Mahindra Scorpio-N Facelift

మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియో-ఎన్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు కొత్త మోడల్‌ను పరిచయం చేసిన కంపెనీ.. దీని ప్రారంభ ధరను రూ.13.69 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.25.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంది.

డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు
స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌ బాహ్య రూపకల్పనలో మహీంద్రా భారీ మార్పులకు వెళ్లలేదు. ఇప్పటికే ఈ ఎస్‌యూవీకి ఉన్న బోల్డ్, రగ్గడ్ డిజైన్‌ను కొనసాగించింది. అయితే కొత్తగా డ్యూయల్-టోన్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ను జోడించింది. దీంతో వాహనం లుక్ మరింత ప్రీమియంగా కనిపించేలా తీర్చిదిద్దింది.

ఇంటీరియర్‌లో మరిన్ని అప్‌గ్రేడ్‌లు
క్యాబిన్‌లో మాత్రం కంపెనీ గణనీయమైన మార్పులు చేసింది. ఇందులో 12.29 అంగుళాల ఫ్రీ-ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 10.24 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. స్కార్పియో-ఎన్‌లో తొలిసారి పనోరమిక్ సన్‌రూఫ్ను కూడా అందిస్తున్నారు.

ఫీచర్లకు ప్రాధాన్యత
కొత్త స్కార్పియో-ఎన్‌లో టెక్నాలజీ, కంఫర్ట్‌కు సంబంధించిన అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 540-డిగ్రీ కెమెరా, బ్లైండ్-వ్యూ మానిటర్, 12-స్పీకర్ సోనీ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అంతేకాకుండా వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ వంటి సదుపాయాలను కూడా పొందుపరిచారు. ఆఫ్‌రోడింగ్ లేదా అడ్వెంచర్ డ్రైవింగ్ సమయంలో అవసరమైన గణాంకాలను అందించే ప్రత్యేక డిస్‌ప్లేను కూడా మహీంద్రా ఇందులో ఇచ్చింది.

సేఫ్టీ విషయంలోనూ కీలక ఫీచర్లు
ప్రయాణికుల రక్షణ కోసం స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో పలు భద్రతా ఫీచర్లను అందించారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), లెవల్-2 ADAS వంటి అధునాతన సేఫ్టీ టెక్నాలజీలు ఇందులో ఉన్నాయి.

ఇంజిన్, గేర్‌బాక్స్‌లో మార్పుల్లేవ్
ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్, ఫీచర్లను అప్‌డేట్ చేసినప్పటికీ.. పవర్‌ట్రెయిన్ విషయంలో మహీంద్రా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇదివరకటి 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కొనసాగుతున్నాయి.

ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల అవసరాలను బట్టి రియర్-వీల్ డ్రైవ్ (RWD), ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) వేరియంట్లను కూడా ఎంచుకోవచ్చు.

కొత్త ఫీచర్లు, అప్‌గ్రేడ్ చేసిన టెక్నాలజీతో వచ్చిన స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్.. ఇప్పటికే ఉన్న రగ్గడ్ SUV ఇమేజ్‌ను కొనసాగిస్తూనే ప్రీమియం ఫీల్‌ను మరింత పెంచేలా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.