విధితో పోరాడి ఓడిపోయాడు..! పవన్‌ వీరాభిమాని నిరంజన్‌ఓ చెరగని జ్ఞాపకం

విధి కొన్నిసార్లు ఎంత క్రూరంగా ఉంటుందో…ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు తను జీవితాంతం అభిమానించిన హీరోను కలిసిన ఆనందం…మరోవైపు ప్రాణాలతో చేస్తున్న పోరాటం.. ఆ హీరో ఇచ్చిన మాట… కలిసి సినిమా చూడాలన్న కల… ఇవన్నీ ఇంకా కళ్లముందే ఉండగానే… 17 ఏళ్ల నిరంజన్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా తన గుండెలకు హత్తుకున్న ఆ బాలుడు… ఇప్పుడు జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయాడు. ఇప్పుడు ఈ విషాదం పవన్ కళ్యాణ్ అభిమానులనే కాదు… ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.

నిజానికి జీవితం చాలా చిన్నది… కానీ అవి మిగిల్చే జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం వెంటాడుతుంటాయి. అలాంటి హృదయ విదారక కథే హనుమకొండకు చెందిన 17 ఏళ్ల పొనుగంటి నిరంజన్‌ది. చిన్న వయసులోనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో పోరాడుతూ… చివరి వరకు జీవితంపై ఆశను కోల్పోకుండా బతికిన ఈ బాలుడు… తన అభిమాన హీరోను ఒక్కసారి చూడాలన్న కలను నిజం చేసుకున్నాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. తన చివరి కోరిక నెరవేరిన కొద్ది రోజులకే నిరంజన్ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈ వార్త ఇప్పుడు వేలాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులను, జనసేన కార్యకర్తలను, సామాన్య ప్రజలను కూడా తీవ్ర విషాదంలో ముంచెత్తుతోంది.

హనుమకొండ నగరంలోని హనుమాన్ నగర్‌కు చెందిన నిరంజన్ తన పసిప్రాయంలో సాధారణ పిల్లాడిలాగే పెరిగాడు. అయితే ఏడేళ్ల వయసు దాటిన తర్వాత అతని ఆరోగ్యంలో అసాధారణ మార్పులు కనిపించడం మొదలైంది. పరీక్షలు చేయించగా… డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (Duchenne Muscular Dystrophy-DMD) అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. క్రమంగా కండరాల బలం తగ్గిపోవడం… ఎదుగుదల ఆగిపోవడం… చివరకు పూర్తిగా మంచానికే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కిడ్నీ సమస్యలు కూడా తోడవడంతో, నిరంజన్ జీవితం మొత్తం ఆస్పత్రులు, మందులు, చికిత్సల మధ్యనే గడిచిపోయింది.

అయితే… శరీరం సహకరించకపోయినా మనసు మాత్రం ఎప్పుడూ ఓడిపోలేదు. బాధల మధ్య కూడా చిరునవ్వుతో కనిపించే నిరంజన్‌కు ఒకే ఒక్క పెద్ద బలం… పవన్ కళ్యాణ్‌పై ఉన్న అపారమైన అభిమానం. పవన్ సినిమాలు చూడడం, ఆయన పాటలకు మంచంపైనే చేతులు కదుపుతూ డాన్స్ చేయడం, ఆయన డైలాగులు చెప్పడం… ఇవే నిరంజన్ ప్రపంచం. అందుకే స్థానికంగా అందరూ అతడిని ప్రేమగా ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలిచేవారు.

తన జీవితంలో ఒక్కసారైనా పవన్ కళ్యాణ్‌ను కలవాలని నిరంజన్ ఎన్నోసార్లు తన తల్లిదండ్రులకు చెప్పేవాడు. ఆ కోరికను వీడియోల రూపంలో జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో… ఆ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది. ఆ వీడియోలు చూసిన పవన్ హృదయం కరిగిపోయింది. వెంటనే గత నెల హనుమకొండకు వెళ్లి… నేరుగా నిరంజన్ ఇంటికి చేరుకున్నారు. మంచంపైనే కదల్లేని స్థితిలో ఉన్న బాలుడిని చూసి పవన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

నిరంజన్ పక్కనే మంచంపై కూర్చుని… అతని చేతిని పట్టుకుని ఆప్యాయంగా పలకరించారు. “ఎలా ఉన్నావు చిన్నా… ధైర్యంగా ఉండు… మంచి చికిత్స తీసుకుంటే తప్పకుండా కోలుకుంటావు” అంటూ అతడిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. అభిమాన హీరో తన ఇంటికి వచ్చి… తనతో మాట్లాడుతుండటంతో నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ క్షణాలు అతని జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి.

అక్కడితో పవన్ ప్రేమ ఆగిపోలేదు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించి ఆశీర్వదించారు. జనసేన డైరీలో తన స్వహస్తాలతో… “ప్రియమైన నిరంజన్… ప్రేమతో… ఆ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ…” అంటూ సందేశం రాసి ఇచ్చారు. ఆ చిన్న కానుక నిరంజన్ కుటుంబానికి అమూల్యమైన జ్ఞాపకంగా మారింది.

ఆ సమయంలో నిరంజన్ మంచంపైనే పడుకుని చేసిన డాన్స్ వీడియోలను పవన్ కళ్యాణ్ మరోసారి చూశారు. ఆ బాలుడి ఉత్సాహానికి ముగ్ధులయ్యారు. “త్వరగా కోలుకో… మనిద్దరం కలిసి ఓజీ-2 సినిమా చూద్దాం. నీ కోసం ప్రత్యేకంగా షో వేయిస్తా” అంటూ మాట ఇచ్చారు. అంతేకాదు… తనకు ఒక కుక్కపిల్లను పెంచుకోవాలన్న కోరిక ఉందని నిరంజన్ చెప్పగానే… “కొని పంపిస్తా చిన్నా” అని హామీ ఇచ్చి… అదే రోజు ఆ కోరికను కూడా నెరవేర్చారు. అభిమానిని సంతోషపెట్టడానికి పవన్ చేసిన ఆ చిన్న ప్రయత్నం… నిరంజన్ ముఖంలో అమూల్యమైన చిరునవ్వును తీసుకొచ్చింది.

కానీ విధి మాత్రం మరోలా నిర్ణయించింది. ఇటీవల నిరంజన్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. మెరుగైన చికిత్స కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌కు తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్ తుదిశ్వాస విడిచాడు. చివరి వరకు ధైర్యంగా పోరాడిన ఆ చిన్నారి జీవితం… ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది.

ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో విషాదం అలుముకుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు నిరంజన్‌తో దిగిన ఫొటోలు, వీడియోలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. “హీరోను చూడాలన్న కల నెరవేరింది… కానీ హీరోతో కలిసి సినిమా చూడాలన్న కల మాత్రం కలగానే మిగిలిపోయింది” అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే… కొన్ని జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతాయి. కొన్ని మాటలు ఎప్పటికీ చెరిగిపోవు. తన అభిమాన హీరో పవన్‌ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా చూసిన ఆ క్షణంలో… నిరంజన్ ముఖంపై మెరిసిన ఆనందం, ఆ అమాయకమైన చిరునవ్వు… చూసిన ప్రతి ఒక్కరి మనసును తాకింది. “త్వరగా కోలుకో చిన్నా… మనిద్దరం కలిసి సినిమా చూద్దాం” అని పవన్‌ కళ్యాణ్ చెప్పిన ఆ మాటలు… ఇప్పుడు అభిమానుల కళ్లలో కంటతడిగా మారాయి. ఒక అభిమాని చివరి కోరిక నెరవేరింది… కానీ అతని చివరి కల మాత్రం కలగానే మిగిలిపోయింది. నిరంజన్ ఈ లోకాన్ని విడిచిపోయినా… అతని అభిమానం, అతని చిరునవ్వు, పవన్‌తో గడిపిన ఆ ఆప్యాయ క్షణాలు మాత్రం ఎప్పటికీ చెరగని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.అందుకే… నిరంజన్ జీవిత కథ ఓ హార్ట్‌ టచ్చింగ్‌ స్టోరీగా ప్రతి ఒక్కరి మనసులో చెరగని ముద్ర వేసుకుంది.

Leave a Reply

Your email address will not be published.