తిరుమల శ్రీవారి భక్తులకు ఇక ప్రయాణం మరింత స్పీడ్ కానుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. అయితే.. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు రైలు ప్రయాణం గంటల తరబడి సాగడం, కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్ దొరకకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేలా ఇప్పుడు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, శ్రీవారి భక్తులకు దీంతో పాటు మరో గుడ్‌న్యూస్ కూడా ఉంది. అయితే, ముందుగా మనం కొత్త వందే భారత్ గురించి తెలుసుకుందాం. కర్ణాటకలోని శివమొగ్గ టౌన్ నుంచి తిరుపతి మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించేందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే.. శివమొగ్గ నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇకపై మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. అయితే.. అసలు ఈ కొత్త వందే భారత్ ఎప్పుడు అందుబాటులోకి రానుంది..? అసలు ఈ కొత్త వందే భారత్ ప్రతిపాదన వెనుక ఎవరున్నారు..? రైల్వే శాఖ ఈ మార్గానికి ఎందుకు ఓకే చెప్పింది..? రైలు ఏ రూట్‌లో పరుగులు పెట్టనుంది..? ఇప్పుడివే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.
శివమొగ్గ–తిరుపతి మధ్య వందే భారత్ నడపాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి. శివమొగ్గ టౌన్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలు నడపాలని కోరుతూ ఆయన గతంలో రైల్వే బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. శివమొగ్గ ప్రాంతం నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్యతో పాటు.. ఈ మార్గంలో ప్రయాణికుల అవసరాలను కూడా రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ.. శివమొగ్గ టౌన్–తిరుపతి మధ్య కొత్త వందే భారత్ సర్వీసుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని ఎంపీ గురుమూర్తికి అధికారికంగా తెలియజేసింది. ఈ విషయాన్ని ఎంపీ కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇక, ఈ కొత్త రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ప్రధానంగా ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, మెరుగైన సౌకర్యాలు అందే అవకాశం ఉంటుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా శివమొగ్గ, పరిసర ప్రాంతాల నుంచి తిరుపతి వచ్చే భక్తులకు ఈ సర్వీసు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఉంది. మరి, గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే రైలు వెంటనే పట్టాలెక్కుతుందా..? అసలు ఎప్పుడు ప్రారంభమవుతుంది అని..?
ప్రస్తుతానికి రైలు ప్రారంభ తేదీ, పూర్తి టైమ్-టేబుల్, టికెట్ ధరలు, ప్రయాణ సమయానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. రైల్వే అధికారులు త్వరలోనే ఈ వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇక తిరుపతి భక్తులకు ఈ గుడ్‌న్యూస్‌తో పాటు మరో శుభవార్త కూడా ఉందన్నాను కదా.. అదేంటంటే… తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు మరో భారీ అప్‌డేట్ కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు వందే భారత్ అంటే పగటిపూట వేగవంతమైన ప్రయాణమే. కానీ ఇకపై రాత్రిపూట పడుకుని ప్రయాణించే సదుపాయం కూడా రాబోతోంది. అదే వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.
తెలుగు రాష్ట్రాలకు తొలి వందే భారత్ స్లీపర్ రైలును కేటాయించే దిశగా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. విశాఖపట్నం నుంచి బెంగళూరు మధ్య ఈ స్లీపర్ వందే భారత్‌ను నడిపించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ రైలు అందుబాటులోకి వస్తే విశాఖ నుంచి బెంగళూరు వెళ్లే సుదూర ప్రయాణికులకు రాత్రిపూట సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం లభించనుంది.
ఇక, స్లీపర్ వందే భారత్‌లో విశాలమైన బెర్తులు, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన భద్రతా ప్రమాణాలు, బయో వాక్యూమ్ టాయిలెట్లతో ఈ రైళ్లను రూపొందించారు. దీంతో సుదూర ప్రయాణాలకు వందే భారత్ స్లీపర్ మరో కొత్త అనుభూతిని అందించే అవకాశం ఉంది.
మొత్తానికి ఒకవైపు శివమొగ్గ నుంచి తిరుపతికి కొత్త వందే భారత్.. మరోవైపు విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్..! ఈ రెండు సర్వీసులు అందుబాటులోకి వస్తే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మరి తిరుపతి వందే భారత్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది..? టికెట్ ధర ఎంత ఉంటుంది..? విశాఖ–బెంగళూరు స్లీపర్ రైలు ఎప్పుడు ప్రారంభమవుతుంది..? అనే సమాచారం కోసం ప్రయాణికులంతా ఇప్పుడు రైల్వే శాఖ అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply