దేశంలో వాహనదారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్, డీజిల్ పోయించుకోవడం కష్టమయ్యే పరిస్థితి రావొచ్చు. దేశంలో భారీ సంఖ్యలో వాహనాలు బీమా లేకుండా తిరుగుతున్న నేపథ్యంలో.. ‘No Insurance, No Fuel’ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశంలో దాదాపు 56 శాతం వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేదని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అంటే.. సుమారు 30 కోట్ల వాహనాల్లో 16.54 కోట్ల వాహనాలు బీమా లేకుండానే రోడ్లపై తిరుగుతున్నట్లు పార్లమెంటరీ కమిటీ నివేదికను సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు పరిహారం అందడం చాలా కీలకం. అందుకే థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేశారు. ఇది కేవలం ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన విషయం మాత్రమే కాదని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ఉన్న జీవించే హక్కుతో ముడిపడి ఉన్న అంశం అని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఇక కొత్త వాహనాలకు తప్పనిసరి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విషయంలోనూ సుప్రీంకోర్టు కీలక మార్పు చేసింది. ప్రస్తుతం కొత్త కార్లకు మూడు సంవత్సరాలు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉంది. ఇకపై దీనిని కార్లకు నాలుగేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఆరేళ్లకు పెంచాలని ఆదేశించింది.
అయితే అసలు ఆసక్తికరమైన అంశం ‘No Insurance, No Fuel’. అంటే.. వాహనం ఇన్సూరెన్స్ చెల్లుబాటులో ఉందా లేదా అన్నది పెట్రోల్ బంక్‌లోనే చెక్ చేసే విధానం తీసుకురావాలని కోర్టు సూచించింది. ఇన్సూరెన్స్ లేకపోతే.. ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకునే వరకు పెట్రోల్ లేదా డీజిల్ ఇవ్వకుండా ఉండే వ్యవస్థను పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, IRDAIలను ఆదేశించింది.
ఈ విధానం అమల్లోకి వస్తే.. పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడు వాహనం నంబర్ ద్వారా ఇన్సూరెన్స్ స్టేటస్ చెక్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ చెల్లుబాటులో లేకపోతే.. ముందుగా దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి రావచ్చు. దీనివల్ల వాహనదారులు ఇన్సూరెన్స్‌ను గడువు ముగిసేలోపు రెన్యువల్ చేసుకునేలా ప్రోత్సాహం లభిస్తుందని సుప్రీంకోర్టు భావిస్తోంది.
అంతేకాదు.. రోడ్లపై ఏర్పాటు చేసిన ANPR అంటే Automatic Number Plate Recognition కెమెరాలను ఇన్సూరెన్స్ డేటాబేస్‌తో పాటు VAHAN పోర్టల్‌కు అనుసంధానం చేయాలని కోర్టు సూచించింది. దీనివల్ల వాహనం నంబర్ ప్లేట్ స్కాన్ చేయగానే.. ఆ వాహనానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అన్నది గుర్తించే అవకాశం ఉంటుంది.
పోలీసులకు కూడా ఇన్సూరెన్స్ స్టేటస్‌ను అక్కడికక్కడే చెక్ చేసే మొబైల్ యాప్‌లు లేదా ప్రత్యేక పరికరాలు అందించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న వారిపై అక్కడికక్కడే చలాన్లు విధించేలా వ్యవస్థను రూపొందించాలని పేర్కొంది.
మోటార్ ఇన్సూరెన్స్‌ను మరింత సింపుల్‌గా మార్చేందుకు నాలుగు స్థాయిల విధానాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. ఇందులో మొదటిది తప్పనిసరి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఆ తర్వాత ప్రయాణికులు లేదా పిలియన్ రైడర్లకు లీగల్ లయబిలిటీ కవర్, ఓనర్, డ్రైవర్, ప్రయాణికులకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్, చివరగా వాహనానికి నష్టం జరిగితే అందే కవర్ ఉన్నాయి.
ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీల వివరాలను ప్రజలకు అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్‌లో అందించాలని కూడా కోర్టు సూచించింది. అదనపు కవర్లు తీసుకోవాలా వద్దా అనేది కస్టమర్లకు స్పష్టంగా ఎంచుకునే అవకాశం ఇవ్వాలని పేర్కొంది.
ఈ కేసు విషయానికి వస్తే.. ఇన్సూరెన్స్ ఉన్న వాహనంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ వివాదం కోర్టుకు వచ్చింది. తెలంగాణ హైకోర్టు కుటుంబానికి రూ.10,00,500 పరిహారం, దానిపై 7.5 శాతం వడ్డీ చెల్లించాలని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
మొత్తంగా చూస్తే.. దేశంలో ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్న కోట్లాది వాహనాలకు చెక్ పెట్టేందుకు సుప్రీంకోర్టు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ‘No Insurance, No Fuel’ విధానం ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ దశలో ఉంది. ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే.. ఇన్సూరెన్స్ లేకుండా పెట్రోల్, డీజిల్ పోయించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఈ అంశంపై సంబంధిత సంస్థలు ఆగస్టు 14లోగా కంప్లయన్స్ రిపోర్టులు సమర్పించాలి. తదుపరి విచారణ ఆగస్టు 18న జరగనుంది.

Leave a Reply