Pancha Bhoota Shiva Temple

జీవకోటికి ఆధారం పంచభూతాలు. వీటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత దేవాలయాలు. అంతటా నిండి ఉండే శివుడు పంచభూతాలు సైతం తానే అంటున్నాడు.. అందుకే శివం పంచభూతాత్మకం అంటారు. ఆయనే జలం, తేజం, వాయువు ఆయనే ఆకాశం, ఆయనే భూమండలం. పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగ స్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిశాడు. పృథ్విలింగం(కంచి), ఆకాశలింగం(చిదంబరం), జలలింగం (జంబుకేశ్వరం), అగ్నిలింగం (అరుణాచలం), వాయులింగం(శ్రీకాళహస్తి)లను పంచభూతలింగాలు అంటారు. వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది.

పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతం

పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశ లింగం తమిళనాడు చిదంబరంలో కొలువుతీరింది. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ….మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. పరమశివుడు ఇక్కడ మూడు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. ఈ ఆలయంలో మహాశివుడు చంద్రమౌళీశ్వర స్పటిక లింగం, నృత్య భంగిమలో ఉన్న నటరాజ స్వామి, రూపం లేని శూన్యంగా భక్తులకు దర్శనమిస్తాడు. పరమేశ్వరుడి ఈ మూడవ రూపాన్నే ఆకాశ తత్వానికి ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికున్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై ‘యంత్ర’ అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. చిదంబర క్షేత్రం చెన్నై నుంచి 229 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పార్వతీదేవి మట్టితో తయారుచేసిన శివలింగం

పంచభూతలింగాల్లో పృథ్వి లింగం కొలువైన క్షేత్రం తమిళనాడు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం. ఈ శివలింగాన్ని పార్వతీదేవి మట్టితో తయారు చేసిందని చెబుతారు. ఓ సమయంలో గంగమ్మ… లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట. అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని కాపాడుకుందనీ, అందుకు నిదర్శనగా అమ్మవారి ఆభరణాలు గుర్తులు కనిపిస్తాయని చెబుతారు. స్వామి మామిడి చెట్టు కింద వెలిసాడు కాబట్టి ఏకాంబరుడు అని అంటారు. ఈ క్షేత్రం చెన్నై నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భారతదేశంలో అతిపెద్ద గోపురాలు గల ఆలయాల్లో కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ఉన్న శివలింగం భూమికి చిహ్నం. ఇక్కడ దాదాపు 1008 శివలింగాలను ప్రతిష్టించినట్లు చెబుతారు. వెయ్యి స్తంభాల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఏకాంబరేశ్వర ఆలయంలో 3,500 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక మామిడి చెట్టు ఉంది. ఈ చెట్టు ఫలాలు సంతానం లేని వారికి సంతానం కలిగిస్తాయని నమ్మకం.

శ్వాస తీసుకునే ఏకైక ప్రాణ వాయు శివలింగం

ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయంభువుగా వెలిసిందీ వాయులింగం. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీకాళహస్తి గర్భగుడిలోకి గాలి చొరబడకుండా నిర్మించారు. ప్రపంచంలోనే ఉఛ్వాస నిశ్వాసలు తీసుకునే ప్రాణశివలింగ క్షేత్రంగా ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ శివ లింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా.. శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయు లింగంగా కొలువైన స్వామి వారి ఉఛ్వాశ నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసంగా పిలుస్తారు. సమస్త జీవరాశులకు ప్రాణాధారమైన వాయుభూతానికి చిహ్నంగా ఈ శివలింగాన్ని పూజిస్తారు. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగం ఇక్కడ పూజలందుకుంటుంది.

ఏనుగులచే పూజలందుకున్న ఏకైక శివలింగం

తమిళనాడులో కొలువైన మరో పంచభూతలింగక్షేత్రం జంబుకేశ్వరం. పూర్వం ఇక్కడి శివలింగం ఏనుగులచే పూజలందుకోవడం, అలాగే ఇక్కడ ఒకప్పుడు జంబూవృక్షాలు అంటే నేరేడు చెట్లు ఎక్కువగా ఉండేవి. అందుకే జంబుకేశ్వరం అని పేరొచ్చిందని చెబుతారు. శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నం అయిన శివుడు లింగరూపంలో వెలిశాడనీ చెబుతారు. కావేరీ నదీ తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది జలతత్వం. ఇందుకు సాక్ష్యంగా ఆయన పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. పానపట్టంపై . కప్పిన ఓ వస్త్రాన్ని ఎప్పటికప్పుడు తీసి నీళ్లు పిండి మళ్లీ వేస్తుంటారు. చెన్నై నుంచి 331 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం. ఈ ఆలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో.. ఏడు ఎత్తైన గోపురాలతో నిర్మించబడి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

కొండపైన దేవుడు కాదు.. దేవుడే కొండరూపంలో వెలసిన క్షేత్రం

పంచభూతాలలో అగ్ని తత్వానికి ప్రతీక ఈ తేజో లింగం. తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం కొండపై తిరువణ్ణామలై పవిత్ర క్షేత్రం ఉంది. ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం. అరుణాచల క్షేత్రానికి ఎంతో పురాణ ప్రాశస్త్యం కూడా ఉంది. తమిళనాడు రాష్ట్రంలో తప్పక సందర్శించాల్సిన తీర్ధయాత్ర స్థలాల్లో అరుణాచలం ముఖ్యమైనది. భగవాన్ రమణ మహర్షి తన శేష జీవితాన్ని ఈ క్షేత్రంలోనే గడిపి ఎన్నో మహిమలు చూపించారు. అన్ని చోట్ల కొండ మీద వెలిసిన దేవుడిని దర్శించుకుని ఉంటారు..కానీ ఏకంగా దేవుడే కొండరూపంలో వెలసిన క్షేత్రం అరుణాచలం. ఇక్కడి స్వామిని అణ్ణామలైగా పిలుచుకుంటారు. పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలసిన క్షేత్రమే ఈ అరుణాచలం. అగ్ని తత్వానికి గుర్తుగా ఇక్కడి కొండ కూడా ఎర్రటి రంగులో కనిపిస్తుంది. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం

Leave a Reply

Your email address will not be published.