Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ULC భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం పరిశీలించి క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో పూర్తిస్థాయి హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న వేలాది కుటుంబాలకు ఊరట కలిగే అవకాశం ఉంది. అసలు ULC అంటే ఏంటి? ఈ భూములు 22-A నిషేధిత జాబితాలోకి ఎందుకు వెళ్లాయి? గతంలో క్రమబద్ధీకరణ జరిగినా.. ఇంకా వేల దరఖాస్తులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎవరికి ప్రయోజనం కలగనుంది? ప్రభుత్వం అసలు ఏం ఆదేశించింది? ఇప్పుడు వన్ బై వన్ డీటెయిల్‌గా చూద్దాం.

తెలంగాణలో ఏళ్ల తరబడి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న అర్బన్ ల్యాండ్ సీలింగ్.. అంటే ULC భూముల సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ULC భూముల్లో గతంలో కొంతమేర క్రమబద్ధీకరణ జరిగిన కాలనీలు, పూర్తిగా క్రమబద్ధీకరణ కాని కాలనీలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి.. అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మెమో నంబర్ 48062ను ప్రభుత్వం జారీ చేసింది.

ఈ నిర్ణయం వెనుక అసలు సమస్య ఏంటంటే.. ULC చట్టం కింద ప్రభుత్వానికి అప్పగించిన భూముల్లో చాలాచోట్ల కాలక్రమంలో కాలనీలు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ భూములను గతంలోనే పేదలకు పంపిణీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కొంత భూమి మాత్రమే క్రమబద్ధీకరణకు గురై.. మిగిలిన భూమి ప్రభుత్వ రికార్డుల్లోనే కొనసాగింది. దీంతో ఆయా భూముల్లో నివసిస్తున్న వారికి పూర్తిస్థాయి హక్కులు లేకుండా పోయాయి. భూములపై లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి.

మరోవైపు.. ప్రభుత్వ భూములను రక్షించే ఉద్దేశంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22-A కింద కొన్ని సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ క్రమంలో ULC భూములు కూడా 22-A జాబితాలోకి వచ్చాయి. ఫలితంగా ULC భూముల్లో ఏర్పడిన కాలనీల్లో నివసిస్తున్న ప్రజలకు ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అర్హత ఉన్న ULC కేసులను పరిష్కరించే ప్రక్రియ ముందుకు సాగనుంది.

గతంలో కూడా ULC భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసింది. ముఖ్యంగా GO 455, GO 456, GO 747, GO 92 కింద అర్హులను గుర్తించి క్రమబద్ధీకరణ చేపట్టే ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. 2002 నుంచి 2016 మధ్య వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 15 వేల వరకు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది.

ఈ పెండింగ్ దరఖాస్తుల్లో హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ULC భూములకు సంబంధించిన సమస్య ఎక్కువగా ఉందన్నమాట. గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హత ఉన్నప్పటికీ క్రమబద్ధీకరణ పూర్తికాని కేసులను ఇప్పుడు మరోసారి పరిశీలించనున్నారు.

ఇక ఈ ప్రక్రియలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి.. నిబంధనలకు అనుగుణంగా ఉన్న కేసులను గుర్తించనున్నారు. అంటే పెండింగ్‌లో ఉన్న ప్రతి దరఖాస్తు ఆటోమేటిక్‌గా క్రమబద్ధీకరణకు అర్హత పొందదు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న కేసులనే అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా 22-A నిషేధిత భూముల జాబితాలో ఉన్న ULC భూముల్లోని ఇళ్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగానే ఈ తాజా మెమో జారీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా.. 22-A సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించే ప్రక్రియను ప్రారంభించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ULC కింద పాక్షికంగా క్రమబద్ధీకరణ జరిగిన కాలనీలు, అసలు క్రమబద్ధీకరణ జరగని కాలనీలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల్లో.. అర్హత ఉన్నవారికి నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణ చేస్తామని స్పష్టం చేశారు.

ఇప్పటికే 22-A జాబితాలో ఉన్నప్పటికీ కొన్ని అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ULC పెండింగ్ దరఖాస్తులపైనా స్పష్టత ఇవ్వడంతో.. 22-A భూ సమస్యల పరిష్కారంలో మరో కీలక అడుగు పడినట్లు ప్రభుత్వం చెబుతోంది.

మొత్తంగా చూస్తే.. ఏళ్లుగా క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న ULC భూముల పెండింగ్ దరఖాస్తుల్లో అర్హత ఉన్న కేసులను గుర్తించి.. నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రక్రియ మొదలుపెట్టింది. హైదరాబాద్ పరిసరాలతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఉన్న ULC కాలనీలకు కూడా ఈ నిర్ణయం వర్తించనుంది.

Leave a Reply

Your email address will not be published.