ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న, అడవి ఏనుగుల బెడదకు చెక్ పెట్టేందుకు కీలక అడుగు పడింది. ఏళ్లుగా పంట పొలాల్లోకి చొరబడి.. పంటలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను.. నియంత్రించేందుకు ఇప్పుడు ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు రంగంలోకి దిగాయి. అసలు ఈ కుంకీ ఏనుగులు అంటే ఏంటి? వీటి ప్రత్యేకత ఏంటి? అడవి ఏనుగుల నియంత్రణలో ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం.

పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు ఉపశమనం కలిగించేలా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పవన్ కల్యాణ్ ఆదేశాలతో పలమనేరు ఏనుగుల శిబిరం నుంచి రెండు ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాకు తరలించారు. జయంత్, అభిమన్యు అనే ఈ రెండు కుంకీలు.. ఇప్పుడు మన్యం ప్రాంతంలో అడవి ఏనుగుల నియంత్రణ బాధ్యతలు చేపట్టనున్నాయి.
అసలు కుంకీ ఏనుగులు అంటే ఏమిటి? ఈ కుంకీలు సాధారణ ఏనుగులు కావు. అడవి ఏనుగులను ఎదుర్కోవడం, వాటి కదలికలను గుర్తించడం, వాటిని నియంత్రించడం, తిరిగి అటవీ ప్రాంతాల వైపు మళ్లించడం వంటి స్పెషల్ ఆపరేషన్ల కోసం వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రమాదకర పరిస్థితుల్లో అటవీ సిబ్బందికి రక్షణగా నిలుస్తూ.. అడవి ఏనుగులను పట్టుకోవడం, తరలించడం వంటి క్లిష్టమైన పనుల్లో కుంకీలు కీలక పాత్ర పోషిస్తాయి.

ఇక, మన్యం జిల్లాకు వచ్చిన కుంకీ ఏనుగులు.. జయంత్, అభిమన్యులకు ఇప్పటికే అనేక ఆపరేషన్లలో పాల్గొన్న అనుభవం ఉంది. నానియాల్ ఏనుగుల శిబిరంలో ప్రత్యేక శిక్షణ పొందిన జయంత్‌తో పాటు.. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన అభిమన్యు ఇప్పటివరకు ఆరు ప్రధాన ఆపరేషన్లలో పాల్గొని తమ సామర్థ్యాన్ని నిరూపించాయి. ఇటీవల పలమనేరు సమీపంలో ప్రజలను భయపెట్టిన ఒంటరి మగ అడవి ఏనుగును బంధించే ఆపరేషన్‌లో కూడా ఈ రెండు కుంకీలు కీలకంగా వ్యవహరించాయి. వీటి మధ్య సమన్వయం, అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని మన్యం జిల్లాకు ఎంపిక చేశారు.
అయితే, పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల సమస్య తీవ్రంగా మారడానికి ప్రధాన కారణం ఒడిశా అటవీ ప్రాంతాల నుంచి ఏనుగుల గుంపులు తరచూ రాష్ట్రంలోకి ప్రవేశించడమే. పొలాల్లోకి చొరబడి వరి, మొక్కజొన్న, అరటి వంటి పంటలను నాశనం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో గ్రామాల్లోకి కూడా వచ్చి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం.. ఒడిశా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని, ఏనుగుల గుంపును తిరిగి అడవికి మళ్లించే చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఒడిశా నుంచి కూడా మరిన్ని కుంకీ ఏనుగులను తీసుకురావాలని నిర్ణయించారు. అయితే తక్షణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న జయంత్, అభిమన్యులను ముందుగా మన్యం జిల్లాకు పంపించారు.
ముందుగా, మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్న జయంత్, అభిమన్యులకు పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన కుంకీ ఏనుగులకు ఆహారం అందించి.. గజమాలలతో సత్కరించారు. ఆపై జెండా ఊపి, పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు పంపించారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో వీటిని వదిలిపెడతారు.
ఇక, ఈ కుంకీల ప్రయాణం వెనుక ప్రత్యేక చరిత్ర కూడా ఉంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని నానియాల ఎలిఫెంట్ క్యాంపులో దాదాపు 22 ఏళ్లుగా జయంత్, వినాయక్, గణేష్ వంటి కుంకీలు సేవలు అందించాయి. అడవి ఏనుగుల నియంత్రణలో ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్న ఈ ఏనుగుల్లో గణేష్ ప్రస్తుతం అనారోగ్యంతో చికిత్స పొందుతోంది. ఇప్పుడు జయంత్ మాత్రం అభిమన్యుతో కలిసి మన్యం ప్రాంతంలో కొత్త బాధ్యతలు చేపట్టబోతోంది.
మొత్తంగా, అడవి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రైతుల ప్రాణాలు, పంటలు, ఆస్తులకు రక్షణ కల్పించడంలో జయంత్, అభిమన్యు కుంకీలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Leave a Reply