అనంతపురంలో అంతుచిక్కని మిస్టరీ!
రాత్రయితే ఇళ్లపై పడుతున్న రాళ్లు
భయంతో వణికిపోతోన్న జనం!
అప్పాజీపేటలో అసలేం జరుగుతోంది?
అనంతపురం జిల్లా అప్పాజీపేటలో వారం రోజులుగా ఓ వింత ఘటన గ్రామస్థులను భయపెడుతోంది. చీకటి పడిందంటే చాలు.. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ.. ఇళ్లపై రాళ్లు వచ్చి పడుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. రాళ్ల వర్షంలా వరుసగా పడుతుండటంతో.. అసలు ఈ రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు విసురుతున్నారు? అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. దీంతో రాత్రి అయ్యిందంటే చాలు.. గ్రామంలో భయానక వాతావరణం నెలకొంటోంది. అసలు ఈ రాళ్ల మిస్టరీ ఏంటి? ఈ పని ఎవరు చేస్తున్నారు? అన్నది ఇప్పుడు గ్రామస్థులకు పెద్ద ప్రశ్నగా మారింది.
ఈ రాళ్ల దాడితో ఇప్పటికే కొన్ని ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్ల పైకప్పులు కూడా పగిలిపోయాయి. ఏ క్షణంలో.. ఎటువైపు నుంచి రాయి వచ్చి పడుతుందో తెలియక.. రాత్రిపూట ప్రజలు ఇళ్లలో కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే.. కొన్ని కుటుంబాలు రాత్రి వేళ ఒక్కచోట చేరి, అందరూ కలిసి కూర్చుంటున్నారు. ఇక సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యే ఎక్కువగా రాళ్లు పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో చీకటి పడిందంటే చాలు.. ఏం జరుగుతుందోనన్న భయంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
అయితే.. ఈ రాళ్లు అసలు ఎలా పడుతున్నాయన్నది ఎవరికీ అంతుచిక్కకపోవడంతో గ్రామంలో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. ఎవరో కావాలనే రాళ్లు విసురుతున్నారా? లేక దీని వెనుక ఏదైనా అదృశ్య శక్తి ఉందా? అంటూ కొందరు గ్రామస్తులు భయపడుతున్నారు. అసలు కారణం తెలియకపోవడంతో.. తమకు తెలిసిన మార్గాల్లో సమస్యకు పరిష్కారం వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది గ్రామస్థులు స్వామీజీలను ఆశ్రయిస్తున్నారు. ఈ రాళ్ల వర్షం ఎందుకు కురుస్తోంది? దీని వెనుక అసలు కారణమేంటి? అని తెలుసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
మరికొందరు గ్రామస్థులు ఈ భయాన్ని భరించలేక పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందడంతో పోలీసులు గ్రామంలో నిఘా పెట్టారు. నలుగురు పోలీసులు గస్తీ నిర్వహిస్తూ.. అసలు రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు విసురుతున్నారు? అనే విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్.. పోలీసులు నిఘా పెట్టిన సమయంలో కూడా ఇళ్లపై రాళ్లు వచ్చి పడ్డాయి. దీంతో ఈ ఘటన మరింత మిస్టరీగా మారింది. పోలీసులు మాత్రమే కాదు.. దాదాపు 20 మంది యువకులు కూడా రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు కొండ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయితే వాళ్లు అక్కడ ఉన్న సమయంలో కూడా ఇళ్లపై రాళ్లు పడటంతో అసలు విషయం ఏంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
దీంతో.. గ్రామంలో ఇది అదృశ్య శక్తుల పనే అన్న అనుమానం కొందరిలో మరింత బలపడుతోంది. అయితే పోలీసులు మాత్రం అలాంటి అనుమానాలకు ఎలాంటి ఆధారం లేదని చెబుతున్నారు. ఎవరో ఆకతాయిలు కావాలనే రాళ్లు విసురుతూ గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారా? అనే కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులు నిఘా పెట్టిన సమయంలో కూడా రాళ్లు పడటంతో.. అసలు అవి ఏ దిశ నుంచి వస్తున్నాయి? ఎవరు విసురుతున్నారు? అన్నది గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా.. రాళ్లు పడుతున్న తీరు, అవి వస్తున్న దిశపై స్పష్టత రావడం లేదు. దీంతో ఈ మిస్టరీని ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది.
ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో గతంలోనూ చోటుచేసుకున్నాయి. ప్రకాశం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో కూడా రాత్రివేళ ఇళ్లపై రాళ్లు పడటంతో ప్రజలు ఇదే విధంగా భయాందోళనకు గురయ్యారు. అయితే అప్పట్లో పోలీసులు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు నైట్ విజన్ కెమెరాలతో నిఘా పెట్టి అసలు విషయం ఏంటో గుర్తించారు. కొన్ని ఘటనల్లో గ్రామస్థులే వ్యక్తిగత కక్షలు, ఆస్తి తగాదాల కారణంగా రాళ్లు విసిరినట్లు విచారణలో తేలింది. దీంతో అప్పాజీపేటలోనూ ఇదే తరహాలో ఎవరైనా కావాలనే రాళ్లు విసురుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే.. అప్పాజీపేటలో ఈ రాళ్ల మిస్టరీని ఛేదించాలంటే సాధారణ గస్తీతో పాటు మరింత పక్కాగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు కోరుతున్నారు. సీసీ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు.. అవసరమైతే డ్రోన్లతోనూ నిఘా పెట్టాలని అంటున్నారు. ముఖ్యంగా రాళ్లు పడుతున్న సమయం కూడా దాదాపు ఒకేలా ఉండటంతో.. ఆ సమయంలో పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తే అసలు రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించే అవకాశం ఉంటుంది.
మొత్తంగా.. వారం రోజులుగా రాత్రిళ్లు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న తమకు భద్రత కల్పించాలని అప్పాజీపేట గ్రామస్థులు పోలీసులను కోరుతున్నారు. మరోవైపు.. ఈ అంతుచిక్కని రాళ్ల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు విసురుతున్నారు? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. మరి, అర్థరాత్రి గ్రామాన్ని వణికిస్తున్న ఈ రాళ్ల మిస్టరీకి పోలీసులు ఎప్పుడు చెక్ పెడతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Leave a Reply