స్కూల్‌కి వెళ్లే పిల్లలు.. దారిలో చిప్స్ , కూల్‌డ్రింక్స్ , పిజ్జా లేదా బర్గర్ కొనుక్కోవడం ఇక అంత ఈజీ కాకపోవచ్చు..! పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలో అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర ఉన్న ఆహార పదార్థాల విక్రయాలపై ఆంక్షలు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.
ఈ నిబంధనలు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా స్కూళ్ల సమీపంలోని కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, ఫుడ్ స్టాళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. చిప్స్, చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్, సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు వంటి HFSS ఫుడ్స్ విక్రయాలపై పరిమితులు రావచ్చు.
పిల్లల్లో అధిక బరువు, ఊబకాయం పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. 2015లో 5 నుంచి 19 ఏళ్ల మధ్య అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్న భారతీయ పిల్లల సంఖ్య సుమారు 2.8 కోట్లు ఉండగా.. 2025 నాటికి అది 4.1 కోట్లకు పెరిగినట్లు వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ డేటా చెబుతోంది.
అయితే ఈ ప్రతిపాదనపై వ్యాపార వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్కూళ్లకు సమీపంలోని చిన్న దుకాణాల ఆదాయం భారీగా తగ్గే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. మరోవైపు.. పిల్లల్లో చిన్న వయసులోనే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెంచడమే లక్ష్యమని FSSAI చెబుతోంది.
ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాలను అక్టోబర్ 6 వరకు స్వీకరిస్తున్నారు. నిబంధనలు ఎప్పుడు అమల్లోకి వస్తాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. మొత్తంగా.. పిల్లల ఆరోగ్యం, వ్యాపారాలపై ప్రభావం మధ్య ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply