కేరళలోని వయనాడ్‌లో మరోసారి ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల మధ్య నిర్మాణంలో ఉన్న ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు వద్ద భారీ మట్టిచరియలు విరిగిపడి విషాదానికి దారితీశాయి. ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు మట్టి కింద చిక్కుకున్నారు. 2024లో వందలాది ప్రాణాలను బలిగొన్న కొండచరియల విపత్తు జ్ఞాపకాలు ఇంకా చెదరనే లేదు.. ఈలోపు, అదే వయనాడ్‌లో మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ ప్రమాదానికి కారణం భారీ వర్షాలేనా? లేక నిర్మాణాల్లో నిర్లక్ష్యమా? ఈ ఘటన వెనుక ఉన్న కారణాలేంటి?
వయనాడ్ జిల్లా మెప్పడి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన తీవ్ర కలకలం రేగింది. వయనాడ్ సొరంగ మార్గం నిర్మాణ ప్రాంతంలోని మీనాక్షి వంతెన సమీపంలో జరిగిన ఈ ఘటనలో పలువురు మట్టిలో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కొండ కూలిపోవడంతో భారీగా మట్టి, రాళ్లు రహదారిపైకి, సమీపంలోని నదిలోకి జారిపడగా, కొన్ని వాహనాలు కూడా మట్టిలో చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టి, నిర్మాణ పనుల్లో ఉన్న ఓ కార్మికుడిని సురక్షితంగా రక్షించాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలే ఈ కొండచరియలకు కారణమని అధికారులు భావిస్తుండగా, మంత్రి టి. సిద్దిక్ ఆదేశాల మేరకు రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. ప్రస్తుతం ఘటనాస్థలంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
వయనాడ్‌లో మెప్పడి టన్నెల్ ప్రాజెక్టు కల్లాడీ వద్ద మట్టిదిబ్బ కరిగి దూసుకొచ్చిన బురద ప్రవాహ ఉద్ధృతికి రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ ట్యాంకర్ రహదారికి అడ్డంగా తిరిగిపోయింది. రోడ్డుపై ఉన్న పలువురు బురదలో చిక్కుకుపోయారు.ఓపక్క కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. మరోవైపు భారీ వర్షం.. రెండూ తోడవడంతో వయనాడ్ జిల్లాలో ఓ మట్టిదిబ్బ ఉగ్రరూపం దాల్చింది. ఉద్ధృత వరదలా దూసుకొచ్చి ముగ్గురి ప్రాణాలను కబళించింది. స్థానిక కల్లాడీ ప్రాంతంలోని మీనాక్షీ వంతెన సమీపంలో.. కోళికోడ్, వయనాడ్ జిల్లాలను అనుసంధానించే సొరంగ రోడ్డు (Anakkampoyil-Kalladi-Meppadi) పనులు జరుగుతున్న చోట మంగళవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 10 మంది గాయపడ్డారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. మీనాక్షీ వంతెన సమీపంలో సొరంగ పనుల కోసం కొన్నాళ్లుగా భారీగా మట్టిని తవ్వి కుప్ప పోశారు. 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండలాంటి ఆ మట్టి దిబ్బ.. మంగళవారం ఉదయం దాదాపు 11 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది.
కొండచరియలు విరిగిపడ్డ తరహాలో.. ఒక్కసారిగా ప్రవాహంలా బురద దూసుకొచ్చింది. దాని ధాటికి చెట్లు కూలాయి. బారికేడ్లు ఎగిరిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ముగ్గురు మరణించారు. మృతులను మధ్యప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్‌లకు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. వయనాడ్‌లో 2024 జులైలో కొండచరియలు విరిగిపడి సుమారు 250 మంది ప్రాణాలు కోల్పోయిన ముండాక్కయీ-చూరాల్మలా గ్రామాలకు సమీపంలోనే ప్రస్తుత దుర్ఘటన చోటుచేసుకుంది.
మరోవైపు, వయనాడ్ దుర్ఘటనకు సంబంధించిన ఓ భయానక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారీ మట్టి కుప్ప ఒక్కసారిగా కిందకు జారిపడుతుండగా, అక్కడున్నవారు ప్రాణ భయంతో హాహాకారాలు చేస్తూ పరుగులు తీయడం అందులో కనిపించింది. ‘‘వేగంగా పరుగెత్తండి.. ప్రాణాలు కాపాడుకోండి’’ అంటూ ఓ వ్యక్తి హెచ్చరించడం వినిపించింది. మరోవైపు- 24 గంటల వ్యవధిలో వయనాడ్‌లో 265 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
వయనాడ్ విషాదంపై కేరళ సీఎం వి.డి.సతీశన్ తిరువనంతపురంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మీనాక్షీ వంతెన సమీపంలో భారీ స్థాయిలో కుప్పగా పోసిన మట్టిని తొలగించాలని కాంట్రాక్టర్లకు ప్రజా పనుల శాఖ మంత్రి పి.కె.బషీర్, జిల్లా కలెక్లర్ చాలా ముందుగానే చెప్పారన్నారు. వారి ఆదేశాలను కాంట్రాక్టర్లు పాటించలేదని పేర్కొన్నారు. గల్లంతైనవారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వయనాడ్ విషాదం ప్రకృతి వైపరీత్యం కాదని రాష్ట్ర హోం మంత్రి రమేశ్ చెన్నితాల, వ్యవసాయ శాఖ మంత్రి టి.సిద్దిఖీ పేర్కొన్నారు. తవ్వి తీసిన మట్టిని అశాస్త్రీయ పద్ధతిలో నిల్వ ఉంచడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని, ఇది మానవ తప్పిదమేనని వారు అభిప్రాయపడ్డారు. సొరంగం ప్రాజెక్టు గుత్తేదారు సంస్థ దిలీప్ బిల్డ్‌కాన్ లిమిటెడ్ ఈ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తాము అన్ని భద్రతా ప్రమాణాలను పాటించినప్పటికీ, అతి భారీ వర్షం కురియడంతో దుర్ఘటన చోటుచేసుకుందని ఓ ప్రకటనలో పేర్కొంది. వయనాడ్ విషాదంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రా (వయనాడ్ ఎంపీ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు- భారీ వర్షాల కారణంగా జమ్మూకశ్మీర్‌లోని డోడా జిల్లా ఠఠ్రీ పట్టణంలో మంగళవారం పలు ఇళ్లు, దుకాణాలు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసినవర్షాల ధాటికి ఠఠ్రీలోకి బండరాళ్లు, బురద కొట్టుకువచ్చాయి.
మొత్తానికి, వయనాడ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన మరోసారి కీలక ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చింది. భారీ వర్షాలు ప్రకృతి సహజమే అయినప్పటికీ.. కొండ ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు భద్రతా ప్రమాణాలు ఎంత కచ్చితంగా పాటించాలి? తవ్విన మట్టిని శాస్త్రీయంగా నిర్వహించడంలో ఎందుకు నిర్లక్ష్యం జరిగింది? అధికారుల హెచ్చరికలు ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. మరోవైపు, వాతావరణ శాఖ ఇంకా భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వయనాడ్‌తో పాటు కొండ ప్రాంతాల్లో అప్రమత్తత అత్యవసరంగా మారింది. ఈ ప్రమాదానికి అసలు కారణాలపై విచారణ కొనసాగుతుండగా.. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు, శాస్త్రీయ ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply