తెలంగాణలో SIR.. అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఇది జులై 24 వరకు కొనసాగనుంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్‌ను పంపిణీ చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ లోపు ఫిల్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్స్‌ను తిరిగి సమర్పించాల్సి ఉంది. ఇంతకీ, అసలు ఈ సర్వే ఎందుకు? మీ ఇంటికి వచ్చే బీఎల్‌వోలకు మీరు ఎలాంటి పత్రాలు చూపించాలి? ఒకవేళ మీరు నియోజకవర్గం మారితే పరిస్థితి ఏంటి? అనే విషయాలతో పాటు బీఎల్‌వోలు పంపిణీ చేస్తే ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా, ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. గురువారం నుంచి జూలై 24 వరకూ బీఎల్‌ వోలు ఇంటింటి సర్వే చేపడతారు. అందులో సేకరించిన వివరాల ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను సిద్ధం చేస్తారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేకున్నా.. తప్పులు దొర్లినా ఓటర్లు క్లెయిమ్‌ చేసుకోవడానికి, సవరణల కొరకు దరఖాస్తులు సమర్పించేందుకు నెల రోజుల సమయం ఇస్తారు. జూలై 31 నుండి ఆగస్టు 30 వరకూ సవరణలు, అభ్యంతరాల స్వీకరణ చేపడుతూనే… విచారణలు, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్‌ 28 నాటికి పూర్తిచేస్తారు. అన్ని ప్రక్రియలూ పూర్తిచేసి తుది ఓటరు జాబితాను అక్టోబర్‌ 1న ప్రచురించేలా ఈసీఐ తెలంగాణ రాష్ట్రానికి షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దీని ప్రకారం… సర్‌ ప్రక్రియను చేపట్టేందుకు ఎన్నికల అధికారులు పటిష్ఠ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో జూలై 24 నాటికి ఓటర్ల సంఖ్య ఆధారంగా కొత్తగా పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేయడం పూర్తిచేస్తారు.

జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫాం అందజేసే ప్రక్రియ కొనసాగుతుందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. మిస్‌ అయిన వారికి ఫాం 6తో మరోమారు ఎన్యూమరేట్ ఫాం అందజేసే అవకాశం ఉందన్నారు. జులై 31న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల చేస్తామని, జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు సీఈవో వెల్లడించారు.

అదేవిధంగా, నియోజకవర్గం మారితే పరిస్థితి ఏంటనేది చూస్తే.. సర్‌ ప్రక్రియలో భాగంగా బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు) ప్రతి ఇంటికి వెళ్లి.. ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్న వారికి ముందుగా ముద్రించిన ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేస్తారు. ఓటర్లు తమ పేరు, వయసు, కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా వంటి సమాచారాన్ని పరిశీలించి అవసరమైతే సవరణలు సూచించవచ్చు. అయితే, ఒకవేళ బీఎల్‌వోలు వెళ్లిన సమయంలో ఇంటి వద్ద ఎవరూ లేకపోతే.. మరో రెండుసార్లు ఆ ఇంటిని సందర్శించి వివరాలను సేకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరగడానికి ప్రతి బూత్‌ వద్ద బూత్‌ స్థాయి సహాయకులను నియమించుకునే హక్కు రాజకీయ పార్టీలకు ఉంది. వారు బీఎల్‌వోలతో కలిసి పనిచేస్తూ అర్హులైన ఓటర్లకు అండగా నిలుస్తారు. సవరణ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పిస్తారు. ఇంటింటి సర్వేలో సేకరించిన సమాచారం, 2002 డేటా లింకింగ్‌ ఆధారంగా రూపొందించిన తాత్కాలిక ఓటర్ల జాబితాను బహిరంగపరుస్తారు. బీఎల్‌వోలు వచ్చినపుడు అందుబాటులో లేకపోతే ముసాయిదా జాబితాలో సదరు ఓటరు పేరు పక్కన మార్క్‌ చేస్తారు. ఆ మార్క్‌ ఉన్నవారు.. ఆగస్టులో ఆన్‌లైన్‌ ద్వారా లేదా నేరుగా తహసీల్దార్‌ ఆఫీసులో ఫామ్‌-8 ఇచ్చి ఓటును భద్రపరుచుకోవచ్చు.

ఇక, ఈసీ సిద్ధం చేసిన ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లకుగాను.. ఈనెల 20నాటికి ఆన్‌లైన్‌లో 2,38,62,322 మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తిచేశారు. 99,64,126 మంది ఓటర్ల మ్యాపింగ్‌ పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలో ఈసీ పేర్కొంది. మ్యాపింగ్‌ పూర్తయిన ఓటర్లలో 89,88,175 మందికి వివిధ రకాల ధ్రువీకరణ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మ్యాపింగ్‌ పూర్తయిన ఓటర్లలో వీరి శాతం 37.67గా నమోదైంది. మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో మ్యాపింగ్‌ సమయంలో పెద్దసంఖ్యలో ఓటర్ల వివరాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఆధార్‌ కార్డు వివరాలు సరిపోకపోవడం, పేరు, వయస్సు, లింగం వివరాల్లో వ్యత్యాసాలు, ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల ఓటు నమోదై ఉండటం, చిరునామా వివరాలు సరిపోకపోవడం, కుటుంబ సభ్యుల వివరాల్లో పొంతన లేకపోవడం, మ్యాపింగ్‌ సమయంలో డేటా మిస్‌ మ్యాచ్‌ కావడం వంటి 11రకాల సమస్యలను గుర్తించిన అధికారులు.. అనామలీస్‌ కేటగిరీలో 89,88,175 మంది ఉన్నట్లు తేల్చారు.

ఇక ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది చూస్తే. బీఎల్‌వోలు పంపిణీ చేసే ఎన్యూమరేషన్ ఫామ్‌లో ఓటర్‌కు సంబంధించిన వివరాలు ప్రింట్ చేసి ఉంటాయి. ఆ కిందనే ఫామ్ పైభాగంలో రెండు కాలమ్‌లు కనిపిస్తాయి. మీకు 2002కు ముందే ఓటు హక్కు ఉంటే ఆ ఫామ్‌లోని ఎడమ వైపు కాలమ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. 2002లో మీకు ఓటు హక్కు లేకపోతే అప్పటికే ఓటు హక్కు కలిగి ఉన్న మీ బంధువుల వివరాలు అందజేయాలి. ఇక్కడ ఓటరు పేరు, బంధువు పేరు, బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం వివరాలు అందజేయాలి. ఆ తర్వాత పుట్టినతేదీ, ఆధార్ నంబర్ , మొబైల్ నంబర్, తండ్రి,తల్లి లేదా జీవిత భాగస్వామి ఓటరు గుర్తింపు కార్డు నంబర్ అందుబాటులో ఉంటే వివరాలు ఎంటర్ చేయాలి. అనంతరం ఎన్యూమరేషన్ ఫామ్‌ మీద సంతకం చేయడం లేదా వేలిముద్రను వేయాలి. ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఆన్‌లైన్ ద్వారా http://voters.eci.gov.in వెబ్‌సైట్‌లో కూడా సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.

ఒకవేళ 2002లో ఓటు లేకపోతే? వలస వెళ్లడం, అప్పట్లో ఓటు నమోదు చేసుకోకపోవడం వంటి కారణాలతో మీ 2002 రికార్డు అస్సలు దొరక్కపోతే.. అప్పుడు కూడా పౌరుని ఓటును తొలగించరు. దానికి బదులుగా, వారి ప్రస్తుత నివాస ప్రాంతంలో స్థానికులేనని నిరూపించే ప్రత్యామ్నాయ పత్రాలను అంటే ఆధార్‌ కార్డ్‌, కరెంట్‌ బిల్‌, పాస్‌పోర్ట్‌ వంటివి పరిశీలించి, ప్రస్తుత ఓటును ‘జెన్యూన్‌’గా ఖరారు చేస్తారు. అదేవిధంగా.. కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారి పేర్లు 2002 పాత ఓటరు జాబితాలో ఉండవు. అలాంటి వారి విషయంలో వారి తండ్రి, తల్లికి చెందిన 2002 ఓటర్‌ ఐడీ రికార్డుతో పిల్లల ఓటును లింక్‌ చేస్తారు.

అదేవిధంగా, మరణించిన వారి పేర్లను, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారి పేర్లను తొలగిస్తామని, ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించడమనేది ఉండదని, ఎక్కడ లోపాలు దొర్లాయో వాటిని సవరించడం ద్వారా జాబితాలో కొనసాగవచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఏ ఒక్కరి ఓటునూ వారికి ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండా జాబితా నుంచి తొలగించే అధికారం ఏ అధికారికీ లేదు. ఒకవేళ సాఫ్ట్‌వేర్‌ తప్పుగా చూపించినా, దానికి ఓటరు వివరణ తీసుకున్న తర్వాతే నిర్ణయం ఉంటుంది. ఓటరు వివరాల్లో తేడా ఉంటే, బీఎల్‌వోలు స్వయంగా నోటీసు ఇచ్చి వివరాలు అడుగుతారు. అంతకంటే ముందే తెలంగాణ సీఈవో వెబ్‌ సైట్‌లో ఎవరికివారు తమ ఓటర్‌ ఐడీ ద్వారా స్టేట్‌స్‌ను చెక్‌ చేసుకోవచ్చు. బీఎల్‌ఓలు సర్వేకు వచ్చినపుడు ఇంటికి తాళం వేసి ఉన్నంత మాత్రాన ఓటును తొలగించరు. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయని వారికి.. మళ్లీ వీటిని అప్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

ఫైనల్‌గా ప్రజలు ఏం చేయాలి అనే విషయానికొస్తే..సర్‌ ప్రక్రియ సమయంలో బీఎల్‌వోలు అందజేసే ఎన్యూమరేషన్‌ ఫారాల్లో వివరాలను నమోదు చేస్తున్నపుడు ప్రతి ఓటరూ తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. పేరు, వయసు, లింగం, బంధుత్వం, చిరునామా వంటి వివరాల్లో తప్పులు ఉంటే ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత క్లెయిమ్‌లు, అభ్యంతరాల ద్వారా సవరణ కోరవచ్చు. ఒకవేళ మీ పేరు స్పెల్లింగ్‌ తప్పుల వల్ల దొరకకపోతే, కంగారు పడాల్సిన పనిలేదు. మీ ఇంటికి వచ్చే బీఎల్‌వోకు ఓటర్‌ ఐడీ నెంబర్‌ చెప్తే, వారు తమ వద్ద ఉన్న బీఎల్‌వో నెట్‌ యాప్‌లో గ్లోబల్‌ సెర్చ్‌ ద్వారా వెతికి, అక్కడికక్కడే మ్యాన్యువల్‌గా మీ ప్రస్తుత ఓటుకు ట్యాగ్‌ చేస్తారు. ఓటరుగా నమోదు కావాల్సిన వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఒకవేళ మీకు ఏవైనా అత్యవసర సేవలు కావాలన్నా లేదా బీఎల్‌వోలు రాకపోయినా, 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published.