భారీగా తగ్గిన వెండి ధరలు… సిల్వర్‌కు షాకిచ్చిన డాలర్!

వెండి ధరలు ఒక్కసారిగా ఎందుకు పడిపోతున్నాయి? ఒకప్పుడు భారీగా పెరిగి ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని తాకిన వెండి.. ఇప్పుడు మళ్లీ ఒత్తిడిలోకి రావడానికి కారణం ఏంటి? చమురు ధరలు, అమెరికా డాలర్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు వెండి ధరలకు సంబంధం ఏంటి? ప్రస్తుతం వెండి ధర తగ్గుతున్నా.. భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయా? అసలు వెండి మార్కెట్‌లో ఏం జరుగుతోంది? ఇప్పుడు డీటైల్‌గా చూద్దాం.

ఈ ఏడాది ఇప్పటివరకు వెండి ధర దాదాపు 23 శాతం తగ్గింది. ఒక్క జూన్ నెలలోనే సుమారు 22 శాతం పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్స్ వెండి ధర దాదాపు 58 డాలర్ల దగ్గర ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే వెండి ధర ఇప్పటికీ 50 శాతానికి పైగా ఎక్కువగానే ఉంది. కానీ జనవరి చివర్లో ఒక ఔన్స్‌కు 121 డాలర్ల వరకు చేరిన వెండి ధర.. అక్కడి నుంచి భారీగా తగ్గింది. భారత్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ సుమారు 2 లక్షల 20 వేల రూపాయల దగ్గర ఉంది. అయితే అంతర్జాతీయ ధరలకు, మన దేశంలో ఉండే ధరలకు పూర్తిగా ఒకే విధంగా ఉండదు. దిగుమతి సుంకాలు, దిగుమతులపై ఉన్న పరిమితులు, దేశీయ మార్కెట్‌లో మారిన నిబంధనలు కూడా వెండి ధరపై ప్రభావం చూపుతాయి.

వెండి ధర తగ్గడానికి ప్రధాన కారణాల్లో చమురు ధరలు కూడా ఒకటి. ఇరాన్‌తో యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధి వద్ద ఆందోళనలు పెరిగాయి. దీంతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చన్న భయాలు మొదలయ్యాయి. ఫలితంగా చమురు ధరలు పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ చమురు ధర దాదాపు 86 డాలర్ల దగ్గర ఉంది. యుద్ధానికి ముందు ఉన్న ధరతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం ఎక్కువ. పరిస్థితులు మరింత దిగజారితే చమురు ధరలు మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉంది. గతంలో యుద్ధం మొదలైన సమయంలో చమురు ధర 119 డాలర్ల వరకు కూడా వెళ్లింది. అలాంటి స్థాయికి మళ్లీ చేరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.

మరి చమురు ధర పెరిగితే వెండి ధర ఎందుకు తగ్గుతుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆహారం, రోజువారీ అవసరాల వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం ఎక్కువ కాలం కొనసాగితే దాన్ని అదుపులోకి తీసుకురావడానికి అమెరికా కేంద్ర బ్యాంకు (Us Federal reserve) వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది.

అమెరికా వడ్డీ రేట్లు పెంచితే రుణాలు తీసుకోవడం మరింత ఖరీదవుతుంది. మార్కెట్‌లో డబ్బు ప్రవాహం తగ్గుతుంది. అదే సమయంలో ఇన్వెస్టర్లు అధిక వడ్డీ వచ్చే Dollar-based assets, Bonds వంటి పెట్టుబడుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. దీంతో డాలర్ బలపడుతుంది. ఇక్కడే గోల్డ్ అండ్ సిల్వర్‌కు అసలు సమస్య మొదలవుతుంది.. ఎందుకంటే ప్రపంచ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలను ప్రధానంగా Dollarలోనే నిర్ణయిస్తారు. డాలర్ బలపడితే ఇతర దేశాల కరెన్సీలతో వెండి కొనేవారికి అది మరింత ఖరీదుగా మారుతుంది. అంటే Oil ధరలు పెరగడం నుంచి మొదలైన ప్రభావం.. ద్రవ్యోల్బణం పెరగడం, అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు మారడం, డాలర్ బలపడటం ద్వారా చివరకు వెండి ధరపై ఒత్తిడిగా మారుతుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది.


ఇక అమెరికా కేంద్ర బ్యాంకు విషయానికి వస్తే.. ప్రస్తుతం అక్కడ వడ్డీ రేట్లు 3.5 నుంచి 3.75 శాతం మధ్య ఉన్నాయి. అయితే సెప్టెంబర్‌లో మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్‌లో పెరుగుతున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం కొంత తగ్గినప్పటికీ.. ఇరాన్ యుద్ధం తర్వాత చమురు ధరలు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జూలైలో జరిగిన సమావేశంలో ముగ్గురు సభ్యులు వడ్డీ రేట్లు పెంచడానికి అనుకూలంగా ఓటు వేయడం కూడా కీలకంగా మారింది. అంటే అమెరికా కేంద్ర బ్యాంకులో వడ్డీ రేట్ల విషయంలో అందరూ ఒకే అభిప్రాయంతో లేరనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇక, చమురు ధరలు చాలా కాలం పాటు ఎక్కువగానే ఉంటే.. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి అమెరికా కేంద్ర బ్యాంకు మరోసారి వడ్డీ రేట్లు పెంచాల్సిన పరిస్థితి రావచ్చు. అదే జరిగితే డాలర్ మరింత బలపడే అవకాశం ఉంటుంది. డాలర్ బలపడితే వెండి, బంగారం వంటి లోహాలపై మరింత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది.

ఇక డాలర్ విషయానికి వస్తే.. గత ఏడాది డాలర్ విలువ 10 శాతానికి పైగా తగ్గింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 2 శాతం పెరిగింది. సాధారణంగా డాలర్ బలపడితే బంగారం, వెండి ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. డాలర్ బలహీనపడితే మాత్రం ఈ రెండు లోహాలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు వెండి ధరను అంచనా వేయాలంటే కేవలం వెండి మార్కెట్‌ను మాత్రమే చూస్తే సరిపోదు. చమురు ధరలు ఎలా ఉన్నాయి? అమెరికా వడ్డీ రేట్లపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి? డాలర్ ఇండెక్స్ ఏంటి? అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలపై వచ్చే రాబడి ఎంత ఉంది? అనే అంశాలను కూడా గమనించాల్సి ఉంటుంది.

వెండికి మరో ప్రత్యేకత ఉంది. బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చాలా ఎక్కువగా ఉంటాయి. ధర పెరిగినప్పుడు వెండి వేగంగా పెరగొచ్చు. అదే విధంగా ధర తగ్గినప్పుడు కూడా చాలా వేగంగా పడిపోవచ్చు. దీనికి ప్రధాన కారణం వెండి కేవలం విలువైన లోహం మాత్రమే కాదు.. అనేక పరిశ్రమల్లో ఉపయోగించే లోహం కూడా. సౌర విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, విద్యుత్ వాహనాలు, విద్యుత్ సరఫరా పరికరాలు, డేటా కేంద్రాలు వంటి అనేక రంగాల్లో వెండిని ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ రంగాల్లో డిమాండ్ పెరిగినా, తగ్గినా వెండి ధరపై నేరుగా ప్రభావం పడుతుంది.

ప్రస్తుతం సౌర విద్యుత్ రంగంలో వెండి వినియోగం కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, విద్యుత్ మౌలిక వసతులు, డేటా కేంద్రాలు వంటి రంగాలు భవిష్యత్తులో వెండికి కొత్త డిమాండ్‌ను తీసుకురావచ్చని అంచనాలు ఉన్నాయి. మరోవైపు వెండి మార్కెట్‌లో వరుసగా ఆరో ఏడాది కూడా సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. 2026లో దాదాపు 4.6 కోట్ల ఔన్సుల వెండి కొరత ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే ప్రస్తుతం ధరపై ఒత్తిడి ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో సరఫరా, డిమాండ్ మధ్య వ్యత్యాసం వెండి ధరకు మద్దతుగా మారే అవకాశం ఉంది.

వెండి మార్కెట్ పరిమాణం బంగారంతో పోలిస్తే చాలా చిన్నది. అందుకే ఊహాగానాల ఆధారంగా జరిగే కొనుగోళ్లు, అమ్మకాల ప్రభావం వెండి ధరపై ఎక్కువగా ఉంటుంది. దీంతో వెండి ధరల్లో ఒక్కసారిగా భారీ పెరుగుదల, అలాగే భారీ పతనం కూడా కనిపించొచ్చు. ఈ ఏడాది కూడా ఇదే జరిగింది. జనవరిలో వెండి ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకిన తర్వాత కొన్ని దశల్లో 40 శాతానికి పైగా పడిపోయింది. బంగారం కూడా తగ్గినప్పటికీ.. వెండితో పోలిస్తే దాని పతనం తక్కువగా ఉంది.

మరి ఇప్పుడు వెండి కొనుగోలు చేయాలా? వద్దా? ప్రస్తుత పరిస్థితుల్లో వెండి ధర మళ్లీ భారీగా పెరగడానికి స్పష్టమైన అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. చమురు ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం తగ్గడం, అమెరికా వడ్డీ రేట్లు పెంచే అవకాశం తగ్గడం, డాలర్ బలపడటం ఆగిపోవడం వంటి పరిణామాలు జరిగితే వెండికి మళ్లీ మద్దతు లభించే అవకాశం ఉంటుంది. మరోవైపు అమెరికా పదేళ్ల రుణ పత్రాలపై వచ్చే రాబడి కూడా చాలా కీలకం. ఇది ప్రస్తుతం దాదాపు 4.65 శాతం దగ్గర ఉంది. ఇందులో భారీ మార్పు వస్తే బంగారం, వెండి ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

మొత్తంగా చూస్తే.. వెండి ధరలపై చమురు, ద్రవ్యోల్బణం, అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ విలువ ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ వెండికి ప్రతికూలంగా మారాయి. అయితే పరిశ్రమల్లో వెండికి పెరుగుతున్న డిమాండ్, సరఫరా లోటు వంటి అంశాలు భవిష్యత్తులో ధరకు మద్దతు ఇవ్వొచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో వెండి ధరల కదలిక ఎలా ఉండబోతుందనేది చమురు ధరలు, అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ కదలికపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచార అంతా కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వెండిలో ధరల హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published.