హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేలేదు. ఏటా జరిగే లడ్డూ వేలం కోసం భక్తులు, ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే.. ప్రతి ఏడాది ఈ లడ్డూ వేలం ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తూనే ఉంటుంది. గతేడాది రూ.35 లక్షలకు చేరిన బాలాపూర్ లడ్డూ.. ఈసారి ఏకంగా రూ.39 లక్షలు పలికింది. అంటే గత రికార్డును బద్దలు కొట్టి.. మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
అయితే.. అసలు ఒక లడ్డూకు ఇంతటి డిమాండ్ ఎందుకు? దీని వెనుక ఉన్న నమ్మకం ఏంటి? ఈ వేలం అసలు ఎప్పుడు మొదలైంది? రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ ప్రయాణం.. రూ.39 లక్షలకు ఎలా చేరింది? డీటెయిల్ గా చూద్దాం.
వినాయక చవితి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నగరం గల్లీ గల్లీలో గణేశ్ నామస్మరణ మారుమోగిపోతుంది. ప్రతి వీధిలో వినాయక మండపాలు కనిపిస్తాయి. వినాయక చవితి రోజుల్లో నగరంలో అసలు ఆకలి అనే పదమే వినిపించదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వినాయక చవితి అంటేనే ప్రసాదాల వెల్లువ. ఆ గణనాథుడికి ఇష్టమైన అన్నీ ప్రసాదాలు తయారు చేసి పెద్ద ఎత్తున పంచుతుంటారు. ఒకవైపు భక్తి.. మరోవైపు అన్నప్రసాదాలు.. ఇంకోవైపు సందడి.. ఇలా వినాయక చవితి రోజుల్లో హైదరాబాద్ అంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది.
ముఖ్యంగా హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. గణపయ్య శోభాయాత్రలు.. భక్తుల సందడి.. డీజేలు.. ఆకట్టుకునే ఆటపాటలతో నగరం మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా.. హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో బాలాపూర్ గణేశ్‌కు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. బాలాపూర్ గణేశ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది.. లడ్డూ వేలం. ఈ లడ్డూ కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు. దాని వెనుక మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. భక్తుల నమ్మకం ఉంది. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం ఉంది. ప్రతి ఏడాది రికార్డుల పర్వం ఈ లడ్డూ సొంతం.
ఇక బాలాపూర్‌లో గణేశ్ ఉత్సవాల విషయానికి వస్తే.. 1980లో ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్టు చరిత్ర చెబుతోంది. తొలినాళ్లలో స్థానికులంతా కలిసి గణేశ్ ఉత్సవాలను నిర్వహించేవారు. కాలక్రమంలో ఉత్సవాల స్థాయి పెరిగింది. బాలాపూర్ గణేశ్‌కు ప్రత్యేక గుర్తింపు రావడం మొదలైంది. కానీ 1994 సంవత్సరం బాలాపూర్ గణేశ్ ఉత్సవాల చరిత్రలో కీలక మలుపుగా మారింది. ఎందుకంటే అదే ఏడాది తొలిసారి గణేశ్ లడ్డూను వేలం వేశారు.
1994లో స్థానిక రైతు కొలను మోహన్‌రెడ్డి రూ.450కు లడ్డూను దక్కించుకున్నారు. మరుసటి ఏడాది కూడా ఆయనే వేలంలో పాల్గొని రూ.4,500కు లడ్డూను సొంతం చేసుకున్నారు. అంటే ఆ ఒక్క ఏడాదిలోనే లడ్డూ ధర పదిరెట్లు పెరిగింది. అక్కడి నుంచి బాలాపూర్ లడ్డూ వేలంపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగింది.
1996లో లడ్డూ రూ.18 వేలు పలికింది. 1997లో రూ.28 వేలు.. 1998లో రూ.51 వేలు.. ఇక 2002లో తొలిసారి లడ్డూ ధర లక్ష రూపాయల మార్క్‌ను దాటింది. ఆ ఏడాది రూ.లక్ష ఐదువేలకు లడ్డూ వేలం జరిగింది. ఆ తర్వాత కూడా లడ్డూ ధర పెరుగుతూనే వచ్చింది. 2007లో రూ.4.15 లక్షలు పలికింది. 2012లో రూ.ఏడున్నర లక్షలు.. 2015లో రూ.10 లక్షల 32 వేలు.. 2017లో రూ.15 లక్షల 60 వేలు.. 2019లో రూ.17 లక్షల 60 వేలు.. 2021లో రూ.18 లక్షల 90 వేలు.. 2022లో రూ.24 లక్షల 60 వేలు.. 2023లో రూ.27 లక్షలు.. 2024లో అక్షరాల రూ.30 లక్షల వెయ్యి రూపాయలకు చేరింది. ఇక 2025లో మరో రికార్డు నమోదైంది. లడ్డూ ఏకంగా రూ.35 లక్షలు పలికింది. ఇక, ఈ ఏడాది 39 లక్షల మార్క్ ను టచ్ చేసి.. మళ్లీ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంటే.. 1994లో రూ.450తో మొదలైన ఈ లడ్డూ వేలం.. మూడు దశాబ్దాలలో రూ.39 లక్షల స్థాయికి చేరింది.
ఇక, 2025లో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్ రూ.35 లక్షలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆ రికార్డ్ ను తిరగరాస్తూ రూ.39 లక్షలకు సామా ప్రణీత్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. ప్రతీ ఏడాది.. లడ్డూ వేలం ముగిసిన వెంటనే.. అక్కడ చప్పట్లతో పాటు ‘జై గణేశ్’ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతుంది.
ఇక మూడు దశాబ్దాల లడ్డూ వేలం చరిత్రలో పలువురు విజేతలుగా నిలిచారు. తొలి ఏడాది 1994లో కొలను మోహన్‌రెడ్డి రూ.450కు లడ్డూను దక్కించుకున్నారు. 1995లో కూడా ఆయనే రూ.4,500కు లడ్డూను సొంతం చేసుకున్నారు. 1996, 1997లో కొలను కృష్ణారెడ్డి విజేతగా నిలిచారు. 1998లో మళ్లీ కొలను మోహన్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత కళ్లెం అంజిరెడ్డి, కళ్లెం ప్రతాప్‌రెడ్డి, జి. రఘునందన్‌చారి, కందాడ మాధవరెడ్డి, చిగిరింత బాల్‌రెడ్డి ఇలా పలువురు లడ్డూను సొంతం చేసుకున్నారు.
2004లో మరోసారి కొలను మోహన్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. 2007లో జి. రఘునందన్‌చారి రూ.4.15 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2008లో మళ్లీ కొలను మోహన్‌రెడ్డి రూ.5.07 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. 2012లో పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ.7.50 లక్షలకు.. 2013లో తీగల కృష్ణారెడ్డి రూ.9.26 లక్షలకు.. 2014లో సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి రూ.9.50 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. 2015లో కళ్లెం మదన్‌మోహన్‌రెడ్డి రూ.10.32 లక్షలకు.. 2016లో కందాడి స్కైలాబ్‌రెడ్డి రూ.14.65 లక్షలకు.. 2017లో నాగం తిరుపతిరెడ్డి రూ.15.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
2018లో తేరేటిపల్లి శ్రీనివాస్‌గుప్తా రూ.16.60 లక్షలకు.. 2019లో కొలను రాంరెడ్డి రూ.17.60 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2020లో కరోనా కారణంగా సాధారణ వేలం జరగలేదు. 2021లో రమేష్‌యాదవ్, మర్రి శశాంక్‌రెడ్డి కలిసి రూ.18.90 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. 2022లో వంగేటి లక్ష్మారెడ్డి రూ.24.60 లక్షలకు.. 2023లో దాసరి దయానంద్‌రెడ్డి రూ.27 లక్షలకు.. 2024లో కొలను శంకర్‌రెడ్డి రూ.30.01 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఇక 2025లో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్ రూ.35 లక్షలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. ఈ ఏడాది సామా ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
ఈ జాబితాలో మరో ఆసక్తికరమైన విషయం కూడా కనిపిస్తుంది. తొలి దశలో కొలను కుటుంబానికి చెందిన వారు పలుమార్లు లడ్డూను దక్కించుకున్నారు. ముఖ్యంగా కొలను మోహన్‌రెడ్డి 1994, 1995, 1998, 2004, 2008లో విజేతగా నిలిచారు.
అసలు.. బాలాపూర్ లడ్డూ ధర ఇంతగా ఎందుకు పెరిగింది?
దీనికి కారణం.. గణపయ్య ప్రసాదంపై భక్తుల్లో ఉన్న నమ్మకం.. ఏటా పెరుగుతున్న ఉత్సవాల స్థాయి.. వేలంలో పాల్గొనే వారి ఆసక్తి.. లడ్డూను దక్కించుకోవాలనే భక్తుల భావన.. ముఖ్యంగా, వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు వినియోగించడం.. ఇలా అనేక అంశాలు కలిసి ఈ వేలానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
చివరగా ఒక్కసారి బాలాపూర్ లడ్డూ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటే.. 1994లో కేవలం రూ.450తో మొదలై.. 2026లో ఏకంగా రూ.39 లక్షలకు చేరింది.
బాలాపూర్ లడ్డూ కేవలం ఒక ప్రసాదం కాదు.. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ ప్రత్యేక సంప్రదాయం. భక్తుల నమ్మకానికి ప్రతీకగా నిలిచిన.. అద్భుతమైన ప్రయాణం.

Leave a Reply