‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు..’ అంటూ భూగోళం అంతా వినిపించేలా తన పాటను వినిపించాడు అందెశ్రీ. ఆ పాటలోని మాటలు.. నేటి సమాజంలో కనిపిస్తున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పేగుబంధాలకు నిలువెల్లా సమాధి కడుతోంది నేటి సమాజం. రక్తసంబంధాలు వెన్నుపోట్లు పొడుస్తుంటే.. స్నేహబంధాలు కడుపులో కత్తులు దించుతున్నాయి. వివాహేతర సంబంధాలు.. గుట్టుచప్పుడు కాకుండా గొంతు నులిమేస్తున్నాయి. ఎక్కడ చూసినా డబ్బే పరమావధిగా మారింది. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, ప్రాణ స్నేహితులు.. చివరికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలోనూ మానవత్వాన్ని మరిచి దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అనంతపురంలో జరిగిన ఈ ఘటన కూడా.. మానవ సంబంధాలు ఎంత దారుణంగా దిగజారిపోతున్నాయో చెప్పే మరో ఉదాహరణగా నిలిచింది.
అనంతపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగారు చెవికమ్మల కోసం సొంత నానమ్మనే మనవడు హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. డబ్బుల కోసం రక్తసంబంధాన్ని సైతం మరిచిపోయి.. ఆ వృద్ధురాలిని అత్యంత దారుణంగా హతమార్చాడు. అయితే ఈ కేసును పోలీసులు కేవలం నాలుగు గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే.. అనంతపురంలోని కోవూరు నగర్లో చిన్న నాగమ్మ అనే వృద్ధురాలు నివాసం ఉంటున్నారు. ఘటన జరిగిన సమయంలో ఆమె ఇంట్లోనే ఉన్నారు. అదే సమయంలో తన మనవడైన నారాయణస్వామి ఆమె దగ్గరకు వెళ్లాడు. బంగారు చెవికమ్మలు ఇవ్వాలని ఆమెను అడిగాడు. అయితే అందుకు చిన్న నాగమ్మ నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నారాయణస్వామి.. ఇంట్లో ఉన్న రోకలిబండతో వృద్ధురాలి తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె చెవుల నుంచి బంగారు కమ్మలు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అవి రాకపోవడంతో చెవులతో కోసేసి.. ఆ చెవికమ్మలను తీసుకెళ్లి ఓ దుకాణంలో విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అయితే చిన్న నాగమ్మ హత్యకు గురైన విషయం బయటపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే నాలుగో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వృద్ధురాలి చెవికమ్మలు కనిపించకపోవడంతో.. తొలుత చైన్ స్నాచర్లు లేదా దొంగలే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు.
కానీ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వివరాలను సేకరించారు. ఈ క్రమంలో వృద్ధురాలి మనవడైన నారాయణస్వామిపై పోలీసులకు అనుమానం వచ్చింది. అతడి కదలికలపై నిఘా పెట్టి విచారించగా.. అసలు విషయం బయటపడింది.
పోలీసుల విచారణలో నారాయణస్వామి నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ కరుణాకర్ రావు తెలిపారు. మద్యానికి బానిసైన నారాయణస్వామి డబ్బుల కోసం వృద్ధురాలి బంగారు కమ్మలపై కన్నేశాడని చెప్పారు. ఆమె కమ్మలు ఇవ్వకపోవడంతో రోకలిబండతో కొట్టి హత్య చేసినట్లు వెల్లడించారు.
అంతేకాదు.. హత్యకు ఉపయోగించిన రోకలిబండతో పాటు కట్టర్ బ్లేడ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం కోసం వచ్చిన వ్యక్తుల పని అనుకున్న ఈ కేసులో.. చివరకు సొంత మనవడే నిందితుడిగా తేలడం స్థానికులను షాక్‌కు గురిచేసింది.
బంగారు కమ్మల కోసం.. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నానమ్మనే హత్య చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ కేసును కేవలం నాలుగు గంటల్లోనే ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు.
మొత్తంగా.. బంగారం కోసం నానమ్మనే బలితీసుకున్న ఈ ఘటన.. బంధాల కంటే డబ్బుకు విలువ ఇస్తున్న నేటి సమాజానికి మరో చేదు ఉదాహరణగా మిగిలింది.

Leave a Reply