జాహ్నవి మిస్సింగ్ కేసులో కీలక మలుపు..!
30 రోజుల తర్వాత బయటపడిన కీలక ఆధారం!
చిన్నారి అదృశ్యమైన రోజు గ్రామంలో చక్కర్లు కొట్టిన కియా కారు!
సీసీ ఫుటేజీలోని కారుపై తల్లిదండ్రుల అనుమానం!
అసలు ఆ కారు ఎవరిది..?
జాహ్నవి మిస్సింగ్‌కు ఆ కారుకు లింక్ ఉందా..?
ఈ ఒక్క ఆధారం..కేసు మిస్టరీని ఛేదిస్తుందా?
చిన్నారి క్షేమంగా తిరిగొస్తుందా?
కేసులో కొత్త మలుపు
కాకినాడలో చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. చిన్నారి మిస్సింగ్ వెనుక ఒక కియా (KIA) కారు ఉన్నట్లు వస్తున్న ఆధారాలు, కుటుంబ సభ్యుల ఆరోపణలు ఇప్పుడు ఈ కేసులో తీవ్ర కలకలం రేపుతున్నాయి. జాహ్నవి అదృశ్యమైన రోజున, అంతకుముందు రెండు రోజుల పాటు ఆ గ్రామంలో ఒక కియా కారు అనుమానాస్పదంగా తిరిగినట్లు సీసీటీవీ (CCTV) ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ కారు, అందులో ఉన్న వ్యక్తుల ప్రవర్తనపైనే తమకు పూర్తి అనుమానాలు ఉన్నాయని చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గట్టిగా చెబుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆ కారులో వచ్చిన వారు తమ పాపను కిడ్నాప్ చేసి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు.
మరో షాకింగ్ ట్విస్ట్
ఈ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే.. సీహెచ్ అగ్రహారంలో అనుమానాస్పదంగా తిరిగిన అదే కియా కారు, నర్సీపట్నం పరిసర ప్రాంతంలో చిన్నారికి సంబంధించిన బంధువును ఢీకొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కావాలనే భయాందోళనలకు గురిచేయడానికి లేదా సమాచారం బయటకు రాకుండా ఉండేందుకే ఆ కారుతో బంధువును ఢీకొట్టారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ కారు ఎవరిది?
చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన సదరు కియా కారు నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ వాహనం ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? నర్సీపట్నంలో జరిగిన ప్రమాదానికి, ఈ కిడ్నాప్‌నకు ఏమైనా లింకు ఉందా? అనే కోణంలో విచారణను ముమ్మరం చేశారు. నెల రోజులుగా చిన్నారి ఆచూకీ దొరక్క ఆందోళనలో ఉన్న కుటుంబం.. ఈ కారు మిస్టరీ వీడితే జాహ్నవి ఆచూకీ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఊరూరా తిరుగుతూ పోస్టర్లు పంచుతున్న తండ్రి
ఇక, తుని మండలం సీహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జాహ్నవి కోసం పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు, కన్నబిడ్డ కోసం ఆ తల్లి ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా, చిన్నారి తండ్రి మాత్రం ఊరూరా తిరుగుతూ చిన్నారి పోస్టర్లను పంచుతున్నాడు.తమ బిడ్డను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే వెంటనే వదిలేయాలని వారు కన్నీరుమున్నీరుగా వేడుకుంటున్నారు.
గోడలపై చిన్నారి పోస్టర్లు
అదేవిధంగా, చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు కూడా తుని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పోస్టర్లు అతికిస్తున్నారు. ముఖ్యంగా చింతపల్లి, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో పోస్టర్ల ద్వారా ప్రజల సహకారాన్ని కోరుతున్నారు. జాహ్నవి గురించి ఏ సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పామాయిల్ తోటలు, కొండ ప్రాంతాలు, అడవి పరిసరాలు, పొలాలు, కాల్వలు, గ్రామ శివార్లు, ప్రధాన రహదారులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు వంటి ప్రాంతాలను విస్తృతంగా జల్లెడ పట్టారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డ్రోన్లతో కూడా గాలింపు చేపట్టారు.
తెరపైకి కియాకారు సీసీ ఫుటేజ్
అంతేకాకుండా, అదృశ్యమైన రోజు నుంచి పరిసర ప్రాంతాల్లోని వందలాది సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, వాహనాల వివరాలను విశ్లేషిస్తూ ప్రతి చిన్న ఆధారాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి తరుణంలో చిన్నారి అదృశ్యమైన రోజు, గ్రామంలో అనుమానాస్పదంగా పలుమార్లు చక్కర్లు కొట్టిన.. కియాకారుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ తెరపైకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply