G7 Big Decision on Oil Prices: చమురు ధరలకు చెక్.. G7 కీలక నిర్ణయం!

ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్న వేళ.. జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు.. తమ వ్యూహాత్మక నిల్వల నుంచి 100 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, డీజిల్‌ను విడుదల చేయాలని నిర్ణయించాయి.

అమెరికా, బ్రిటన్, జపాన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీతో కూడిన జీ7 దేశాల నేతలు.. ఇంధన ధరలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. అనంతరం నాలుగు నెలల వ్యవధిలో.. అంతర్జాతీయ ఇంధన సంస్థ అయిన ఐఈఏ ద్వారా 100 మిలియన్ బ్యారెళ్ల చమురును మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ముఖ్యంగా మొదటి 20 రోజుల్లోనే భారీ మొత్తంలో డీజిల్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో మార్కెట్‌లో ఇంధన సరఫరా పెరిగి.. ధరలపై ఒత్తిడి తగ్గుతుందని జీ7 దేశాలు భావిస్తున్నాయి. అలాగే.. జీ7 దేశాల మధ్య డీజిల్‌ సహా ఇంధన ఉత్పత్తుల ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించబోమని నేతలు స్పష్టం చేశారు. ఇంధన ధరలపై ప్రజల్లో ఉన్న ఆందోళన తమకు అత్యంత ప్రాధాన్యత అంశమని తెలిపారు.

మార్కెట్‌ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తామని.. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని జీ7 నేతలు ప్రకటించారు. అమెరికా ఒత్తిడి నేపథ్యంలో యూరప్‌ దేశాలు తమ వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయాలన్న చర్చలు జరిగిన తర్వాత ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published.