ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. అయితే అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేసింది.
ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డా. జె. మధుసూదన్ రావు, డా. ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం.. ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని ప్రకటనలో పేర్కొన్నారు.
గాయం గురించి అధికారిక ప్రకటనలో, ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా లేదని, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆయన కోలుకునే ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని తగిన సమయంలో ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని తెలిపారు.
ఇటీవల పలు సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌కు ఈ గాయం కావడంతో ఆయన షూటింగ్ షెడ్యూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఎన్టీఆర్ టీమ్ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు ఆయన పూర్తి విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


Leave a Reply