అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వేళ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో మళ్లీ హై టెన్షన్ నెలకొంది. మంగళవారం (జులై 7) ఒమన్ తీరంలోని హోర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తోన్న రెండు వాణిజ్య నౌకలపై మిస్సైల్ దాడి జరిగింది.దీంతో, ప్రపంచ ఇంధన భద్రతకు గుండెకాయగా భావించే హోర్మూజ్ జలసంధి మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న తరుణంలోనే మళ్లీ క్షిపణి దాడులు జరగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది.
అమెరికా అధికారుల ప్రకారం, ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC), హోర్మూజ్ లో ప్రయాణిస్తోన్న రెండు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో నౌకలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే సిబ్బంది సురక్షితంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

అయితే, ఇదే సమయంలో ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌ను గుర్తుతెలియని ప్రొజెక్టైల్ ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనను యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ధృవీకరించింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర చర్యలు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో మరో కీలక అంశం ఏమిటంటే… గత కొద్ది రోజుల క్రితమే హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులను నిలిపివేయాలని అమెరికా, ఇరాన్ మధ్య ఒక అవగాహన కుదిరిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఆ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే మళ్లీ ఇప్పుడు దాడులు జరగడం, ఇరాన్ తన ఒప్పందాన్ని ఉల్లంఘించిందా అనే ప్రశ్నలకు దారితీస్తోంది. అమెరికా అధికారులు ఈ పరిణామంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇరాన్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక, హోర్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యంలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. ప్రపంచ సముద్ర మార్గాల ద్వారా రవాణా అయ్యే ముడి చమురులో సుమారు ఐదో వంతు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్, ఖతర్ వంటి గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచానికి వెళ్లే చమురు, సహజవాయువు ఎగుమతులకు ఇదే ప్రధాన మార్గం. అందుకే ఈ ప్రాంతంలో చిన్న ఘటన జరిగినా ప్రపంచ మార్కెట్లు వెంటనే స్పందిస్తాయి.
హోర్మూజ్ లో తాజా దాడుల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పైనా పడే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితులు మరింత దిగజారితే ముడి చమురు ధరలు పెరగడంతో పాటు, దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా కనిపించే అవకాశం ఉంది. దీంతో, ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా పూర్తి వివరణ ఇవ్వలేదు. మరోవైపు అమెరికా అధికారులు మాత్రం దాడుల వెనుక IRGC పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయ్యాకే దాడులకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
కాగా, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్‌కు వారం రోజులు బ్రేక్ ఇచ్చామని.. మేం తల్చుకుంటే ఆ దేశ అగ్రనాయకత్వాన్ని అంతా ఒక్క దెబ్బతో లేపేయగలమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈమధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే తాజాగా హార్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులకు పాల్పడిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఇరాన్ మాత్రం ఈ దాడులను ధృవీకరించలేదు. ఏదేమైనప్పటికీ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ హోర్మూజ్ జలసంధిలో దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
మొత్తానికి… హోర్మూజ్ జలసంధిలో తాజా పరిణామాలు మరోసారి ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టాయి. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగా, మరోవైపు సముద్ర మార్గాల్లో దాడులు జరగడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. హోర్మూజ్ ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన మార్గం కావడంతో ఇక్కడ ఏర్పడే ప్రతి ఉద్రిక్తత అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పరిస్థితులు మరింత దిగజారితే ముడి చమురు ధరలు పెరగడం, దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా కనిపించే అవకాశాన్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి మొత్తం హోర్మూజ్ జలసంధిపైనే ఉంది.

Leave a Reply