పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తల ప్రభావం సముద్ర మార్గాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు ప్రమాదం పెరుగుతోంది. తాజాగా భారతీయ నావికులు ఉన్న ఓ నౌకపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి.ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో ఒకటి బయటకు రావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను FSUI తాజాగా విడుదల చేసింది. ఏప్రిల్ 22న ఈ దాడి జరిగినట్లు సమాచారం. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ షిప్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ దళాలు లక్ష్యంగా చేసుకున్నట్లు వీడియో దృశ్యాలు వెల్లడిస్తున్నాయి. అసలు హర్మూజ్ జలసంధిలో భారత్ నౌకను ఎందుకు టార్గెట్ చేశారో డీటైయిల్గా తెలుసుకుందాం.
వీడియోలో కనిపిస్తున్న విజువల్ చూస్తే.. చిన్న చిన్న బోట్లలో వచ్చిన ఐఆర్జీసీ దళాలు కంటైనర్ షిప్‌ను చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నౌకపై కాల్పులు జరిపినట్లు వీడియోలో కనిపించింది. అంతేకాదు.. రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్లను కూడా ప్రయోగించినట్లు సమాచారం. ఒక్కసారిగా కాల్పులు, దాడులు జరగడంతో నౌకలోని సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమను తాము రక్షించుకునేందుకు వారు కంటైనర్ల మధ్యలో దాక్కున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. కాల్పులు ఆగే వరకు అక్కడే ఉండిపోయిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక, మరింత ఆందోళన కలిగించే మరో విషయం ఏంటంటే.. ఈ కంటైనర్ షిప్లో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఏకంగా 21 మంది భారతీయులే. అంటే నౌకపై జరిగిన ఈ దాడిలో భారతీయ నావికులే భారీ సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. దాడి జరిగిన సమయంలో ఎదురైన ప్రమాదం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ.. ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశంగా మారింది.
మరోవైపు ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. ఇరాన్ అధికారుల వద్ద భారత్ ఆందోళన వ్యక్తం చేసినట్లు భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా FSUI ఈ దాడికి సంబంధించిన వీడియోను ప్రధాని కార్యాలయం, కేంద్ర విదేశాంగ శాఖ, కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేసింది. హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు అంచనాలకు మించి ప్రమాదకరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా భారతీయ నావికులు పెద్ద సంఖ్యలో ఈ సముద్ర మార్గాల్లో విధులు నిర్వహిస్తుండటంతో.. వారి భద్రతపై మరింత అప్రమత్తత అవసరమని నావికా సంఘాలు చెబుతున్నాయి.
అసలు హర్మూజ్ జలసంధి ఎందుకు అంత కీలకం? ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాల్లో హర్మూజ్ జలసంధి ఒకటి. పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమన్‌తో అనుసంధానించే ఈ మార్గం ద్వారా భారీగా చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది. ప్రపంచ ఇంధన సరఫరాలో ఈ మార్గానికి కీలకమైన స్థానం ఉంది. అందుకే ఇక్కడ యుద్ధ ఉద్రిక్తతలు పెరిగినా.. వాణిజ్య నౌకలపై దాడులు జరిగినా.. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపించే అవకాశం ఉంటుంది. నౌకలకు భద్రతా ముప్పు పెరిగితే షిప్పింగ్ ఖర్చులు, బీమా ప్రీమియంలు పెరగొచ్చు. అదే సమయంలో ఇంధన ధరలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.
ఇక భారతీయ నావికుల విషయానికి వస్తే.. ప్రపంచ సముద్ర రవాణా రంగంలో వారి పాత్ర చాలా కీలకం. ప్రపంచవ్యాప్తంగా సముద్రంలో విధులు నిర్వహించే నావికుల్లో దాదాపు 12.2 శాతం మంది భారతీయులేనని గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రపంచంలోని అనేక అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతం, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ వంటి ప్రాంతాల్లో నౌకల రాకపోకలు కొనసాగుతుండటంతో.. అక్కడ భద్రతా పరిస్థితులు క్షీణిస్తే భారతీయ నావికులు కూడా నేరుగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.
హర్మూజ్ జలసంధిలో చోటుచేసుకుంటున్న దాడులపై తాజాగా వెలువడిన వివరాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 28 తర్వాత హర్మూజ్‌లో జరిగిన దాడుల్లో కనీసం 15 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు భారతీయులే అని నివేదిక పేర్కొంది. ఈ గణాంకాలు చూస్తే హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. నౌకలపై దాడులు జరుగుతున్న సమయంలో.. అందులో పనిచేస్తున్న సిబ్బంది ఏ దేశానికి చెందిన వారైనా వారి ప్రాణాలకు ముప్పు తప్పదు. అయితే భారతీయ నావికులు భారీ సంఖ్యలో ఉండటం వల్ల భారత్‌కు ఈ సమస్య మరింత కీలకంగా మారుతోంది.
ముఖ్యంగా యుద్ధం తీవ్రంగా కొనసాగిన తొలినాళ్లలో భారతీయ సిబ్బంది ఉన్న పలు ట్యాంకర్లపై క్షిపణి దాడులు, కాల్పులు జరిగినట్లు సమాచారం. సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలకు భద్రత కల్పించడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద సవాలుగా మారింది. ఒకవైపు దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు.. మరోవైపు నౌకలపై దాడులు.. ఇంకోవైపు సముద్ర దొంగల ముప్పు.. ఇవన్నీ కలిసి సముద్ర రవాణా రంగంపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
అయితే తాజా ఘటనలో 22 మంది సిబ్బందిలో 21 మంది భారతీయులు ఉండటం.. వారంతా సురక్షితంగా బయటపడటం భారత్‌కు కొంత ఊరటనిచ్చే అంశం. కానీ హర్మూజ్ జలసంధిలో ఇలాంటి ఘటనలు పదేపదే చోటుచేసుకుంటే.. భవిష్యత్తులో భారతీయ నావికుల భద్రతపై మరింత ఆందోళన తప్పదు. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఈ సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాదు. అదే సమయంలో భద్రతా ముప్పును కూడా నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి.
మొత్తంగా చూస్తే.. హర్మూజ్ జలసంధిలో భారతీయ నావికులు ఉన్న నౌకపై జరిగిన ఈ దాడి.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. సముద్ర మార్గాల్లోనూ ఎంత తీవ్రంగా ఉందో చెప్పే మరో ఉదాహరణగా నిలుస్తోంది. ప్రపంచ సముద్ర రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ నావికుల భద్రత ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండాలంటే.. వాణిజ్య నౌకలకు భద్రత కల్పించడంతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో సమన్వయం అవసరం. ముఖ్యంగా సముద్రంలో విధులు నిర్వహిస్తున్న భారతీయ నావికుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకుండా భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తాజాగా బయటకొచ్చిన దాడి దృశ్యాలతో.. మరోసారి సముద్ర మార్గాల భద్రతపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Leave a Reply