బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. భారీ వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు వీయడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ల రేకులు ఎగిరిపడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏపీలో మొదలైన ఈ ప్రభావం తెలంగాణలోని కొన్ని జిల్లాలపైనా కనిపించింది. మరి రెండు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఏఏ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపించింది?
తుఫాన్ ప్రభావానికి మొదటి దెబ్బ శ్రీకాకుళం జిల్లాకే తగిలింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటింది. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నరసన్నపేటలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పట్టణంలోని పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. శ్రీదేవి నగర్, సాయి నగర్, మారుతి నగర్, కామేశ్వరి నగర్ ప్రాంతాల్లో ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. కామేశ్వరి నగర్లో వరుసగా విద్యుత్ వైర్లు తెగిపడటంతో పాటు స్తంభాలు కూడా నేలకొరిగాయి. దీంతో ఇళ్ల ముందు పార్క్ చేసిన పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.
భారీ ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో చెట్లు రోడ్లకు అడ్డంగా కూలిపోయాయి. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గంటకు సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు జాతీయ రహదారిపై ఉన్న గొట్టిపల్లి అండర్‌పాస్‌లో భారీగా నీరు చేరింది. దీంతో గొట్టిపల్లి, రెడ్డికిపేట, నడగం, ఉర్లం తదితర గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
తుఫాన్ తీవ్రతను ముందుగానే అంచనా వేసిన అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో 47 మంది గర్భిణీలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం ఒక ఎన్డీఆర్ఎఫ్, రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో జిల్లాలోని విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు.
ఇక విశాఖపట్నం విషయానికి వస్తే.. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. తుఫాన్ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. విశాఖ నగరంలోని తులసీనగర్‌లో అత్యధికంగా 236.39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధురవాడ, యెండాడ, సీతమ్మధార ప్రాంతాల్లోనూ 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. వాన నీరు నిలిచిన ప్రాంతాల్లో జీవీఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కైలాసగిరి వద్ద ఉన్న గ్లాస్ బ్రిడ్జ్‌ను కూడా మూసివేశారు. ఉమ్మడి విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
తుఫాన్ ప్రభావం కేవలం రోడ్డు రవాణాపైనే కాదు.. విమాన ప్రయాణాలపైనా కనిపించింది. విజయవాడ నుంచి విశాఖ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం భోగాపురంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ల్యాండింగ్ చేయలేకపోయింది. ల్యాండింగ్ కోసం రెండుసార్లు ప్రయత్నించినా పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో చివరికి విమానాన్ని నాగ్‌పూర్‌కు దారి మళ్లించారు. విమానంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఉండటంతో ప్రయాణికుల్లో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. చివరికి విమానం సురక్షితంగా నాగ్‌పూర్ చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తుఫాన్ ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. సీలేరు ఏజెన్సీ పరిధిలో భారీ వర్షాలకు విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపడటంతో దారకొండ, గుమ్మిరేవుల, దుప్పులవాడ పంచాయతీల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడు రోజులుగా చీకటిలోనే గడుపుతున్న గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ.. లైన్లను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఉత్తరాంధ్రకే పరిమితం కాకుండా ఏపీలోని ఇతర జిల్లాల్లోనూ వర్షాల ప్రభావం కనిపించింది. తణుకులో భారీ వర్షాలతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. గోతుల్లో నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి సమయంలో ఓ మినీ వ్యాన్ గుంతలో పడి బోల్తా పడింది. ఏలూరు జిల్లా కన్నాపురంలో కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో కట్టలేరు వాగు పొంగిపొర్లుతోంది. తోటముల-వినగడప మధ్య రోడ్డుపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరించారు.
ఇక తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం కనిపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరలో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుంది. దట్టమైన దుమ్ము, చీకటి అలుముకోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈదురుగాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. ఇళ్ల రేకులు ఎగిరిపడ్డాయి. గాలుల తీవ్రతకు కొంతమంది వ్యక్తులు కొంత దూరం వరకు కొట్టుకుపోయి.. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో గ్రామంలో కొంతసేపు భయానక వాతావరణం నెలకొంది.
మరోవైపు తుఫాన్ వేగం పుంజుకోవడంతో తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఒకవైపు తీరం దాటిన వాయుగుండం.. మరోవైపు దాని ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు.. ఇంకోవైపు బలమైన ఈదురుగాలులు.. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ వ్యవస్థ నుంచి రవాణా వరకు.. కాలనీల నుంచి పంట పొలాల వరకు.. తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు సహాయక బృందాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం ప్రధానంగా ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం, రోడ్లపై పడిన చెట్లు, వరద నీటిని తొలగించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.
బీ అలర్ట్.. బీ సేఫ్..!

Leave a Reply