All Parties Ready for GHMC Elections

హైదరాబాద్ రాజకీయాల్లో మళ్లీ గ్రేటర్ డ్రామా షురూ అయింది. ఎన్నికల నగారా ఇంకా మోగకముందే భాగ్యనగర వీధుల్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీలన్నీ కులాల మ్యాపులు, క్యాలిక్యులేటర్లు బయటకు తీసి వాట్సాప్ వార్‌రూమ్‌లను యాక్టివేట్ చేస్తున్నాయి. తెలంగాణకు కళ్లు, చెవులు లాంటిది మన హైదరాబాద్ నగరం. ఇంకా చెప్పాలంటే తెలంగాణకు ఆత్మలాంటిది భాగ్యనగరం. నైజాం గడ్డకు కేరాఫ్ అడ్రస్ అయిన హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లను కైవశం చేసుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటినుంచే వ్యూహాలను రచిస్తున్నాయి.

సిటీ ఎవరి సొంతం!

సిటీలో పట్టు కోసం మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇంతకాలం జీహెచ్ఎంసీ పేరుతో ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పడ్డాయి. ఇందులో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్‌లతో కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసింది. ఎల్‌బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్ ప్రాంతాలతో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయగా.. సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్‌లు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండనున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ కొనసాగుతుండగా.. సైబరాబాద్‌కు శ్రీజన, మల్కాజ్‌గిరి వినయ్ కృష్ణారెడ్డిలను రాష్ట్ర సర్కార్ నియమించింది. ఎలక్షన్స్ ఎప్పుడొస్తాయనే అంశంతో సంబంధం లేకుండా మూడు పార్టీలూ ఇప్పటికే సన్నాహాలు స్టార్ట్ చేశాయి.

హైదరాబాద్ మేయర్ పీఠంపై ఫోకస్

అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది.ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని హస్తం నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌పై ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో పొలిటికల్ వ్యవహారాలను తన కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. హస్తం పార్టీ హైదరాబాద్‌లో బలహీనంగా ఉండటంతో..గ్రేటర్ పరిధిలోని కొంతమంది నేతల చేరికలతో బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. GHMC మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే హస్తం గూటికి చేరారు. మేయర్‌ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేసి..మూసీ సుందరీకరణ వంటి అంశాలతో ముందుకు వెళ్తున్నారు. మరోవైపు పొలిటికల్‌గా కూడా..ఆచితూచి వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం సపోర్ట్ కోసం .వారితో సఖ్యతగా ఉంటున్నారు. ఎంఐఎంను రాబోయే ఎన్నికల్లో కలుపుకునే పోతామనే సానుకూల సందేశాన్ని పీసీసీ కూడా ఇస్తోంది.

రంగంలోకి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాబోయే ఈ ఎన్నికలతో పట్టు సాధించాలని పట్టుదలగా ఉంది. సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ పరిధిలో వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పన, ఫ్లై-ఓవర్లు, మెట్రో విస్తరణ పనులకు శంకుస్థాపనలు.. ఇలాంటివాటితో నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే సంకేతాన్ని ప్రజల్లోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా తీసుకెళ్తున్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు.. ఇలాంటివన్నీ ప్రస్తావించి బీజేపీకి అర్బన్‌లో పట్టు ఉన్న ఓటర్లకు సీఎం తనదైన శైలిలో స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నారు. నగరాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వడంలేదని, సిటీ చుట్టూ నలుగురు బీజేపీ ఎంపీలున్నా అడ్డుకుంటున్నారనే ఆరోపణలతో ఆ పార్టీని కార్నర్ చేస్తున్నారు. అధికారంలో ఉండడంతో పాటు సీఎం స్వయంగా పర్యవేక్షిస్తుండడం ఆ పార్టీకి అనుకూల అంశం.

ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక అభివృద్ధి

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ వంటి చోట్ల సెటిలర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లోని ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక అభివృద్ధి పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. సైబరాబాద్ పరిధిలో మౌలిక వసతుల కల్పన ద్వారా వారి విశ్వాసాన్ని పొందాకే ఎన్నికల బరిలోకి దిగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల వ్యూహంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మూడు కార్పొరేషన్ల పరిధిలో జూన్ 12 వరకు 99 రోజుల ప్రత్యేక అభివృద్ధి కార్యాచరణను ప్రకటించి అమలు చేశారు. ఈ కాలంలో పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టులను పూర్తి చేసిన ప్రభుత్వం.., ఆపై భారీ స్థాయిలో ప్రారంభోత్సవాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. ఒకవైపు పాలనను వికేంద్రీకరిస్తూనే, మరోవైపు అభివృద్ధి పనులతో ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టాలనేది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోంది.

బీఆర్ఎస్ ప్రచారం

ఇక.. నగర పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉన్నది. మరే పార్టీకంటే ఎక్కువగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నారు. అన్ని పార్టీలకంటే ముందే సన్నాహక సమావేశాలు మొదలుపెట్టింది. అధికారం కోల్పోయిన తర్వాత స్థానిక సంస్థల నేతలు అధికార పార్టీ వైపు వెళ్లకుండా నిరోధించడం బీఆర్ఎస్ తొలి ప్రాధాన్యతగా మారింది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కార్పొరేటర్లతో వరుస రివ్యూలు అందులో భాగమే. “మా హయాంలోనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారింది.. పురపాలక మంత్రిగా కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులే ప్రజలకు సౌకర్యంగా మారాయి..” అనే బ్రాండ్ ఇమేజ్‌ను ప్రయోగిస్తున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుండటం సానుకూలాంశమే అయినా అధికారం చేజారడంతో లోకల్ లీడర్లలో నిరుత్సాహం, యాక్టివ్‌గా ఉంచడం ప్రధాన సవాల్. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే అని పదేపదే కామెంట్ చేసి కేడర్‌లో జోష్ రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నది. అన్ని నియోజకవర్గాల మీటింగుల్లో స్వయంగా కేటీఆర్ పాల్గొని శ్రేణులకు భరోసా కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

అర్బన్ ఓటర్లలో మోదీపై ఉన్న క్రేజ్

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా 48 స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించిన బీజేపీ.. ఈసారి హైటెక్ సిటీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లపైనా ఫోకస్ పెట్టింది. సికింద్రాబాద్, మల్కాజిగిరి లాంటి అర్బన్ పార్లమెంట్ స్థానాల్లో ఉన్న పట్టును, గెలుపును వాడుకోవాలనుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్‌ను మున్సిపల్ ఎన్నికల్లో సీట్లుగా మార్చుకోవాలని చూస్తున్నది. ఐటీ కారిడార్‌గా ఉన్న సైబరాబాద్, భారీ నివాస ప్రాంతాలున్న మల్కాజిగిరి ప్రాంతాల్లో విద్యావంతులు, వలస ఓటర్లు, మిడిల్ క్లాస్, హిందూ ఓటర్లను సమీకరించడం, కాంగ్రెస్-మజ్లిస్ పార్టీల దోస్తీని, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం ప్రధాన స్ట్రాటజీగా భావిస్తున్నది. అర్బన్ ఓటర్లలో మోదీపై ఉన్న క్రేజ్, కేంద్ర ప్రభుత్వ పనితీరు కలిసొచ్చే అంశం. లోకల్ బాడీ ఎన్నికలకు అవసరమైన వార్డు స్థాయి స్థానిక ఆర్థిక బలం, గ్రౌండ్ లెవెల్‌లో లీడర్ల కొరత కొన్ని డివిజన్లలో ప్రతికూల అంశం. జాతీయ అంశాలతో పాటు స్థానికంగా కనిపించే ట్రాఫిక్, వరదలు, చెత్త నిర్వహణ, రోడ్ల నాణ్యత, ఆస్తిపన్ను, పౌర సేవల అంశాలను అజెండాగా మార్చే ప్రయత్నం చేస్తున్నది. నగరానికి కేంద్రం ఇచ్చిన నిధులు, చేపట్టిన ప్రాజెక్టులను ప్రచారంలో వినియోగించాలని భావిస్తున్నది.

మరి, మజ్లిస్ పొత్తు ఎవరితో?

ఇక, గతంలో తెలంగాణ రూరల్‌ కంటే… హైదరాబాద్‌ చుట్టు పక్కలే తమకు ఎక్కువ అసెంబ్లీ సీట్లు రావడం, ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఇక్కడే సత్తా చాటడం లాంటి కారణాలతో.. జీహెచ్‌ఎంసీ మీద స్పెషల్‌ ఫోకస్‌ పెడుతోందట బీఆర్ఎస్‌. 2020లో గ్రేటర్ ఎన్నికలు జరిగినప్పుడు నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అత్యధిక డివిజన్స్‌ గెలుచుకుంది. మొత్తం 150 డివిజన్లకు గాను బీఆర్ఎస్ 56 చోట్ల, బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక ఎంఐఎం ఖాతాలో 44 డివిజన్లు పడగా…. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండిటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌ మేయర్ పీఠానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 76 కాగా…, అప్పట్లో ఎంఐఎం మద్దతుతో గులాబీ అభ్యర్థి సీట్లో కూర్చున్నారు. అయితే, అదంతా గతం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు దగ్గరైంది మజ్లిస్‌ పార్టీ. అందుకే… ఈసారి పూర్తిగా గేమ్‌ ప్లాన్‌ మార్చేయాలని అనుకుంటున్నారట బీఆర్‌ఎస్‌ పెద్దలు. కాంగ్రెస్‌, మజ్లిస్‌ దోస్తీ సంగతి ఎలా ఉన్నా….కాషాయ పార్టీని గట్టిగా టార్గెట్‌ చేస్తేనే… తాము ఎక్కువ సీట్లు సాధించగలుగుతామని బీఆర్ఎస్‌ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అధికార పార్టీని కాకుండా… హైదరాబాద్‌ వరకు తమ ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీని డిక్లేర్‌ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

కమలాన్ని గట్టిగా టార్గెట్‌ చేస్తే… గులాబీ ప్లాన్‌

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చలేదంటూ ప్రచారం చేసింది. కానీ హైదరాబాద్‌కు వచ్చేసరికి ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా…. రివర్స్ గేమ్‌ ఉంటుందని చెబుతున్నారు పార్టీ నాయకులు. గ్రామ స్థాయిలో కాషాయదళానికి పట్టు అంతంత మాత్రమేనన్నది విస్తృతాభిప్రాయం. కానీ… హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రభావం చూపగలుగుతుంది. అందుకే కమలాన్ని గట్టిగా టార్గెట్‌ చేస్తే… ఎక్కువ సీట్లు గెలవగలుగుతామన్నది గులాబీ ప్లాన్‌. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వల్ల రాష్ట్రానికి ఎలాంటి సాయం అందలేదని, గతంలో గెలిచిన ఆ పార్టీ కార్పొరేటర్లు కూడా సొంతగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని ప్రచారం చేయాలనుకుంటున్నట్టు సమాచారం.

జీహెచ్‌ఎంసీలోని 60 నుంచి 70 స్థానాలు ఒకే పార్టీకి దక్కే అవకాశం

మరోవైపు, పునర్విభజనతో ఓటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలో స్థానిక సంస్థల రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. దాదాపు 28 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మూడు కార్పొరేషన్ల పరిధిలో ఏ కార్పొరేషన్‌ను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందనే అంచనాలపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో 60 నుంచి 70 స్థానాలు ఓ ప్రముఖ పార్టీకి దక్కే అవకాశం ఉంది. మిగిలిన స్థానాల్లో పూర్తిగా త్రిముఖ పోటీ ఉంటుందని అంచనాకు వస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని విశ్లేషించుకుని సీఎంసీ, ఎంఎంసీలకు ఎన్నికల నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో అధికార పీఠానికి కీలకంగా గ్రేటర్‌ హైదరాబాద్‌

ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, అభివృద్ధిని ప్రధాన అజెండాగా చేసుకుంది. అటు పాతబస్తీపై పట్టు ఉన్న ఎంఐఎం, 44 స్థానాల రికార్డును దాటేయాలని గట్టి పట్టుదలతో ఉంది. అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ, ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ద్వారా ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. మూడు కార్పొరేషన్ల విభజన తర్వాత గ్రేటర్‌ ఎన్నికల్లో ఆయా స్థానిక సంస్థల పరిధిలోని డివిజన్లలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా, 24 అసెంబ్లీ సీట్లు, 5 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో గెలుపు అనేది తెలంగాణలో అధికార పీఠానికి కీలకంగా మారింది. మరి ఈ కొత్త సమీకరణాలు ఎవరికి లాభిస్తాయో వేచి చూడాలి!

Leave a Reply

Your email address will not be published.