ఎల్‌నినో లెక్క తప్పిందా? దేశంలో కుండపోత వర్షాలు! మారిన భారత వాతావరణ మ్యాప్‌..

ఒకప్పుడు ఎల్‌నినో అంటే.. తక్కువ వర్షాలు.. కరువు పరిస్థితులు.. రైతుల్లో ఆందోళన. కానీ ఇప్పుడు అదే ఎల్‌నినో సమయంలో దేశంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌.. ఇలా దేశంలోని అనేక ప్రాంతాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షం చుక్క కూడా పడకపోతే.. మరోవైపు కొన్ని గంటల్లోనే నెల రోజుల వర్షం కురుస్తోంది. మరి ఇది ఎలా సాధ్యమవుతోంది? ఎల్‌నినో ప్రభావం తగ్గిందా? లేక భారత వాతావరణాన్ని క్లైమేట్ చేంజ్ పూర్తిగా మార్చేస్తోందా?

భారతదేశంలో మాన్సూన్‌ గురించి మాట్లాడినప్పుడు ఎల్‌నినో అనే పదం తప్పకుండా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచ వాతావరణ వ్యవస్థలో ఎల్‌నినో కీలకమైన పాత్ర పోషిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగితే దానిని ఎల్‌నినో అంటారు. సాధారణంగా ఈ పరిస్థితి ఏర్పడితే భారత నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయి. అందుకే గతంలో ఎల్‌నినో సంవత్సరాల్లో దేశంలో తక్కువ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా, ఎల్‌నినో అనగానే రైతులు పంటల గురించి తీవ్ర ఆందోళన చెందేవారు. తగినంత నీరు లేక కరువు పరిస్థితులు ఎదురయ్యేవి.

కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. జూన్ నెలాఖరు వరకు దేశంలో దాదాపు 40 శాతం వర్షపాతం లోటు నమోదైంది. దీంతో ఈసారి కూడా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావించారు. అయితే జూలై మొదటి వారంలోనే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా పశ్చిమ తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ముంబై, కొంకణ్ తీరం, మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో భారీ వర్షాలతో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఒక్క వారం వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతం లోటు 40 శాతం నుంచి 17 శాతానికి పడిపోయిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే కొద్ది రోజుల భారీ వర్షాలే మొత్తం సీజన్ వర్షాల లెక్కనే మార్చేశాయి.

మరి ఎల్‌నినో ఉన్నప్పటికీ ఇంత భారీ వర్షాలు ఎలా కురుస్తున్నాయి? భారత వాతావరణ శాఖ ప్రకారం దీనికి ఒకే కారణం లేదు. ఒకేసారి అనేక వాతావరణ వ్యవస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఒడిశా మీద ఏర్పడిన అల్పపీడనం, మహారాష్ట్రపై కొనసాగిన సైక్లోనిక్ సర్క్యులేషన్, అరేబియా సముద్రం నుంచి నిరంతరం వస్తున్న తేమ.. ఇవన్నీ కలిసి పశ్చిమ భారతదేశంలో భారీ మేఘాలను ఏర్పరిచాయి. ఫలితంగా గంటల తరబడి వర్షాలు కురిశాయి. ముంబైలోని కొలాబా వాతావరణ కేంద్రంలో జూలై 1 నుంచి 7 మధ్య 791 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణంగా మొత్తం జూలై నెలలో కురిసే వర్షపాతాన్ని కూడా మించిపోయింది. శాంతాక్రూజ్ అబ్జర్వేటరీ కేంద్రంలో కూడా 879 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇక, మరో కీలక అంశం.. క్లైమేట్ చేంజ్. ఈ ఒక్క భారీ వర్షానికి క్లైమేట్ చేంజ్ నేరుగా కారణమని చెప్పలేమన్నారు వాతావరణ నిపుణులు . కానీ క్లైమేట్ చేంజ్ ఈ వర్షాల తీవ్రతను మరింత పెంచుతోందని మాత్రం స్పష్టంగా చెబుతున్నారు. ఎందుకంటే భూమి వేడెక్కుతున్న కొద్దీ గాలి ఎక్కువ తేమను తనలో నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. శాస్త్రీయంగా ప్రతి ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే గాలి దాదాపు 7 శాతం ఎక్కువ నీటి ఆవిరిని నిల్వ చేసుకోగలదు. అదే తేమ ఒక్కసారిగా మేఘాల రూపంలో కురిసినప్పుడు అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయి.

భారత ప్రభుత్వ భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన “అసెస్‌మెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఓవర్ ఇండియన్ రీజియన్” నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. 1901 నుంచి 2018 వరకు భారతదేశంలో సగటు ఉష్ణోగ్రత సుమారు 0.7 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. అలాగే 1951 నుంచి 2015 మధ్య ఉష్ణమండల హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగింది. ఈ మార్పుల వల్ల మాన్సూన్ మరింత అనిశ్చితంగా మారింది. ముఖ్యంగా మధ్య భారతదేశం, ఉత్తర భారతదేశం, పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాల సంఖ్య పెరిగినట్లు నివేదిక చెబుతోంది.

గతంలో వర్షాలు అనేక రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు స్థాయిలో కురిసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వర్షం పడే రోజుల సంఖ్య తగ్గుతోంది. అయితే పడినప్పుడు మాత్రం కొద్ది గంటల్లోనే అత్యంత భారీ వర్షం కురుస్తోంది. దీనినే నిపుణులు “ఎక్స్‌ట్రీమ్ రెయిన్‌ఫాల్ ఈవెంట్స్”గా అభివర్ణిస్తున్నారు. అంటే మొత్తం సీజన్‌లో పడే వర్షపాతం పెద్దగా మారకపోయినా… అది పడే విధానం పూర్తిగా మారిపోతోంది.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… మహారాష్ట్ర, గుజరాత్, కేరళ పశ్చిమ తీర ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాలుగా భారీ వర్షాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 1981 నుంచి 2000 కాలంతో పోలిస్తే.. 2001 నుంచి 2024 మధ్య ముంబైలో మాన్సూన్ వర్షపాతం సగటున 15 శాతం పెరిగింది. పుణెలో ఈ పెరుగుదల 23 శాతంగా నమోదైంది. భవిష్యత్తులో మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే రోజుల సంఖ్య మరో వారం రోజుల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే భారీ వర్షాలకు క్లైమేట్ చేంజ్ ఒక్కటే కారణం కాదు. మన అభివృద్ధి విధానాలు కూడా పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. పట్టణాల్లో చెరువులు, వెట్‌ల్యాండ్స్, సహజ డ్రైనేజీ మార్గాలు ఆక్రమణకు గురవుతున్నాయి. చెట్లను నరికివేస్తున్నారు. కాంక్రీట్ నిర్మాణాలు పెరుగుతున్నాయి. దీంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం తగ్గిపోతోంది. కొద్ది గంటల భారీ వర్షానికే నగరాలు జలమయం అవుతున్నాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో తరచూ కనిపిస్తున్న దృశ్యాలు దీనికి ఉదాహరణ.

మరోవైపు, దీనికి సంబంధించి పర్యావరణ నిపుణులు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు. ఇప్పటి వరకు నగరాలను గత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్మించామని.. కానీ ఇకపై రాబోయే కాలంలోని వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. రోడ్లు, వంతెనలు, డ్రైనేజీ వ్యవస్థలు, వరద నియంత్రణ వ్యవస్థలు.. అన్నీ క్లైమేట్ రెసిలియంట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే వెట్‌ల్యాండ్స్, అడవులు, వరద మైదానాలు సహజ రక్షణ వ్యవస్థలని, వాటిని కాపాడితేనే భవిష్యత్తులో వరదల ప్రభావాన్ని తగ్గించగలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి ఎల్‌నినో ప్రభావం ఇప్పటికీ భారత మాన్సూన్‌పై ఉంది. కానీ ఇప్పుడు దానితో పాటు క్లైమేట్ చేంజ్ కూడా వర్షాల తీరు, తీవ్రతను గణనీయంగా ప్రభావితం చేస్తోంది. అందుకే ఒకప్పుడు “ఎల్‌నినో అంటే తక్కువ వర్షాలు” అనే భావన ఉండగా.. ఇప్పుడు “ఎల్‌నినో ఉన్నా.. పడితే కుండపోత వానే” అనే కొత్త మాట వినిపిస్తోంది. భారత వాతావరణ మ్యాప్‌ను ఒక్క ఎల్‌నినో మాత్రమే కాదు.. క్లైమేట్ చేంజ్ కూడా మెల్లగా తిరగరాస్తోందనే సంకేతాలను తాజా మాన్సూన్ స్పష్టంగా చూపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ప్రకృతితో సమతుల్యతను కాపాడుతూ, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడమే అతిపెద్ద సవాలుగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published.