Missing Toddler Mystery in Kakinada | Police Attach GPS Tracker to Dog in Search Operation

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై 32 రోజులైంది. అయితే, తాజాగా ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన ఓ కియా కారు కొత్త చర్చకు దారితీసింది. ఆ కారుపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి కీలక విషయాలు వెల్లడించారు. మరోవైపు చిన్నారి మిస్సింగ్‌పై డీఎస్పీ సంచలన ప్రకటన చేశారు. ఇంతకీ, అసలు ఆ కారు కథేంటి? తల్లిదండ్రులకు అనుమానం ఎందుకు వచ్చింది? పోలీసులు ఏం తేల్చారు?

ముందుగా, జాహ్నవి అదృశ్యం కేసు దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన కియా కారు కీలక క్లూగా మారింది.చిన్నారి అదృశ్యమైన రోజుతో పాటు అంతకుముందు రెండు రోజులుగా కూడా అదే కారు గ్రామంలో పలుమార్లు తిరిగినట్లు గుర్తించడంతో, పక్కా ప్రణాళికతో వచ్చిన వ్యక్తులు చిన్నారిని అపహరించి ఉండొచ్చని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే కారు నర్సీపట్నం సమీపంలో చిన్నారి బంధువును కూడా ఢీకొట్టిందని ఆరోపిస్తూ.. ఆ కారు నంబర్‌ను పోలీసులకు అందజేశారు. దీంతో , మిస్సింగ్‌ కేసుకు, ఆ కారుకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. అయితే విచారణ అనంతరం జాహ్నవి అదృశ్యానికి ఆ కియా కారుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం, ఈ కేసును ఇతర కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరోవైపు, జాహ్నవి కేసులో తుని డీఎస్పీ తిలక్‌ కీలక ప్రకటన చేశారు. ఎవరైనా పాపను తీసుకెళ్లి ఉంటే తమకు అప్పగించాలని, అలా స్వయంగా అప్పగించిన వారిపై చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోబోమని డీఎస్పీ హామీ ఇచ్చారు. మంగళవారం తునిలో డీఎస్పీ తిలక్ మీడియాతో మాట్లాడుతూ, పాప ఆచూకీయే తమకు ముఖ్యమని, చిన్నారిని తన తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచారం అందిస్తే తామే స్వయంగా వచ్చి పాపను తీసుకుంటామని తెలిపారు. చుట్టుపక్కల తోటలు, కొండ ప్రాంతాల్లో గాలించినా జంతువుల దాడి ఆనవాళ్లు లభించలేదని, అందుకే కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. పాప ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష రివార్డు ప్రకటించారు.

ఇక, ఈ మిస్సింగ్‌ కేసులో ఇప్పటివరకు లభించిన ఆధారాలను పరిశీలిస్తే.. కొండ ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు లేదా సెల్‌ఫోన్ వినియోగించని వారు పాపను తీసుకెళ్లి ఉండే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై లోతుగా దర్యాప్తు చేస్తునట్లు వివరించారు. అదే సమయంలో అడవి ప్రాంతం కావడంతో జంతువుల కోణంలోనూ అనుమానాలను పూర్తిగా కొట్టిపారేయలేమని పేర్కొన్నారు. అందుకే ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.

ఈ కేసులో ఇప్పటికే వందలాది మందిని పోలీసులు విచారించారు. చిన్నారి కుటుంబ సభ్యులతో సహా బంధువులు, గ్రామస్తులు, సమీప ప్రాంతాల ప్రజలను వివిధ కోణాల్లో వారి నుంచి సమాచారం సేకరించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజ్, అనుమానితుల కదలికలు, వివిధ ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం సెల్‌ఫోన్ వినియోగించని సంచార జాతుల వారు, జీడిపిక్కలు సేకరించే వ్యక్తులు తిరిగే ప్రాంతాలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు డీఎస్పీ తెలిపారు. పాప ఆచూకీ కోసం దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఈ కేసులో ప్రజలు సహకరించాలని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు. చిన్నారికి సంబంధించిన ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రతి సమాచారాన్ని పరిశీలిస్తూ చిన్నారి జాడ కనిపెట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని, కేసు దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని డీఎస్పీ తిలక్ స్పష్టం చేశారు.

మరోవైపు, చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టడంతో పాటు తుని పట్టణం, పరిసర గ్రామాలు, చింతపల్లి, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో విస్తృతంగా పోస్టర్లు అతికించి ప్రజల సహకారాన్ని కోరుతున్నారు. జాహ్నవి గురించి ఏ సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు, కన్నబిడ్డ కోసం తల్లి గంపెడాశతో ఎదురుచూస్తుండగా, తండ్రి ఊరూరా తిరుగుతూ చిన్నారి పోస్టర్లను పంచి తమ కుమార్తెను ఎవరైనా తీసుకెళ్లి ఉంటే క్షేమంగా అప్పగించాలని కన్నీరుమున్నీరుగా వేడుకుంటున్నారు.

మొత్తంగా, 32 రోజులైనా జాహ్నవి ఆచూకీ లభించకపోవడం కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒక దశలో కీలక క్లూగా భావించిన కియా కారుకు.. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. ఇదే సమయంలో, చిన్నారిని క్షేమంగా అప్పగిస్తే ఎలాంటి కేసులు నమోదు చేయబోమని డీఎస్పీ చేసిన హామీ ఇప్పుడు కీలకంగా మారింది. జాహ్నవి సురక్షితంగా తిరిగి రావాలని తల్లిదండ్రులతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. కేసులో తదుపరి ఎలాంటి ఆధారాలు బయటపడతాయన్నది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published.