అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న భారతీయులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వీసా రూల్స్‌ను కఠినతరం చేస్తున్న ట్రంప్ సర్కారు.. ఇప్పుడు వారి జీవిత భాగస్వాముల ఉద్యోగాలపైనా కన్నేసింది. హెచ్-1బీ వీసాదారుల భార్య లేదా భర్తకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే హెచ్-4 ఈ-ఏ-డీ వర్క్ పర్మిట్ విధానాన్ని రద్దు చేసే దిశగా కీలక ప్రతిపాదన చేసింది. ఇది అమల్లోకి వస్తే.. ముఖ్యంగా భారతీయ మహిళా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
అసలు హెచ్-4 వీసా అంటే ఏంటి? హెచ్-4 ఈ-ఏ-డీ ఎవరికి వస్తుంది? ఈ వర్క్ పర్మిట్ రద్దయితే ఎవరికి ఎక్కువ నష్టం? ఇప్పుడున్న ఉద్యోగాలు వెంటనే పోతాయా?
ముందుగా హెచ్-4 వీసా అంటే ఏంటో చూద్దాం. అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన భార్య లేదా భర్తను.. అలాగే అర్హత ఉన్న పిల్లలను హెచ్-4 వీసాపై అమెరికాకు తీసుకెళ్లవచ్చు. అంటే హెచ్-1బీ వీసాదారుడితో కలిసి కుటుంబ సభ్యులు అమెరికాలో నివసించేందుకు ఈ వీసా ఉపయోగపడుతుంది.
అయితే ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం ఉంది. హెచ్-4 వీసా ఉంటే ఉద్యోగం చేసుకునే హక్కు ఆటోమేటిక్‌గా రాదు. ఉద్యోగం చేయాలంటే అర్హత ఉన్న హెచ్-4 జీవిత భాగస్వాములు ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్, అంటే ఈ-ఏ-డీ పొందాలి. ఈ వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాతే అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది.
అయితే ఈ-ఏ-డీ కూడా హెచ్-4 వీసాదారుల అందరికి లభించదు. హెచ్-1బీ వీసాపై ఉన్న జీవిత భాగస్వామి గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో నిర్దిష్ట దశకు చేరుకున్నప్పుడు.. అర్హత ఉన్న హెచ్-4.. స్పౌస్లు ఈ వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే హెచ్-4 వీసా ఉందంటే.. వెంటనే ఉద్యోగం చేసుకోవచ్చని కాదు.
ఈ హెచ్-4 ఈ-ఏ-డీ విధానాన్ని అమెరికా ప్రభుత్వం 2015లో తీసుకొచ్చింది. అప్పటి నుంచి అర్హత ఉన్న హెచ్-4 జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చాలా కుటుంబాల్లో ఇది రెండో ఆదాయ వనరుగా మారింది. ఒకరు హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేస్తుంటే.. మరొకరు హెచ్-4 ఈ-ఏ-డీతో ఉద్యోగం చేస్తూ కుటుంబ ఆర్థిక అవసరాలకు తోడ్పడుతున్నారు.
అయితే, ఇప్పుడు ఈ అవకాశానికే ముగింపు పలకాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. హెచ్-4 డిపెండెంట్ స్పౌస్లను ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్‌కు అర్హులైన వర్గాల నుంచి.. తొలగించే ప్రతిపాదనను డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ముందుకు తెచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే.. 2015లో తీసుకొచ్చిన విధానాన్ని వెనక్కి తీసుకుని.. హెచ్-4 స్పౌస్‌లకు ఈ-ఏ-డీ ఇచ్చే అవకాశాన్ని తొలగించాలన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం.
మరి ఈ నిర్ణయంతో భారతీయులపై ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉండొచ్చు? దీనికి ప్రధాన కారణం హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో భారతీయుల వాటా భారీగా ఉండటమే. అంతేకాదు.. హెచ్-4 ఈ-ఏ-డీ పొందిన వారిలో కూడా భారతీయుల సంఖ్య గణనీయంగా ఉంది.
2014 నుంచి 2017 వరకు ఉన్న హెచ్-4 ఈ-ఏ-డీ డేటా ప్రకారం.. మంజూరైన వర్క్ పర్మిట్లలో దాదాపు 93 శాతం భారతీయులకే లభించాయి. అందులో ఏకంగా 94 శాతం మంది మహిళలే. దీంతో ఈ వర్క్ పర్మిట్ విధానంలో మార్పు వస్తే.. భారతీయ మహిళా ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఉదాహరణకు.. ఒక కుటుంబంలో భర్త హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తుంటే.. భార్య హెచ్-4 ఈ-ఏ-డీతో ఉద్యోగం చేస్తోందనుకుందాం. ఒకవేళ ఈ-ఏ-డీ విధానం రద్దయితే.. భర్త ఉద్యోగం కొనసాగించినప్పటికీ.. భార్య ఉద్యోగం చేసే హక్కును కోల్పోయే అవకాశం ఉంటుంది. దీంతో కుటుంబానికి వస్తున్న రెండో ఆదాయం ఆగిపోవచ్చు.
అంతేకాదు.. అక్కడితో సమస్య ఆగదు. అమెరికాలో జీవన వ్యయం ఎక్కువగా ఉండటంతో.. కుటుంబంలో రెండో ఆదాయం ఆగిపోతే ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఆరోగ్య బీమా, రోజువారీ ఖర్చులపై ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఉద్యోగం చేస్తున్న మహిళలకు కెరీర్ పరంగా కూడా ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు.
అయితే ఇప్పుడు హెచ్-4 ఈ-ఏ-డీ ఉన్నవారు భయపడాల్సిన అవసరం ఉందా? అంటే.. ప్రస్తుతానికైతే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రస్తుతం కేవలం ప్రతిపాదన మాత్రమే.. ఇంకా అమల్లోకి రాలేదు.”
ఇక, ఈ ప్రతిపాదన అమల్లోకి రావాలంటే ముందుగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారికంగా నోటీస్ ఆఫ్ ప్రపోజ్డ్ రూల్మేకింగ్ను ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించాలి. ఆ తర్వాత ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించాలి. వాటిని పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం తుది నిబంధనను జారీ చేయాల్సి ఉంటుంది.
అయితే, ఇలాంటి ప్రయత్నం అమెరికాలో ఇదేం మొదటిసారి కాదు. ట్రంప్ తొలి పాలనా కాలంలోనూ హెచ్-4 ఈ-ఏ-డీని తొలగించే ప్రయత్నం జరిగింది. 2017లో ఇందుకు సంబంధించిన ప్రతిపాదన తీసుకొచ్చారు. కానీ, అప్పుడది అమల్లోకి రాలేదు. చివరకు 2021లో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు మరోసారి హెచ్-4 స్పౌస్ల ఉద్యోగ హక్కుల అంశం తెరపైకి వచ్చింది.
ఇక ఒకవేళ ఈ ప్రతిపాదన తుది నిబంధనగా మారితే.. హెచ్-4 వీసా కూడా రద్దవుతుందా అనే సందేహం చాలామందికి ఉంది. అలా జరగదు. హెచ్-4 వీసా, హెచ్-4 ఈ-ఏ-డీ రెండూ వేర్వేరు. ఈ-ఏ-డీ రద్దు అయితే ప్రధానంగా ప్రభావం పడేది ఉద్యోగం చేసే హక్కుపైనే. హెచ్-4 వీసా ఆటోమేటిక్‌గా రద్దు అవుతుందని కాదు. దీని అర్థం హెచ్-4 వీసాదారులు అమెరికాలో.. కుటుంబంతో కలిసి నివసించే అవకాశం కొనసాగవచ్చు. కానీ ఈ-ఏ-డీ లేకుండా ఉద్యోగం చేసే అవకాశం మాత్రం ఉండదు. ఇది అందరూ గమనించాలి.
ఇదే సమయంలో హెచ్-1బీ వీసాల విషయంలోనూ ట్రంప్ ప్రభుత్వం పలు మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. కొత్త హెచ్-1బీ నియామకాలపై భారీగా ఫీజు విధించే ప్రతిపాదనతో పాటు.. ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌పై కూడా మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
దీంతో హెచ్-1బీ వీసాదారుల కుటుంబాలకు ఒకేసారి రెండు రకాల అనిశ్చితులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు హెచ్-1బీ ఉద్యోగం, వీసా విధానాల్లో మార్పులు.. మరోవైపు జీవిత భాగస్వామి ఉద్యోగానికి సంబంధించిన ఈ-ఏ-డీపై అనిశ్చితి.
ఇక భారతీయులపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండటానికి మరో కారణం.. హెచ్-1బీ ప్రోగ్రామ్‌లో భారతీయుల ఆధిపత్యం. యూ-ఎస్- సీ-ఐ-ఎస్ డేటా ప్రకారం 2024లో మంజూరైన హెచ్-1బీ వీసాల్లో సుమారు 71 శాతం భారతీయులవే. కాబట్టి హెచ్-1బీ కుటుంబాల సంఖ్యలో భారతీయుల వాటా ఎక్కువగా ఉండటంతో.. హెచ్-4 ఈ-ఏ-డీపై వచ్చే ఏ మార్పు అయినా భారతీయ కుటుంబాలను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ముఖ్యంగా హెచ్-4 ఈ-ఏ-డీతో ఉద్యోగం చేస్తున్న మహిళలు.. తమ కెరీర్‌ను కొనసాగించడమే కాకుండా కుటుంబ ఆదాయానికి కూడా కీలకంగా సహకరిస్తున్నారు. వారి ఉద్యోగం ఆగిపోతే.. కుటుంబ ఆదాయం తగ్గడంతో పాటు, కొందరి కెరీర్లో గ్యాప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఒకవేళ ఈ ప్రతిపాదన తుది నిబంధనగా మారితే.. హెచ్-1బీ వీసాదారుల కుటుంబాల్లో రెండో ఆదాయంగా పనిచేస్తున్న హెచ్-4 స్పౌస్ల ఉద్యోగ హక్కుపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందులో భారతీయులు, ముఖ్యంగా మహిళలే పెద్ద సంఖ్యలో ఉండటంతో.. ఈ పరిణామం భారతీయ కుటుంబాలకు మరింత కీలకంగా మారింది.
మొత్తంగా చూస్తే.. అమెరికా ప్రభుత్వం హెచ్-4 ఈ-ఏ-డీ విధానాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. అధికారిక నోటిఫికేషన్, ప్రజాభిప్రాయాల స్వీకరణ, తుది నిబంధన జారీ వంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాతే.. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తుందా? వస్తే ఎలాంటి నిబంధనలు ఉంటాయి? అన్నది స్పష్టమవుతుంది. అంటే.. ఇప్పుడే ఉద్యోగాలు పోవు. కానీ ఈ ప్రతిపాదన తుది రూపం దాలిస్తే.. వేలాది హెచ్-4 స్పౌస్ల ఉద్యోగ హక్కుపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతీయ మహిళా ఉద్యోగులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. ఇక ట్రంప్ సర్కారు తెరపైకి తెచ్చిన ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.

Leave a Reply