Honeymoon Coach On Train?: రైలులో శోభనం గది?‘ హనీమూన్ కోచ్’ చూశారా! ఈ ఫెసిలిటీ కూడా ఉందా?

భారతీయ రైల్వేలో ఇలాంటి దృశ్యం ఎప్పుడైనా చూశారా? ఫస్ట్ ఏసీ కోచ్‌లో బెలూన్లు… గులాబీ పూలతో అలంకరణ… “I Love You” అనే అక్షరాలు… చూస్తే ఇది రైలు కంపార్ట్‌మెంట్ కాకుండా, ఏదో ఫైవ్ స్టార్ హోటల్‌లోని హనీమూన్ సూట్‌లా కనిపిస్తోంది కదూ. అందుకే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కానీ అసలు ఈ అలంకరణ ఎవరు చేశారు? ఇండియన్‌ రైల్వేలో ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఇంతకీ, ఈ హనీమూన్‌ సెటప్‌కి రైల్వే అనుమతి ఇచ్చిందా? మరి, చివరకు టిటీఈని ఎందుకు సస్పెండ్‌ చేశారు?

మహారాష్ట్రకు చెందిన బల్లార్షా–ముంబై నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కారణం… ఓ కొత్త జంట కోసం ఫస్ట్ ఏసీ క్యాబిన్‌ను హనీమూన్ సూట్‌లా మార్చేయడమే. జల్నాకు చెందిన నవ దంపతుల కోసం ముందుగానే ఫస్ట్ ఏసీ కూపేను బుక్ చేశారు. వారు ఔరంగాబాద్ నుంచి జల్నా రైల్వే స్టేషన్‌కు కారులో చేరుకునేలోపే… ఓ ప్రైవేట్ డెకరేషన్ సంస్థ సిబ్బంది క్యాబిన్‌ను పూర్తిగా అలంకరించారు. అనంతరం ఆ జంట జల్నా స్టేషన్‌లో రైలు ఎక్కి తమ ప్రయాణాన్ని ప్రారంభించింది.

కొత్త జీవితానికి గుర్తుండిపోయే ఆరంభంగా తమ తొలి రైలు ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇందుకోసం ఆన్‌లైన్‌లో డెకరేషన్ సేవలను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. క్యాబిన్‌లో బెలూన్లు, గులాబీ పూలమాలలు, గులాబీ రేకులు, రంగురంగుల లైటింగ్, “I Love You” బోర్డు ఏర్పాటు చేశారు. చూడ్డానికి అది రైలు కంపార్ట్‌మెంట్ కంటే హనీమూన్ సూట్‌లా కనిపించింది. ఆ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో… క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. దీంతో, ఈ వీడియో చూసినవారంతా.. ఇది ఇండియన్‌ రైల్వేస్‌కు చెందిన ప్యాసింజర్‌ రైలా లేక ఫైవ్‌ స్టార్‌ హోటలా అంటూ కామెంట్లతో హోరెత్తించారు. అలాగే “ఇండియన్ రైల్వేలో కూడా ఇలాంటి సౌకర్యం ఉందా?” అంటూ కొందరు ఆశ్చర్యపోయారు.

కాగా, మొదట ఈ వీడియోను చూసిన చాలామంది రైల్వే కొత్తగా “హనీమూన్ ప్యాకేజ్” లేదా “కపుల్ స్పెషల్ కోచ్” ప్రారంభించిందని భావించారు. కొందరు సోషల్ మీడియాలో ఇదే తరహా సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని కూడా కామెంట్లు చేశారు. అయితే కొద్ది గంటల్లోనే అసలు విషయం బయటపడింది. ఇది రైల్వే అధికారిక కార్యక్రమం కాదని స్పష్టమైంది.

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం… విధుల్లో ఉన్న TTE స్థానికంగా ఈ అలంకరణ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. నవ దంపతులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా చేసినప్పటికీ… రైల్వే అనుమతి లేకుండా ప్రభుత్వ ఆస్తిని ఈ విధంగా అలంకరించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు గుర్తించారు. దీంతో సంబంధిత టిటీఈని వెంటనే సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన విచారణ ప్రారంభించారు.

మరీ, దీనిపై రైల్వే నిబంధనలు ఏమంటున్నాయి? ఓ సారి చూద్దాం. ఈ వీడియో చూసిన చాలా మందికి మరో సందేహం కూడా వచ్చింది. అసలు ఫస్ట్ ఏసీ కూపేను ఇలా ప్రత్యేకంగా అలంకరించుకునే అవకాశం ప్రయాణికులకు ఉంటుందా? అని. అయితే, రైల్వేలో ఫస్ట్ ఏసీ కూపేను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. అది కూడా అందుబాటులో ఉంటే, కొన్ని షరతుల ప్రకారం మాత్రమే కూపే కేటాయిస్తారు. అయితే హోటల్ గదిలా పూలు, బెలూన్లు, లైటింగ్‌తో అలంకరించడం వంటి సేవలకు భారతీయ రైల్వేలో అధికారికంగా ఎలాంటి అనుమతులు లేవు.

అయితే భారతీయ రైల్వేలో ఒక ప్రత్యేక సౌకర్యం మాత్రం ఉంది. ఒక పెద్ద గ్రూప్, వివాహ బృందం, యాత్రికుల బృందం లేదా ప్రత్యేక కార్యక్రమం కోసం మొత్తం కోచ్‌ను లేదా కొన్ని సందర్భాల్లో పూర్తి రైలును కూడా ప్రత్యేకంగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ముందస్తు దరఖాస్తు, భారీ డిపాజిట్, అదనపు ఛార్జీలు చెల్లించాలి. కానీ కోచ్‌ను ఇష్టానుసారంగా మార్చడం లేదా శాశ్వతంగా అలంకరించడం మాత్రం అనుమతి లేకుండా చేయరాదు.

మరోవైపు, ఈ ఇష్యూపై చాలామంది ప్రశ్నిస్తున్న మరో అంశం టీటీఈ సస్పెన్షన్ ఎందుకు అని?… ప్రయాణికులను సంతోషపెట్టేందుకు చేసిన పనికి ఇంత కఠిన చర్య అవసరమా? అంటూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే, ఇది వ్యక్తిగత సహాయం కాదు… ప్రభుత్వ ఆస్తి వినియోగానికి సంబంధించిన అంశమని రైల్వే అధికారుల అభిప్రాయపడుతున్నారు. రైల్వే కోచ్‌లు ప్రజల ఆస్తి కాబట్టి, వాటిలో ఎలాంటి మార్పులు చేయాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి. భద్రత, అగ్నిప్రమాద నివారణ, నిర్వహణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు రూపొందించారు. అందుకే దీనిని సేవా నియమాల ఉల్లంఘనగా పరిగణించి ఈ చర్యలు తీసుకున్నారు.

మరోవైపు, ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు “కొత్త దంపతులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాన్ని అందించారు” అంటూ టిటీఈని ప్రశంసించినవారు ఉన్నారు. మరోవైపు “ప్రభుత్వ ఉద్యోగి అధికారాలను వ్యక్తిగతంగా ఉపయోగించడం సరైంది కాదు” అంటూ విమర్శించినవారూ ఉన్నారు. మరికొందరు “మంచి ఉద్దేశంతో చేసినా… నిబంధనలు అందరికీ ఒకటే” అని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు నెటిజన్లు మరో ఆసక్తికరమైన ప్రశ్న కూడా లేవనెత్తారు. ఇలాంటి ప్రత్యేక అలంకరణలకు రైల్వే అధికారిక విధానం తీసుకొస్తే ఎలా ఉంటుంది? ప్రత్యేక సందర్భాల్లో అదనపు ఛార్జీతో డెకరేషన్ సేవలు అందిస్తే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని కొందరు సూచించారు. అయితే ప్రస్తుతం అలాంటి అధికారిక సేవ భారతీయ రైల్వేలో లేదు.

మొత్తంగా, ఒక చిన్న సర్‌ప్రైజ్‌గా ప్రారంభమైన ఈ వ్యవహారం… దేశవ్యాప్తంగా వైరల్ అయి చివరకు ఒక రైల్వే ఉద్యోగి సస్పెన్షన్ వరకు వెళ్లింది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియో వెనుక పూర్తి నిజం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై రైల్వే శాఖ అంతర్గత విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.