Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై యుద్ధ ప్రభావం
సంక్షోభాలతో సతమతమవుతున్న ప్రపంచం..
ఆకాశాన్నంటుతున్న క్రూడ్ ఆయిల్ రేట్లు!
స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్..
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు!
పెరుగుతున్న LPG సిలిండర్ ధరలు !
రూపాయి పై పెరుగుతున్న ఒత్తిడి!
అసలు యుద్ధానికి..మన ఇంటి బడ్జెట్‌కు సంబంధమేంటి?
ఇన్ని సంక్షోభాలను ‘సామాన్యుడు’ తట్టుకునేదెలా?

ఎక్కడో పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఆ ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపైనా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి.. స్టాక్ మార్కెట్లలో కూడా బ్లడ్ బాత్ కొనసాగుతోంది. గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లలో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మరోవైపు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రేటు కూడా పెరిగింది. అసలు ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్న ఉద్రిక్తతలకు.. మన మార్కెట్లకు, మన ఇంటి బడ్జెట్‌కు ఏంటి సంబంధం? ఈ పరిణామాలన్నీ ఒకదానితో ఒకటి ఎలా లింక్ అయ్యాయి? డీటెయిల్‌గా చూద్దాం.

ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లను ఎక్కువగా కదిలిస్తున్న అంశాల్లో పశ్చిమాసియా ఉద్రిక్తతలు కూడా ఒకటి. ముఖ్యంగా హోర్ముజ్ వంటి కీలకమైన చమురు సరఫరా మార్గాల్లో అంతరాయం వస్తుందనే ఆందోళన పెరిగితే.. క్రూడ్ ఆయిల్ ధరలు వెంటనే పెరిగే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 28న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో.. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లకు పైగా వెళ్లింది. దీని ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్‌పైనా కనిపించింది. ఒక్కరోజులోనే సెన్సెక్స్ 1,124 పాయింట్లకు పైగా పడిపోగా.. నిఫ్టీ దాదాపు ఒకటిన్నర శాతం నష్టపోయింది.అంటే.. జియోపొలిటికల్ టెన్షన్స్ అనేవి కేవలం ఫారిన్ పాలసీకి సంబంధించిన అంశాలు మాత్రమే కాదు. వాటి ప్రభావం నేరుగా క్రూడ్ ఆయిల్ ధరలపై.. అక్కడి నుంచి మన ఫైనాన్షియల్ మార్కెట్లపై కూడా పడుతుంది.

ఇప్పుడు అసలు క్రూడ్ ఆయిల్ రేట్లు ఎందుకు అంత ఇంపార్టెంట్ అన్నది చూద్దాం. భారత్ తన అవసరాల్లో పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధర పెరిగితే.. అదే ఆయిల్ కోసం మనం ఎక్కువ డాలర్లు చెల్లించాలి. దీంతో మన ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. మరోవైపు చమురును తీసుకొచ్చే మార్గాల్లో ఇబ్బందులు వస్తే.. షిప్పింగ్, ఫ్రైట్, ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఆయిల్ కొరత పూర్తిగా లేకపోయినా.. సరఫరా మార్గాల్లో అంతరాయాలు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల క్రూడ్ ధరలపై ఒత్తిడి వస్తోంది.

క్రూడ్ రేట్లు పెరిగితే.. దాని ఎఫెక్ట్ అక్కడితో ఆగిపోదు. భారత్ ఎక్కువ డాలర్లు ఖర్చు చేసి ఆయిల్ దిగుమతి చేసుకోవాల్సి వస్తే.. రూపాయిపై కూడా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో పెట్రోల్, డీజిల్, ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగితే.. వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లే ఖర్చు కూడా పెరుగుతుంది. ఈ ఖర్చులు పెరిగితే.. చివరికి వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే క్రూడ్ ధరల పెరుగుదలను ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్కు ఒక ముఖ్యమైన రిస్క్‌గా చూస్తున్నారు.

ఇక దీని తర్వాత ఎఫెక్ట్ కనిపించేది స్టాక్ మార్కెట్‌లో. జియోపొలిటికల్ టెన్షన్స్ పెరిగినప్పుడు ఇన్వెస్టర్లలో ఆందోళన పెరుగుతుంది. భవిష్యత్తులో కంపెనీల ఖర్చులు పెరుగుతాయా? లాభాలు తగ్గుతాయా? ధరలు పెరుగుతాయా? ఇంట్రెస్ట్ రేట్లు ఎలా మారతాయి.. అనే విషయాలపై క్లారిటీ తగ్గుతుంది. దీంతో ఇన్వెస్టర్లు రిస్క్ ఉన్న అసెట్స్ నుంచి కొంత డబ్బును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మకాలు పెంచితే.. మార్కెట్‌పై మరింత ఒత్తిడి రావచ్చు. అందుకే క్రూడ్ ధరలు పెరిగినప్పుడు.. మన స్టాక్ మార్కెట్ కూడా నెగెటివ్‌గా రియాక్ట్ అవుతోంది.

మరి ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ ధరలు ఎలా ఉంటాయి? ప్రపంచంలో అనిశ్చితి పెరిగినప్పుడు.. చాలామంది ఇన్వెస్టర్లు గోల్డ్‌ను సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తారు. అందుకే యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల సమయంలో గోల్డ్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది.కానీ టెన్షన్స్ పెరిగిన ప్రతిసారీ గోల్డ్ ధర పెరుగుతుందని చెప్పలేం. అమెరికా ఇంట్రెస్ట్ రేట్లు.. డాలర్ విలువ.. బాండ్ యీల్డ్స్.. ఇలా చాలా అంశాలు గోల్డ్ ధరను ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రస్తుతం గోల్డ్ ధరల్లో కూడా భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

ఇక సిల్వర్ విషయానికి వస్తే.. గోల్డ్‌లాగే సిల్వర్ కూడా విలువైన లోహమే. కానీ సిల్వర్‌కు మరో ప్రత్యేకత ఉంది. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ వంటి పరిశ్రమల్లో కూడా సిల్వర్‌ను ఉపయోగిస్తారు.అందుకే సిల్వర్ ధరపై యుద్ధాలు, జియోపొలిటికల్ టెన్షన్స్‌తో పాటు.. పరిశ్రమల్లో డిమాండ్ ఎలా ఉంది? ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? డాలర్ విలువ ఎలా ఉంది? అనే అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.

ఇక సామాన్యులపై నేరుగా ప్రభావం చూపే మరో అంశం.. ఎల్‌పీజీ ధరలు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను 62 రూపాయల 50 పైసలు పెంచారు. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 2 వేల 810 రూపాయలకు చేరింది. అయితే మన ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర మాత్రం పెరగలేదు. ఢిల్లీలో అది 942 రూపాయల వద్దే కొనసాగుతోంది. కమర్షియల్ ఎల్‌పీజీ ధర పెరగడం వల్ల హోటల్స్, రెస్టారెంట్స్, క్యాంటీన్స్, చిన్న వ్యాపారాల ఖర్చులు పెరగొచ్చు. ఆ ఖర్చును వారు ఫుడ్ లేదా సర్వీసుల ధరల్లోకి తీసుకొస్తే.. చివరికి ఆ భారం కస్టమర్లపైనే పడుతుంది.

ఇక ఈ మొత్తం పరిణామాల్లో రూపాయి విలువ కూడా కీలకమే. క్రూడ్ ఆయిల్ కోసం ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి రావడం.. మరోవైపు ఫారిన్ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి డబ్బును వెనక్కి తీసుకోవడం.. వంటి కారణాలతో రూపాయిపై ఒత్తిడి పెరగొచ్చు. రూపాయి బలహీనపడితే.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ఖర్చు పెరుగుతుంది. అంటే క్రూడ్ ఆయిల్, రూపాయి, స్టాక్ మార్కెట్, వస్తువుల ధరలు.. ఇవన్నీ వేర్వేరు అంశాల్లా కనిపించినా.. జియోపొలిటికల్ టెన్షన్స్ సమయంలో ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి.

ఇప్పుడు ప్రపంచ మార్కెట్లు కొన్ని విషయాలను చాలా నిశితంగా గమనిస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుతాయా? లేక మరింత పెరుగుతాయా? చమురు సరఫరా మార్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది? క్రూడ్ ధరలు ఎంతకాలం ఎక్కువగా ఉంటాయి? అమెరికా ఇంట్రెస్ట్ రేట్లపై ఎలాంటి నిర్ణయాలు వస్తాయి? డాలర్ విలువ, బాండ్ యీల్డ్స్ ఏ దిశలో వెళ్తాయి? ఈ అంశాలన్నీ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, స్టాక్ మార్కెట్లతో పాటు.. భవిష్యత్తులో ఎల్‌పీజీ, ఇతర వస్తువుల ధరలపైనా ప్రభావం చూపొచ్చు.

మొత్తంగా చూస్తే.. ప్రపంచంలో ఎక్కడో మొదలైన జియోపొలిటికల్ టెన్షన్స్.. అక్కడితో ఆగిపోవు. క్రూడ్ ఆయిల్ నుంచి మొదలై.. రూపాయి, స్టాక్ మార్కెట్, గోల్డ్, సిల్వర్, ఎల్‌పీజీ ధరల వరకు ప్రభావం చూపొచ్చు. చివరికి ఈ ప్రభావం సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ను తాకుతుంది. అంటే.. ప్రపంచంలో జరిగే యుద్ధాలు, ఉద్రిక్తతలు మనకు దూరంగా ఉన్నా.. వాటి ఆర్థిక ప్రభావం మాత్రం మన ఇంటికి ఏదో రూపంలో వస్తుంది. ఇప్పుడు పశ్చిమాసియా పరిస్థితి ఏ దిశగా వెళ్తుంది.. క్రూడ్ ధరలు ఎంతకాలం ఎక్కువగా ఉంటాయి.. అన్నదే రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published.