రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక యుద్ధాలు జరిగిన ఏడాదిగా నిలిచింది 2025. ఓవైపు ప్రపంచం శాంతిని కోరుకుంటున్నప్పటికీ, మరోవైపు 2025లో మాత్రం యుద్ధాల సంఖ్య ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్యుద్ధాలు, డ్రోన్ల వంటి అధునాతన సాంకేతికతతో జరుగుతున్న ప్రాక్సీ వార్స్.. వెరసి ప్రపంచ శాంతిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నార్వేకు చెందిన ‘పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓస్లో’ (PRIO) వెల్లడించిన ఈ సంచలన గణాంకాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
2025లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన యుద్ధాల సంఖ్య, తీవ్రత, వాటి కాలవ్యవధి.. గత ఎనిమిది దశాబ్దాల్లో నమోదైన అన్ని రికార్డులను అధిగమించిందని అధ్యయనం చెబుతోంది. ఇది కేవలం ఒక ఖండానికి మాత్రమే పరిమితం కాలేదు. తూర్పు ఐరోపా నుంచి మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా వరకు… ఇలా భూగోళం అంతటా యుద్ధాలు ఒకేసారి భగ్గుమన్నాయి. గతంలో ప్రాంతీయ యుద్ధాలను అంతర్జాతీయ సంస్థలు నియంత్రించగలిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఇప్పుడు ఆ పాత పద్ధతులు అస్సలు పని చేయడం లేదు. ఒక ప్రాంతంలో ప్రారంభమైన ఘర్షణలు వేగంగా ఇతర దేశాలకూ వ్యాపిస్తూ అంతర్జాతీయ సంక్షోభాలుగా మారుతున్నాయి. దీంతో ప్రపంచ భద్రతా వ్యవస్థలో ఉన్న బలహీనతలు స్పష్టంగా బయటపడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
2025 ఏడాదంతా యుద్ధాలు, అంతర్యుద్ధాలు, సైనిక ఘర్షణలతో అట్టుడికింది. భారత్ – పాకిస్థాన్, పాకిస్థాన్ – ఆఫ్గానిస్థాన్, ఇజ్రాయెల్ – ఇరాన్, థాయ్‌లాండ్ – కాంబోడియా యుద్ధాలు వీటిలో అత్యంత ముఖ్యమైనవి. వీటి వల్ల దక్షిణ ఆసియా, పశ్చిమ ఆసియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సైనిక ఘర్షణలు తీవ్రరూపు దాలుస్తాయని ప్రజానీకం, ఇరుగుపొరుగు దేశాలు టెన్షన్‌కు గురయ్యాయి. కొన్నేళ్ల క్రితం మొదలైన పలు సైనిక ఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. రష్యా – ఉక్రెయిన్, ఇజ్రాయెల్ – లెబనాన్, ఇజ్రాయెల్ – గాజా (హమాస్) యుద్ధాలు ఇంకా ముగియలేదు. యెమన్, మయన్మార్, సూడాన్‌లలో అంతర్యుద్ధాలు కొనసాగుతున్నాయి.
అసలు ఈ పరిస్థితులకి కారణం ఏంటి? అనేది చూస్తే.. మొదటిది. నిర్వహణ లోపం. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల ప్రభావం తగ్గిపోయింది. శక్తివంతమైన దేశాలు తమ సొంత నిర్ణయాలతో సరిహద్దులను మార్చుకోవడానికి యుద్ధాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నాయి.
ఇక రెండోది. అత్యాధునిక టెక్నాలజీ. ఇది కూడా యుద్ధాల రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చిన డ్రోన్లు, సైబర్ వార్ఫేర్ టెక్నాలజీలు, ప్రాక్సీ నెట్‌వర్క్‌లు సులభంగా ఉండడంతో యుద్ధం చేయడం, దాన్ని కొనసాగించడం ఈజీగా మారింది. భారీ సైన్యం లేకుండానే దేశాలు, మిలిటెంట్ గ్రూపులు పెద్దఎత్తున దాడులు చేయగలుగుతున్నాయి. దీనివల్ల చిన్న దేశాలు కూడా పెద్ద స్థాయి యుద్ధాలకు సిద్ధపడుతున్నాయి. ముఖ్యంగా దౌత్యపరమైన చర్చల కంటే సైనిక శక్తిపైనే ఆధారపడే ధోరణి పెరగడం ప్రపంచ రాజకీయాల్లో అస్థిరతకు దారితీస్తోంది.
మూడో కారణం. మానవతా సంక్షోభం. దీని ఫలితం ఏంటంటే.. అమాయక ప్రజల ప్రాణాలు మట్టిలో కలిసి పోతున్నాయి. ఈ యుద్ధాల కారణంగా పౌరుల మరణాల రేటు ఊహించలేనంతగా పెరిగిందని నివేదిక చెబుతోంది. అదే విధంగా, ఈ యుద్ధాల అసలు భారమంతా సామాన్య ప్రజలపైనే పడుతోంది. వేలాది కుటుంబాలు తమ ఇళ్లు వదిలి ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. దీంతో, శరణార్థుల సంఖ్య పెరగడంతో పొరుగు దేశాల ఆర్థిక వ్యవస్థలపై, సామాజిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆహారం, వైద్యం, సహాయక చర్యల కోసం అంతర్జాతీయ సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఫైనల్‌గా ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న… ఈ పరిస్థితిని ఎలా నియంత్రించాలి అన్నదే. తాత్కాలిక కాల్పుల విరమణలు, చిన్నస్థాయి శాంతి బలగాలు ఇప్పుడు సరిపోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. బహుళ దేశాల ప్రమేయంతో సాగుతున్న ప్రాక్సీ యుద్ధాలను అరికట్టాలంటే కొత్త అంతర్జాతీయ స్థాయి భద్రతా వ్యవస్థ అవసరమని సూచిస్తున్నారు. లేదంటే 2025లో కనిపించిన ఈ యుద్ధాల తీవ్రత భవిష్యత్తులో మరింత ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని, అది క్రమేనా మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply