులో కొత్త అనుమానాలకు తావిస్తోంది. అసలు ఈ కేసులో ఇప్పటివరకు బయటపడిన నిజాలేంటి? పోలీసులు ఏం చెబుతున్నారు? కోర్టులో ఏం జరిగింది? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం.
పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో ఇప్పటికే అనేక సాంకేతిక ఆధారాలు లభించినప్పటికీ… హత్య జరిగిన అసలు క్షణంలో కేతన్‌ను లోయలోకి ఎవరు తోశారన్న అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయాన్ని పోలీసులు స్వయంగా కోర్టుకు తెలియజేశారు. దర్యాప్తు ప్రారంభంలో చేతన్ చౌదరే కేతన్‌ను తోసేశాడని భావించారు. ఆ తర్వాత సియానే తోసిందనే అనుమానం వ్యక్తమైంది. మరో దశలో చేతన్ స్నేహితుడి పాత్ర కూడా ఉండొచ్చనే కోణంలో విచారణ సాగింది. కానీ ఈ మూడు వాదనల్లో ఏదీ ఇప్పటివరకు కచ్చితంగా నిరూపించే ప్రత్యక్ష ఆధారం లభించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు.
అందుకే ఇప్పుడు సియా గోయల్, చేతన్ చౌదరిలకు పాలీగ్రాఫ్ లేదా లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. నిందితుల వాంగ్మూలాల్లోని వైరుధ్యాలను గుర్తించడానికి, కొత్త ఆధారాలను సేకరించడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే… ఈ పరీక్షకు సంబంధించి సియా తరఫు న్యాయవాది విపుల్ దుషింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు అనుమతి ఒక్కటే సరిపోదని… నిందితురాలి సమ్మతి కూడా తప్పనిసరి అని చెప్పారు. అలాగే పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలను కోర్టు ప్రత్యక్ష సాక్ష్యంగా పరిగణించదని… అవి కేవలం దర్యాప్తుకు కొత్త లీడ్స్ ఇచ్చే సాధనంగా మాత్రమే ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.

ఇక ఈ కేసులో మరో కీలక అంశం… కేతన్ మొబైల్ ఫోన్. పోలీసుల దర్యాప్తులో… కేతన్ మరణించిన వెంటనే అతని మొబైల్ ఫోన్ కొంతసేపు సియా గోయల్ వద్దే ఉన్నట్లు తేలింది. అనంతరం ఆమె ఆ ఫోన్‌ను కేతన్ కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు గుర్తించారు. దీంతో ఆ ఫోన్లోని ఏవైనా డేటాను డిలీట్ చేశారా? కాల్ రికార్డులు, మెసేజ్‌లు లేదా ఇతర డిజిటల్ ఆధారాలను మార్చే ప్రయత్నం జరిగిందా? అనే కోణంలో డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. అంతేకాదు… జనవరి నుంచి జూన్ వరకు సియా, చేతన్ మధ్య రెండు వేలకుపైగా ఫోన్ కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. ఈ తరచూ జరిగిన సంభాషణలు కూడా దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారాయి.
అసలు ఈ కేసు ఎలా మొదలైంది? ఏం జరిగిందనే వివరాలు చూస్తే.. జూన్ 18న పుణె సమీపంలోని చారిత్రక లోహగఢ్ కోటకు కేతన్ అగర్వాల్, అతని కాబోయే భార్య సియా గోయల్ వెళ్లారు. కొద్దిసేపటికే కేతన్ 400 అడుగుల లోతైన లోయలో పడి మరణించాడు. మొదట దీనిని ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా చూపించే ప్రయత్నం జరిగింది. ఫోటోలు తీసుకుంటుండగా కాలు జారి పడిపోయాడని సియా పోలీసులకు చెప్పింది. కానీ కేతన్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, కాల్ డేటా, డిజిటల్ ఆధారాలు, లొకేషన్ వివరాలు పరిశీలించడంతో కేసు పూర్తిగా మలుపు తిరిగింది.
దర్యాప్తులో సియా గోయల్‌కు చేతన్ చౌదరితో ప్రేమ సంబంధం ఉన్నట్లు తేలింది. కేతన్‌తో జరగబోయే వివాహం సియాకు ఇష్టం లేకపోవడంతో… ఇద్దరూ కలిసి అతడిని హత్య చేయాలని ముందుగానే కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో మరో సంచలన విషయం కూడా బయటపడింది. హత్య జరిగిన రోజుకు నాలుగు రోజుల ముందే… జూన్ 14న కూడా ఇదే తరహా ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. అంతేకాదు… పుణెలోని లుల్లా నగర్ సమీపంలోని ఒక కొండ ప్రాంతంలో కేతన్‌ను ఎలా తోసేయాలనే అంశంపై సియా, చేతన్ ముందుగానే రిహార్సల్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడికి తీసుకెళ్లినప్పుడు సియా ఆ ప్రదేశాన్ని కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
హత్యకు ముందు ఇద్దరూ గూగుల్‌లో కూడా పలు విషయాలను వెతికినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు పట్టుబడితే ఏమి చెప్పాలి… ప్రమాదంగా ఎలా చూపించాలి… అనుమానం రాకుండా ఎలా వ్యవహరించాలి… వంటి అంశాలపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. సీసీటీవీ ఫుటేజ్లలో మరో ఆసక్తికర విషయం కూడా బయటపడింది. 33 డిగ్రీల ఎండలో కూడా చేతన్ హుడీ ధరించి తిరుగుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. తన గుర్తింపును దాచిపెట్టేందుకే ఇలా చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద సీసీటీవీలకు చిక్కకుండా ఉండేందుకు చేతన్ కారుకు బదులుగా స్కూటర్‌పై ప్రయాణించినట్లు కూడా దర్యాప్తులో గుర్తించారు.

దర్యాప్తును మరింత బలోపేతం చేసేందుకు పోలీసులు ఇప్పటికే పలుమార్లు క్రైమ్ సీన్ రీక్రియేషన్ నిర్వహించారు. మొదట సియాను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి ఘటనను పునర్నిర్మించారు. అనంతరం చేతన్ చౌదరిని కూడా అక్కడికి తీసుకెళ్లి సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. మరోవైపు విచారణలో నిందితులిద్దరు మౌనం వహించడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. కేతన్‌ను లోయలోకి తోసి మర్డర్ చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు లేకపోవడం, అలాగే ఆ ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో… గైట్ అనాలిసిస్, డిజిటల్ ఫోరెన్సిక్, డిలీట్ చేసిన డేటా రికవరీ, మొబైల్ విశ్లేషణ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులపై పోలీసులు ఎక్కువగా ఆధారపడుతున్నారు.
ఈ కేసు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దీనిని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసింది. కేతన్ కుటుంబం తరఫున ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు. భారతీయ న్యాయ సంహితలోని హత్య, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదైంది.ప్రస్తుతం సియా, చేతన్ల దుస్తులు, మొబైల్ ఫోన్లు, వాహనాలు, డిజిటల్ పరికరాలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఇంకా ఏవైనా కీలక ఆధారాలు దొరుకుతాయా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
మొత్తంగా చూస్తే… కేతన్ అగర్వాల్ హత్య కేసులో కుట్ర జరిగినట్లు సూచించే అనేక ఆధారాలు ఇప్పటికే పోలీసుల చేతికి వచ్చాయి. కానీ… కేతన్‌ను చివరి క్షణంలో లోయలోకి ఎవరు తోశారు? ఆ ఘటన ఎలా జరిగింది? అనే ప్రశ్నలకు మాత్రం ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. అందుకే ఇప్పుడు అందరి చూపు లై-డిటెక్టర్ పరీక్షపై నిలిచింది. కోర్టు అనుమతి, నిందితుల సమ్మతి లభిస్తే… ఈ పరీక్ష దర్యాప్తుకు కొత్త ఆధారాలు అందించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అయితే… ఈ కేసు ముందుకు సాగి.. కేతన్ మర్డర్ మిస్టరీకి పూర్తిగా తెరపడాలంటే దర్యాప్తు తుది నివేదిక, కోర్టులో సమర్పించే సాక్ష్యాలే కీలకంగా ఉన్నాయి. చూడాలి మరి..సియా లై-లై డిటెక్టర్ టెస్టులోనైనా నోరు విప్పుతుందో లేదో.

Leave a Reply