రోజురోజుకు సామాన్యుడి వంటింటిపై ధరల భారం మరింత పెరుగుతోంది. ఒకవైపు పౌష్టికాహారంగా భావించే కోడిగుడ్డు ధరలు కొండెక్కుతుంటే.. మరోవైపు ప్రతిరోజూ తినే బియ్యం ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. ఒకప్పుడు రూ.4కే లభించిన గుడ్డు ఇప్పుడు రూ.10కు చేరువైంది. ఇక కేవలం పది రోజుల్లోనే కేజీ బియ్యం ధర రూ.10 వరకు పెరిగింది. అసలు ఈ ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి..? రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారనుందా..? ఈ స్టోరీలో చూద్దాం.
ఒకప్పుడు సామాన్యుడి ఆహారంలో తప్పనిసరిగా ఉండే గుడ్డు.. ఇప్పుడు ఖరీదైన ఆహారంగా మారుతోంది. పౌష్టికాహారం కోసం గుడ్డు కొనాలన్నా.. కుటుంబ బడ్జెట్‌ను లెక్కించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో బియ్యం ధరలు కూడా పెరగడంతో వంటింటి ఖర్చులు మరింత భారమవుతున్నాయి. గల్ఫ్ వార్ సమయంలో రూ.4కే దొరికిన గుడ్డు.. ఇప్పుడు రూ.10కు చేరింది. మరోవైపు కేజీ బియ్యం ధరలు కూడా అమాంతం పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో ఈ అనూహ్య ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి..? ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది.
కల్తీ చేయరాని ఏకైక పౌష్టికాహారంగా భావించే కోడిగుడ్డు.. ఇప్పుడు కొనాలంటేనే వినియోగదారులు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు వారంలో నాలుగు, ఐదు రోజులు గుడ్డు తిన్న కుటుంబాలు.. ఇప్పుడు ధరలు చూసి వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి. గత ఏడాది ఇదే జూన్, జులై నెలల్లో రూ.5 నుంచి రూ.6 లోపే ఉన్న గుడ్డు ధర.. ఇప్పుడు రిటైల్ మార్కెట్లో రూ.8.50 నుంచి రూ.10 వరకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో ఒక్క గుడ్డు రూ.10కు అమ్ముతున్నారు.
గత ఏడాది జూన్, జులై నెలల్లో కోళ్ల ఫారాల దగ్గర హోల్‌సేల్ ధర రూ.4.90 ఉండగా.. రిటైల్ మార్కెట్లో రూ.5.50 నుంచి రూ.6 మధ్యలో ఉండేది. అయితే రెండు నెలల క్రితం గల్ఫ్ యుద్ధ ప్రభావంతో ఎగుమతులు మందగించడంతో కొంతకాలం గుడ్డు ధరలు తగ్గాయి. ఆ సమయంలో ఫారం రేటు రూ.3.50కు పడిపోయింది. ఆ సమయంలో వినియోగదారులు రూ.4కే గుడ్డు కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫారం ధర రికార్డు స్థాయిలో రూ.6.95కు చేరడంతో.. మార్కెట్లో గుడ్డు ధరలు కూడా భారీగా పెరిగాయి.
గుడ్డు ధరలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది.. గత వేసవిలో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. ఎండల తీవ్రతకు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికారికంగా 16 లక్షలు, అనధికారికంగా 20 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్లు అంచనా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక కోటి 30 లక్షలకు పైగా కోళ్లు ఉండగా.. రోజుకు కోటి వరకు గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. కానీ భారీగా కోళ్లు చనిపోవడంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. తెలంగాణలో కూడా వేల సంఖ్యలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమలు ఈ వేసవి ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. రోజుకు కోట్ల సంఖ్యలో ఉత్పత్తి అయ్యే గుడ్లలో తగ్గుదల రావడంతో సరఫరా తగ్గి ధరలు పెరిగాయి.
ఇక రెండో ప్రధాన కారణం.. కోళ్ల దాణా ధరలు పెరగడం. కోళ్ల పెంపకంలో కీలకమైన సోయా, మొక్కజొన్న, తౌడు ధరలు భారీగా పెరిగాయి. సోయా టన్ను ధర రూ.40 వేల నుంచి రూ.65 వేలకు చేరింది. నూనె తీసిన తౌడు ధర రూ.12 వేల నుంచి రూ.22 వేలకు పెరిగింది. మొక్కజొన్న ధర కూడా రూ.19 వేల నుంచి రూ.24,500కు చేరింది. దీంతో కోళ్ల పెంపకం ఖర్చు పెరిగి.. ఆ భారాన్ని పరోక్షంగా వినియోగదారులే భరించాల్సి వస్తోంది.
తెలుగు రాష్ట్రాలు దేశంలోనే కోడిగుడ్ల ఉత్పత్తిలో కీలక స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో రోజుకు సుమారు 3 కోట్ల 90 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా.. అందులో సగం స్థానిక వినియోగానికి వెళ్తాయి. మిగిలినవి ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతాయి. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ మార్కెట్లలో 100 గుడ్ల హోల్‌సేల్ ధర రూ.705 మార్కును తాకింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ కూడా హెచ్చరిస్తోంది.
ఇదిలా ఉంటే, సామాన్యుడికి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. మార్కెట్లో బియ్యం ధరలు కూడా అమాంతం పెరిగాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే కేజీ బి య్యం 10 రూపాయలు పెరిగింది. గతంలో 25 కేజీల సూపర్ ఫైన్ బియ్యం బస్తా 1500 నుంచి 1600 రూపాయలు ఉండగా.. ఇప్పుడు అది ఏకంగా 1800 రూపాయల మార్కును దాటేసింది.
గుంటూరు, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో వరి సాగుపై ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల ప్రభావం కనిపిస్తోంది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గాయి. కాలువల ద్వారా సాగునీరు అందుతుందా లేదా అన్న అనుమానాలు రైతుల్లో నెలకొన్నాయి. భవిష్యత్‌లో బియ్యం కొరత ఏర్పడుతుందన్న భయంతో కొంతమంది వ్యాపారులు, వినియోగదారులు ముందుగానే నిల్వలు చేసుకోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.
గత రెండేళ్లుగా ధాన్యానికి సరైన ధరలు లేక వ్యాపారులు నష్టపోయారు. దీంతో చాలామంది ముందుగానే స్టాక్ విక్రయించారు. ప్రస్తుతం మార్కెట్లో ధాన్యం లభ్యత తగ్గడంతో ధరలు పెరిగాయి. రాబోయే పంటపై స్పష్టత లేకపోవడం కూడా డిమాండ్‌ను పెంచుతోంది. ధరల నియంత్రణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఒకవైపు పౌల్ట్రీ రంగంలో పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు.. మరోవైపు వాతావరణ పరిస్థితుల ప్రభావం.. మొత్తంగా నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. గుడ్డు, బియ్యం వంటి రోజువారీ అవసరాల ధరలు ఇలాగే పెరుగుతూ పోతే.. కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు.. రైతులు, పౌల్ట్రీ రంగానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో సామాన్య కుటుంబాలపై ధరల భారం మరింత పెరిగే అవకాశం ఉంది.

Leave a Reply