నిజామాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఈ క్రైమ్ స్టోరీ వింటే ఎవరికైనా సరే ఒళ్లు గగుర్పొడవాల్సిందే. గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన భర్తకు.. భార్యే మృత్యు శాసనం రాసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. ముందుగా మద్యం తాగించి మత్తులోకి దించి..ఆ తర్వాత డాబాపై నుంచి కిందకు తోసేశారు. అయినా భర్త ప్రాణాలతో ఉండటంతో మరింత దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు ఈ హత్య వెనుక ఉన్న కుట్ర ఏంటి? భార్య, ప్రియుడు కలిసి ఇంతటి దారుణానికి ఎలా పాల్పడ్డారు? ప్రమాదంగా కనిపించిన ఈ కేసులో అసలు నిజం ఎలా బయటపడింది?
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను అతి దారుణంగా హత్య చేసింది. భర్త నరాల్లోకి టాయిలెట్‌ను కడిగే హార్పిక్‌తో పాటు నిద్ర మాత్రల లిక్విడ్‌ను సిరంజీ సహాయంతో ఎక్కించి చంపేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో జరిగింది. మృతుడి తల్లి శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో కీలక విషయాలు తెలిశాయి.
నిజామాబాద్ సౌత్ సీఐ సురేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్(35) బతుకుదెరువు కోసం దుబాయ్‌కు వలస వెళ్లాడు. అతడు దుబాయ్ వెళ్లిన తర్వాత భార్య సంధ్యకు నిజామాబాద్ ఇంద్రాపూర్ కాలనీకి చెందిన మిరుగూరి అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో మూడేళ్ల తర్వాత జూన్ 27న ప్రశాంత్ దుబాయ్ నుంచి ఊరికి తిరిగొచ్చాడు. భర్త రావడంతో తమ గుట్టు బయటపడుతుందని, అక్రమ సంబంధానికి అడ్డు వస్తాడని భావించిన సంధ్య.. ప్రియుడు అనిల్‌తో కలిసి భర్తను మట్టుబెట్టాలని ప్లాన్ చేసింది. ఇందుకు స్థానిక గ్రామానికి చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి అనే యువకుడిని డబ్బు ఎరజూపి తమ కుట్రలో భాగస్వామిని చేసుకున్నారు.
ప్లాన్ ప్రకారం జూన్ 29న వెంకటసాయి.. మద్యం బాటిల్ తీసుకుని ప్రశాంత్ ఇంటికి వెళ్లాడు. దాబా మీద ఇద్దరు మందు తాగుతుండగా బంటికి సంధ్య ఫోన్ చేసి తన భర్తకు ఫుల్‌గా మద్యం తాగించాలని చెప్పింది. ఈ ఆడియో క్లిప్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. సంధ్య చెప్పినట్టే ప్రశాంత్‌కు బంటి అతిగా మద్యం తాగించి,అతను పూర్తిగా మత్తులోకి జారుకున్నాక దాబాపై నుంచి కిందికి తోసేశాడు. అయితే, ప్రశాంత్ తీవ్రంగా గాయపడినప్పటికీ చనిపోలేదు. దాంతో సంధ్య అక్కడకు వచ్చి ప్రమాదవశాత్తు దాబా మీద నుంచి పడ్డాడని ఇరుగుపొరుగు వారిని నమ్మించింది. అనంతరం ముందుగా నిజామాబాద్ జీజీహెచ్‌కు.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ప్రశాంత్‌ను తీసుకెళ్లింది.
అయితే, ప్రశాంత్ ఇంకా బతికే ఉండటంతో.. సంధ్య, అనిల్ ఎలాగైనా అదే రాత్రి పని ముగించాలనుకుని, ప్రశాంత్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించి మరీ ఇంటికి తీసుకొచ్చారు. ఆసుపత్రి వారు చేతికి పెట్టిన కాన్యూలా ను అలాగే ఉంచి.. ప్రియుడు అనిల్ ప్లాన్ ప్రకారం.. సంధ్య ఇంట్లో దాచి ఉంచిన మత్తు మాత్రల ద్రావణాన్ని, ఆపై టాయిలెట్ క్లీనర్ ను సిరంజి ద్వారా ప్రశాంత్ నరాల్లోకి నేరుగా ఎక్కించింది. కెమికల్స్ రక్తంలో కలవడంతో ప్రశాంత్ విలవిలలాడుతూ ప్రాణాలు విడిచాడు. చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక.. దాబాపై నుంచి పడటం వల్లే అంతర్గత గాయాలతో చనిపోయాడంటూ సంధ్య అందరినీ నమ్మించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
అనంతరం ప్రశాంత్ చనిపోయిన విషయాన్ని నిజామాబాద్‌లో ఉంటున్న అతడి తల్లి శ్యామలకు సంధ్య ఫోన్ చేసి చెప్పింది. అయితే,
కోడలి ప్రవర్తనపై శ్యామలకు తీవ్ర అనుమానం వచ్చింది. ఎందుకంటే.. తన కొడుకు దుబాయ్ నుంచి రావడం, దాబాపై నుంచి కింద పడడం, ఆసుపత్రికి తీసుకెళ్లడం, తర్వాత అతడు చనిపోయే వరకు.. ఏ విషయం చెప్పకుండా సంధ్య దాచిపెట్టింది. అంతేకాకుండా, అంత్యక్రియలకు కూడా హడావుడి చేయడంతో మృతుడి తల్లి శ్యామల వెంటనే మోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా కేసు మార్చిన ఎస్సై సాంకేతిక ఆధారాలు, నిందితుల కాల్ డేటాను పరిశీలించగా అసలు నిజం బయటపడింది. పోలీసుల విచారణలో భార్య సంధ్య, ప్రియుడు అనిల్, సహకరించిన బంటి తమ నేరాన్ని అంగీకరించారు.
మొత్తంగా, మొదట ఒక ప్రమాదంగా కనిపించిన ప్రశాంత్ మృతి.. చివరకు పక్కా హత్యగా తేలింది. కుటుంబ సభ్యుల అనుమానం, పోలీసుల సాంకేతిక దర్యాప్తు, కాల్ డేటా పరిశీలనతో ఈ కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం కోసం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఈ కేసులో భార్య సంధ్య, ఆమె ప్రియుడు అనిల్, సహకరించిన బంటి పోలీసుల అదుపులో ఉన్నారు. మరిన్ని ఆధారాలు సేకరిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంబంధాలు, నమ్మకాలు, అనుమానాలు హద్దులు దాటితే ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

Leave a Reply