అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి మాటల యుద్ధానికి దారితీశాయి. తమ దేశంపై వరుసగా ఆంక్షలు విధించడం అమెరికాకు ఒక వ్యసనంగా మారిందంటూ ఇరాన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ.. అమెరికా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా ఇరాన్‌పై విధిస్తున్న ఆంక్షలతో ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలపై బఘాయీ ఘాటుగా స్పందించారు.
అమెరికా దౌత్య మార్గంలో తన లక్ష్యాలను సాధించలేనప్పుడు ఆంక్షలనే ఆయుధంగా ఉపయోగిస్తోందని ఇరాన్ ఆరోపించింది. ఆంక్షలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోతే.. వాటిని మరింత తీవ్రతరం చేయడం అమెరికాకు అలవాటుగా మారిందని బఘాయీ అన్నారు. ఇప్పుడు అది కేవలం ఒక విధానం కాకుండా.. చివరకు వ్యసనంగా మారిపోయిందని ఎక్స్ వేదికగా విమర్శించారు. దౌత్యం విఫలమైన ప్రతిసారీ అమెరికా ఆంక్షల వైపు వెళ్తోందని, ఆ ఆంక్షలు ఫలించకపోతే మరింత ఒత్తిడి పెంచుతోందని ఆయన ఆరోపించారు.
అయితే దశాబ్దాలుగా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్.. వాటి కారణంగా లొంగిపోయే పరిస్థితి లేదని బఘాయీ స్పష్టం చేశారు. ఆంక్షలతో ఇరాన్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇలాంటి ఆర్థిక ఒత్తిళ్లను ఇరాన్ ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటూనే ఉందని గుర్తు చేశారు. అమెరికా నేతలు ఇదే విధానాన్ని కొనసాగిస్తే.. ఇరాన్‌తో కొనసాగుతున్న సంక్షోభానికి గౌరవప్రదమైన పరిష్కారం కనుగొనే అవకాశాలను కూడా వారే దెబ్బతీసుకుంటారని హెచ్చరించారు.
మరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఒత్తిడి మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఇరాన్ ప్రభుత్వం డిజిటల్ ఆస్తులు, రహస్య బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుంటూ ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తోందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఆరోపించారు. ఇరాన్‌కు చెందిన అక్రమ ఆర్థిక నెట్‌వర్క్‌లను గుర్తించి.. వాటిని ధ్వంసం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఆర్థిక, దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇరాన్ సైన్యంలో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సైన్యంలో పలువురు ఉన్నతాధికారులను నియమించారు. మేజర్ జనరల్ అలీ అబ్దొల్లాహీని సాయుధ దళాల చీఫ్‌గా నియమించగా.. కియుమర్స్ హైదారీని డిప్యూటీగా నియమించారు. అలాగే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్.. అంటే ఐఆర్జీసీ కమాండర్‌గా మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు డిప్యూటీగా మోస్తఫా ఇజాదీని నియమించారు.
మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరాన్ సైన్యంలో జరిగిన తొలి కీలక నియామకాలు ఇవే కావడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తుండటం.. మరోవైపు ఇరాన్ తన సైనిక వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టడం చూస్తుంటే.. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే.. అమెరికా ఆంక్షలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఆంక్షలతో ఇరాన్‌ను లొంగదీసుకోవడం సాధ్యం కాదని టెహ్రాన్ చెబుతుంటే.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అక్రమ నెట్వర్క్స్ ను లక్ష్యంగా చేసుకుంటామని వాషింగ్టన్ హెచ్చరిస్తోంది. దీనికి తోడు ఇరాన్ సైన్యంలో కీలక నియామకాలు జరగడం చూస్తుంటే.. భవిష్యత్‌లో అమెరికా–ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు ఏ దిశగా సాగుతాయన్న దానిపై ఆసక్తిని పెంచుతోంది.

Leave a Reply