From ₹88 to ₹1.5 Lakh:  బంగారం చరిత్ర!  80 ఏళ్లలో 1,711 రెట్లు పెరిగిన బంగారం! ₹88 → ₹1.5 లక్షలు

బంగారం.. భారతీయులకు ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు. తరతరాలుగా నమ్మకమైన పెట్టుబడిగా భావించే ఆస్తి. కష్టకాలంలో ఆదుకునే భరోసాగా కూడా బంగారాన్ని చూస్తారు. అందుకే బంగారం ధరలో చిన్న మార్పు వచ్చినా.. దాని ప్రభావం సామాన్యుల నుంచి పెట్టుబడిదారుల వరకు కనిపిస్తుంది.


అయితే.. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బంగారం ధర ఎంత ఉండేదో మీకు తెలుసా? అసలు ఈ 80 ఏళ్లలో బంగారం ప్రయాణం ఎలా సాగింది? 80 Years of Gold Journey ఏంటనేది ఈ స్టోరీలో చూద్దాం…


ముందుగా, ఈ ఈ 80 ఏళ్లలో బంగారం ధరలో ఎంత మార్పు వచ్చిందో తెలుసుకుందాం. 1947లో పది గ్రాముల బంగారం ధర కేవలం 88 రూపాయల 62 పైసలు. కానీ ఇప్పుడు అదే పది గ్రాముల బంగారం ధర లక్షన్నర రూపాయలు దాటింది. అంటే.. దాదాపు 80 ఏళ్లలో బంగారం ధర ఏకంగా 1,711 రెట్లు పెరిగింది. ఒక్కసారి ఈ లెక్కను అర్థం చేసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు.


1947లో వెయ్యి రూపాయలతో దాదాపు 113 గ్రాముల బంగారం కొనుగోలు చేయగలిగేవారు. అదే బంగారం ఈరోజు మార్కెట్ ధర ప్రకారం చూస్తే.. దాని విలువ సుమారు 17 లక్షల రూపాయలకు పైగా ఉంటుంది. అయితే ఇది నామమాత్రపు ధర పెరుగుదల మాత్రమే. ఈ మధ్యకాలంలో జరిగిన ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.


అసలు బంగారం ధర ఇంత భారీగా ఎందుకు పెరిగింది? దీనికి పలానా కారణం అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ, అంతర్జాతీయ బంగారం ధరలు, వడ్డీ రేట్లు, యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. ఇలా ఎన్నో అంశాలు కలిసి బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.


ముఖ్యంగా భారత్‌లో బంగారం ధరపై రూపాయి విలువ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన దేశం తన బంగారం అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర డాలర్లలో ఉంటుంది. కాబట్టి రూపాయి విలువ పడిపోతే.. అదే బంగారాన్ని కొనడానికి భారత్‌లో ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.


అయితే, బంగారం ధర చరిత్రలో 1970ల కాలం ఒక కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. చమురు సంక్షోభాలు, ఆర్థిక అనిశ్చితి వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకునేందుకు బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. ఆ తర్వాత భారత్‌లో కూడా బంగారం ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. 1970లో పది గ్రాముల బంగారం ధర సుమారు 184 రూపాయలుగా ఉంటే.. 1980 నాటికి అది దాదాపు 1,330 రూపాయలకు చేరింది. అంటే కేవలం పదేళ్లలోనే బంగారం ధరలో భారీ మార్పు కనిపించింది.


1990 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు, ప్రపంచ మార్కెట్లతో పెరిగిన అనుసంధానం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు దేశీయ బంగారం ధరలపై మరింత ప్రభావం చూపడం ప్రారంభమైంది. ఇక, 2000 ఇయర్‌లో పది గ్రాముల బంగారం ధర సుమారు 4,400 రూపాయల స్థాయిలో ఉండేది. 2010 నాటికి అది దాదాపు 18,500 రూపాయలకు చేరింది. అంటే కేవలం ఒక దశాబ్దంలోనే నాలుగు రెట్లకు పైగా పెరిగింది.

యాంకర్
ఇక 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం కూడా బంగారానికి కొత్త ప్రాధాన్యత తీసుకొచ్చింది. స్టాక్ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలపై అనిశ్చితి పెరిగినప్పుడు.. పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. అలాంటి సమయంలో బంగారం ఒక సేఫ్-హెవెన్ ఆస్తిగా మారి.. దానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది.


ఇక, 2020లో కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. మార్కెట్లలో భారీ అనిశ్చితి ఏర్పడింది. వడ్డీ రేట్లు తగ్గడం, ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు భారీగా డబ్బు ఖర్చు చేయడం వంటి పరిణామాలు కూడా బంగారం ధర పెరగడానికి అనుకూల పరిస్థితులను సృష్టించాయి.


2020లో భారత్‌లో పది గ్రాముల బంగారం ధర సుమారు 48,651 రూపాయలుగా ఉండేది. ఆ తర్వాత ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వంటి అంశాలతో ధర మరింత పెరుగుతూ వచ్చింది.


ప్రస్తుతం 2026లో కూడా బంగారం ధరను అనేక అంతర్జాతీయ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ కదలికలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి.. ఇవన్నీ బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి.


ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బంగారం కొనుగోలు చేసేది కేవలం సామాన్యులు, పెట్టుబడిదారులు మాత్రమే కాదు. ప్రపంచంలోని అనేక కేంద్ర బ్యాంకులు కూడా తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరుగుతున్న సమయంలో.. బంగారాన్ని ఒక వ్యూహాత్మక ఆస్తిగా కేంద్ర బ్యాంకులు చూస్తున్నాయి.


ఇక, భారత్‌లో కూడా బంగారం ధర భారీగా పెరిగినప్పటికీ.. దాని డిమాండ్ పూర్తిగా తగ్గిపోలేదు. ధరలు పెరగడంతో ప్రజలు తక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు చేసినా.. మొత్తం ఖర్చు మాత్రం భారీగా పెరుగుతోంది. అంటే.. తక్కువ బంగారం కోసం ఎక్కువ డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. 1947 నుంచి బంగారం ధర 1,711 రెట్లు పెరిగిందని చెప్పడం అంటే.. బంగారంపై పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికీ అదే స్థాయిలో రాబడి వచ్చిందని అర్థం కాదు. ఎందుకంటే ఎనిమిది దశాబ్దాల కాలంలో రూపాయి విలువ మారింది. ద్రవ్యోల్బణం పెరిగింది. బంగారం ధర కూడా మధ్యలో ఎన్నోసార్లు తగ్గింది.


ఇక.. దీర్ఘకాలంలో బంగారానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే.. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం లేదా సంక్షోభాలు ఎదురైనప్పుడు.. ప్రజలు తమ సంపదను కొంతవరకు కాపాడుకునేందుకు బంగారం వైపు చూస్తారు. రూపాయి విలువ తగ్గినా.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు వచ్చినా.. బంగారానికి అంతర్జాతీయంగా ఒక విలువ ఉంటుందనే నమ్మకమే దీనికి ప్రధాన కారణం.


అందుకే.. 1947లో కేవలం 88 రూపాయల 62 పైసలుగా ఉన్న పది గ్రాముల బంగారం.. ఇప్పుడు లక్షన్నర రూపాయలకు పైగా చేరడం వెనుక కేవలం బంగారం ధర పెరుగుదల మాత్రమే లేదు. ఎనిమిది దశాబ్దాల భారత ఆర్థిక ప్రయాణం, ద్రవ్యోల్బణం, రూపాయి విలువలో వచ్చిన మార్పులు, ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, యుద్ధాలు, పెట్టుబడిదారుల నమ్మకం.. ఇలా ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేశాయి.

మరి.. 80 ఏళ్లలో 1,711 రెట్లు పెరిగిన బంగారం.. రాబోయే పదేళ్లలో ఎక్కడికి చేరుతుంది? ఇప్పటి ధరల వద్ద కూడా బంగారంలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయమేనా? లేక ఇప్పటికే బంగారం చాలా పెరిగిపోయిందా? వీటికి సమాధానం.. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిణామాలు ఎలా మారతాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published.