ఒక యూట్యూబర్… వరుసగా ఐదు సార్లు అరెస్ట్… ప్రతి కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో మళ్లీ అరెస్ట్… చివరకు దేశంలో అత్యంత కఠినమైన చట్టాల్లో ఒకటైన UAPA కింద కేసు నమోదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న అంశం ఇదే. అసలు ప్రశ్న రావణ్ ఎవరు? ఆయనపై ఇన్ని కేసులు ఎందుకు నమోదయ్యాయి? అసలు, ఒక యూట్యూబర్‌పై అత్యంత కఠినమైన UAPA చట్టం ప్రయోగించడమేంటి? పోలీసులు ఈ కేసులో ఇంత సీరియస్‌గా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ప్రశ్న రావణ్ కేసులో ఏం జరుగుతోంది? రిమాండ్ రిపోర్ట్ ఏంటి?
బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ సోషల్ మీడియాలో రాజకీయ, సామాజిక అంశాలపై వీడియోలు చేసే యూట్యూబర్. ప్రభుత్వ విధానాలు, రాజకీయ నాయకులపై విమర్శలు, విశ్లేషణలు చేస్తూ రావణ్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇటీవల ఆయన చేసిన కొన్ని వీడియోలు, ప్రసంగాలు వివాదాస్పదంగా మారాయి. వాటి ఆధారంగా రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ ‘ప్రశ్న రావణ్’ పేరు మారుమోగుతోంది.
మొత్తం ఐదు కేసుల్లో ప్రశ్న రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయా కేసుల్లో కోర్టులు వరుసగా బెయిల్ మంజూరు చేశాయి. కానీ ప్రతి సారి బెయిల్‌పై బయటకు రాగానే, మరో పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసులో ఆయనను మళ్లీ అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇలా వరుసగా అరెస్టులు జరగడంతో ఈ వ్యవహారం రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీసింది. ఒక వ్యక్తిని బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో మళ్లీ అరెస్ట్ చేయడం చట్టబద్ధమేనా అనే ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి.
ఈ పరిణామాల మధ్య గన్నవరం పోలీస్ స్టేషన్లో నమోదైన తాజా కేసు మరింత సంచలనంగా మారింది. ఎందుకంటే ఈసారి సాధారణ క్రిమినల్ సెక్షన్లతో పాటు, దేశంలోనే అత్యంత కఠినమైన చట్టాల్లో ఒకటైనా ఉపా (UAPA) చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. సాధారణంగా దేశ భద్రత, ఉగ్రవాద కార్యకలాపాలు, నిషేధిత సంస్థలకు మద్దతు వంటి తీవ్రమైన ఆరోపణల విషయంలో ఉపయోగించే ఈ చట్టాన్ని ఒక యూట్యూబర్‌పై ప్రయోగించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మరోవైపు, తాజాగా గన్నవరం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ ఈ కేసును మరింత సంచలనంగా మార్చింది. ఇప్పటివరకు వరుస అరెస్టులు, బెయిళ్లు, UAPA కేసు గురించి చర్చ జరిగినా… ఈసారి పోలీసులు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.
ఇంతకీ, ఆ రిమాండ్ రిపోర్టులో ఏముంది?
గన్నవరం పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం, ప్రశ్న రావణ్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా మావోయిస్టు భావజాలానికి సంబంధించిన సమాచారం లభించినట్లు పేర్కొన్నారు. అలాగే ఆయన చేసిన కొన్ని ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు నిషేధిత మావోయిస్టు సంస్థ భావజాలాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యంగా మావోయిస్టు నాయకుడు హిడ్మాను ప్రశంసిస్తూ ప్రసంగాలు చేశారని, యువతను ఆ భావజాలం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారని రిపోర్టులో పేర్కొన్నారు. ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదని, వ్యవస్థపై విద్వేషాన్ని పెంచేలా, రాష్ట్రంలో అశాంతి సృష్టించేలా ఉన్నాయని ఆరోపించారు. అంతేకాకుండా మతపరమైన విభేదాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులను అసభ్య పదజాలంతో దూషించారని కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ రిమాండ్ రిపోర్టులో మరో వివాదాస్పద అంశం కూడా ఉంది. “రావణ్” అనే పేరును దేవుళ్లను అవమానించాలనే ఉద్దేశంతోనే పెట్టుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. అలాగే ఆయన మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశం కూడా ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.అదేవిధంగా విచారణకు ప్రశ్న రావణ్ పూర్తిస్థాయిలో సహకరించడం లేదని, ఆయనకు సహకరిస్తున్న వ్యక్తులు ఎవరనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత లోతైన విచారణ అవసరమని కోర్టుకు వివరించారు. ఈ ఆరోపణల ఆధారంగానే గన్నవరం పోలీసులు BNSలోని పలు తీవ్రమైన సెక్షన్లతో పాటు UAPAలోని సెక్షన్ 13, 39 కింద కూడా కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం వంటి ఆరోపణలను పోలీసులు నమోదు చేసిన కేసులో చేర్చారు.
మరోవైపు ప్రశ్న రావణ్, ఆయన తరఫు న్యాయవాదులు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే వరుస కేసులు పెడుతోందని, భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసేందుకు UAPA వంటి కఠిన చట్టాలను ఉపయోగిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కోర్టులో కూడా ఇదే వాదన వినిపించారు.అదేవిధంగా ప్రశ్న రావణ్‌కు మద్దతుగా పలువురు సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు, సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. కోర్టులు బెయిల్ ఇస్తున్నా వరుసగా మరో కేసులో అరెస్ట్ చేయడం న్యాయవ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధమని, భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి కఠిన చట్టాలను ఉపయోగిస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కును గౌరవించాలని వారు కోరుతున్నారు.
అయితే పోలీసులు మాత్రం.. ఈ కేసును కేవలం భావ ప్రకటన స్వేచ్ఛ కోణంలో మాత్రమే చూడలేమని, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు, నిషేధిత సంస్థలకు సంబంధించిన ప్రచారం వంటి ఆరోపణల ఆధారంగానే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.
మరోవైపు, యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన భార్య ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, వ్యక్తిగత వివరాల్లో వాస్తవం లేదని, రావణ్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. కేవలం ప్రశ్నిస్తున్నందుకే ఉగ్రవాదిలా కేసులు పెట్టడం అన్యాయమని ఆరోపిస్తూ, కోర్టులు, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య విలువలను విశ్వసించే ప్రతి ఒక్కరూ ప్రశ్న రావణ్‌కు అండగా నిలవాలని కోరారు.
మొత్తానికి… ప్రశ్న రావణ్ కేసు ఇప్పుడు ఒక యూట్యూబర్ అరెస్ట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. భావ ప్రకటన స్వేచ్ఛ, జాతీయ భద్రత, UAPA వంటి కఠిన చట్టాల వినియోగం, పోలీసుల అధికారాలు, పౌరుల హక్కులు వంటి కీలక అంశాలపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒకవైపు పోలీసులు తమ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం చట్టబద్ధంగానే చర్యలు తీసుకున్నామని చెబుతుండగా… మరోవైపు ప్రశ్న రావణ్, ఆయనకు మద్దతుగా నిలుస్తున్నవారు ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆరోపిస్తున్నారు. అయితే, ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసు విషయంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి మరి.

Leave a Reply