తెలంగాణ సర్కార్ విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో కీలక మార్పులు చేపట్టింది. ఈ మార్పులతో విద్యార్థులకు మరింత పారదర్శకమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కాలేజీల ఖాతాల్లో జమయ్యే ఫీజు మొత్తాన్ని ఇకపై నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అడ్మిషన్ల తేదీల ఆధారంగా ఏడాదిలో మూడు విడతలుగా నిధులు విడుదల చేసే షెడ్యూల్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో ఫీజు ఎప్పుడు జమ అవుతుందో విద్యార్థులకు ముందుగానే క్లారిటీ రానుంది. ఇంతకీ, ఈ కొత్త రూల్స్ ఎప్పటినుంచి అమల్లోకి రానున్నాయి?
2026-27 విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులందరికీ ఈ కొత్త రూల్స్ వర్తించనున్నాయి. అయితే, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఏప్రిల్ 26న సర్కారు ఇచ్చిన జీవో 7ను రద్దు చేసి, కొత్త గైడ్‌లైన్స్ కోసం జీవోలు 8,9 తీసుకొచ్చారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న గడువును బట్టి మూడు విడతల్లో ప్రభుత్వం నిధులను రిలీజ్ చేస్తుంది.
మొదటి విడతలో ఏప్రిల్1 నుంచి జూలై 31 మధ్య అడ్మిషన్లు పొంది దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్టు 15న ఫీజు డబ్బులు విడుదలవుతాయి. రెండో విడతలో ఆగస్టు1 నుంచి నవంబర్ 30 లోపు అప్లై చేసుకున్న వారికి డిసెంబర్ 30న నిధులు జమ చేస్తారు. మూడో విడతలో డిసెంబర్ 1 నుంచి జనవరి 31 లోపు దరఖాస్తు చేసిన వారికి ఫిబ్రవరి 28న ఫీజు అందుతుంది. ఫిబ్రవరి, మార్చిలో లేట్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు దరఖాస్తు చేసిన 75 రోజుల్లోపు నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చిన రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విద్యార్థులు తప్పనిసరిగా వారంలోపు కాలేజీలకు చెల్లించాలని, అలా చెల్లించని విద్యార్థుల తల్లిదండ్రులపై రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేస్తామని తెలిపింది.
కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం.. స్కాలర్‌షిప్ కావాలంటే విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు 75 శాతం ఉండాల్సిందే. ఫేక్ అడ్మిషన్లకు అడ్డుకట్ట వేయడానికి ఈ నిబంధన తెచ్చారు. ఇక ఆదాయ పరిమితి విషయానికొస్తే.. అన్ని కేటగిరీల విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉండాలి. ఈ-పాస్ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. దీంతో విద్యార్థులు కాలేజీల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. కాలేజీల్లో ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించి ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.
అదేవిధంగా, విద్యార్థుల హాస్టల్, ఇతర విద్యా అవసరాల కోసం ఇచ్చే మెయింటెనెన్స్ ఫీజు మొత్తాలను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రొఫెషనల్ కోర్సులు, పీజీ చదివే వారికి కాలేజీ అటాచ్‌డ్ హాస్టల్‌లో ఉంటే నెలకు రూ.1,500, డే స్కాలర్లకు రూ.650 చొప్పున ఇస్తారు. డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ అయితే రూ.1,000, డే స్కాలర్లకు రూ.500.. ఇంటర్ విద్యార్థులకు హాస్టల్ అయితే రూ.750, డే స్కాలర్లకు రూ.500 చొప్పున పది నెలల పాటు ఈ మొత్తాన్ని ఇస్తారు. ముఖ్యంగా దివ్యాంగ విద్యార్థులకు అన్ని కేటగిరీల్లో అదనంగా మరో 10 శాతం మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది.
అయితే, గతంలో ఉన్న పాత పద్ధతుల వల్ల నిధుల విడుదల కావడంలో తీవ్ర ఆలస్యం జరిగేది. కొన్నిసార్లు కళాశాల యాజమాన్యాల ద్వారా నిధులు అందాల్సి రావడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల విద్యార్థులు సకాలంలో డబ్బులు అందక ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని భావించిన ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. టెక్నాలజీ సహాయంతో నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమ చేయనుంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం పూర్తిగా తొలిగిపోవడమే కాకుండా, నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే, ఈ నూతన విధానం ఏడాది పొడవునా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా అమలు జరగటం కోసం విద్యార్థులు కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థి తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉంటేనే నిధులు జమ అవుతాయి. ఒకవేళ ఆధార్ అనుసంధానం జరగకపోతే సాంకేతిక ఇబ్బందులు తలెత్తి నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ,ఈబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ఈ నిర్ణయం ద్వారా ఊరట లభించనుంది. కాలేజీ ఫీజులు, హాస్టల్ మెస్ ఛార్జీల కోసం నిధులు నేరుగా తమ చేతికి అందనున్నందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.”

Leave a Reply