అమెరికా-ఇరాన్ వార్‌లో బిగ్ ట్విస్ట్!
పశ్చిమాసియాలో మరోసారి బాంబుల వర్షం..
హర్మూజ్‌లో 13 చమురు నౌకలపై క్షిపణి దాడులు..
ఇరాన్ చేతిలో అమెరికా మానవరహిత జలాంతర్గామి..
మళ్లీ ట్యాంకర్ వార్ మొదలైనట్టేనా?
అసలు హర్మూజ్‌లో ఏం జరుగుతోంది?
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఒకవైపు ఇరాన్ చమురు రవాణా వ్యవస్థపై అమెరికా భారీ దాడులు చేస్తుంటే.. మరోవైపు అమెరికాకు చెందిన మానవరహిత అండర్‌వాటర్ వాహనాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని ఇరాన్ ప్రకటించింది. అంటే.. అమెరికా సముద్రం మీదున్న చమురు ట్యాంకర్లను టార్గెట్ చేస్తుంటే.. సముద్రం అడుగున అమెరికా సైనిక టెక్నాలజీ ఇరాన్ చేతికి చిక్కిందన్న మాట. అమెరికా ఇరాన్ చమురు ట్యాంకర్లను ఎందుకు ధ్వంసం చేసింది? ఇరాన్ స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న Dive-LD వాహనం అమెరికాకు ఎంత కీలకమైనది? ఈ పరిణామాలు మళ్లీ ‘ట్యాంకర్ వార్’కు దారితీస్తాయా?
అసలు ఈ ఘర్షణలో తాజా పరిణామం ఏంటంటే.. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. తమ యుద్ధనౌకపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో రెండుసార్లు దాడికి ప్రయత్నించింది. అయితే.. ఆ దాడులను అమెరికా నౌక విజయవంతంగా తప్పించుకుంది. దీనికి ప్రతిస్పందనగా.. ఇరాన్‌కు చెందిన చమురు ట్యాంకర్లను అమెరికా బలగాలు టార్గెట్ చేశాయి. ఈ నౌకలు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్, దాని అనుబంధ సంస్థలకు నిధులు సమకూర్చే ‘షాడో ఫ్లీట్’లో భాగమని అమెరికా ఆరోపిస్తోంది. అందుకే ఇది కేవలం ప్రతిదాడి మాత్రమే కాదని.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా చమురు ఆదాయానికి దెబ్బకొట్టే వ్యూహంలో భాగమని అమెరికా చెబుతోంది.
అయితే, ఇదే సమయంలో ఇరాన్ కూడా అమెరికాకు గట్టి షాక్ ఇచ్చినట్లు ప్రకటించింది. హర్ముజ్ జలసంధి ప్రవేశద్వారం వద్ద అమెరికాకు చెందిన Dive-LD మానవరహిత అండర్‌వాటర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. సాధారణంగా మనం డ్రోన్ అంటే ఆకాశంలో ఎగిరే వాహనాన్నే ఊహిస్తాం. కానీ Dive-LD మాత్రం నీటి అడుగున పనిచేసే మానవరహిత వాహనం. సముద్రపు అడుగుభాగాన్ని పరిశీలించడం, మ్యాపింగ్ చేయడం, నిఘా నిర్వహించడం, అవసరమైతే సముద్రంలో మైన్లను గుర్తించడం వంటి కార్యకలాపాలకు ఇలాంటి వాహనాలను ఉపయోగిస్తారు. అందుకే ఇది తమ చేతికి చిక్కడం కీలక పరిణామమని ఇరాన్ ప్రచారం చేస్తోంది.
అయితే ఈ విషయంలో అమెరికా మాత్రం ఇరాన్ చెబుతున్నంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తమకు చెందిన ఓ అండర్‌వాటర్ వాహనం అంతకుముందే పనిచేయకుండా నిలిచిపోయిందని అమెరికా సైన్యం చెబుతోంది. ఇరాన్ స్వాధీనం చేసుకున్నది అదే వాహనమా అన్న విషయాన్ని మాత్రం అమెరికా పూర్తిగా ధ్రువీకరించలేదు. అంతేకాదు.. అది పాత మోడల్‌కు చెందిన వాహనమని, అందులో అత్యంత సున్నితమైన రహస్య సమాచారం లేదని అమెరికా చెబుతోంది. అంటే.. ఇరాన్ దీన్ని అమెరికా సైనిక టెక్నాలజీపై సాధించిన విజయంగా చూపిస్తుంటే.. అమెరికా మాత్రం దీని వ్యూహాత్మక విలువను తగ్గించి చూపిస్తోంది.
ఇక, ఈ మొత్తం వ్యవహారంలో హర్ముజ్ జలసంధే అసలు కీలక పాయింట్. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు భారీగా చమురు రవాణా జరిగే మార్గం ఇది. అందుకే హర్ముజ్‌లో ఒక నౌకపై దాడి జరిగినా.. ఒక ట్యాంకర్ ప్రయాణం ఆగిపోయినా.. దాని ఇంపాక్ట్ కేవలం అమెరికా, ఇరాన్ దేశాలకే పరిమితం కాదు. చమురు రవాణాపై అనిశ్చితి పెరిగితే ధరలు పెరగొచ్చు. షిప్పింగ్, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరగొచ్చు. చివరికి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే హర్ముజ్ జలసంధిలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ప్రపంచ దేశాలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే.. మళ్లీ ఆనాటి ట్యాంకర్ వార్ మొదలైందా అని? 1980 నుంచి 1988 వరకు జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పర్షియన్ గల్ఫ్‌లో ప్రయాణించే చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరిగాయి. ఆ పరిణామాలను ‘ట్యాంకర్ వార్’గా పిలుస్తారు. ఇప్పుడు మళ్లీ చమురు ట్యాంకర్లు లక్ష్యంగా మారడం, హర్ముజ్ ప్రాంతంలో నౌకలకు హెచ్చరికలు రావడం ఆ పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితిని అప్పటి ట్యాంకర్ వార్తో పూర్తిగా సమానం చేయలేం. కానీ చమురు రవాణా మార్గాలే ఇప్పుడు యుద్ధంలో కీలక లక్ష్యాలుగా మారుతున్నాయన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా బలగాలు ఉన్న జోర్డాన్‌లోని అల్ అజ్రఖ్ ఎయిర్‌బేస్‌పై దాడి చేశామని, అక్కడ అమెరికా యుద్ధ విమానాలకు సంబంధించిన హ్యాంగర్లను ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించింది. అలాగే హర్ముజ్ ప్రాంతంలో మరిన్ని అమెరికా నౌకలు, చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా తెలిపింది. అయితే ఇరాన్ చేసిన ఈ ప్రకటనల్లో కొన్నింటిని అమెరికా ధ్రువీకరించలేదు. దీంతో ఇరు దేశాలు చేస్తున్న ప్రకటనల్లో ఏది వాస్తవం, ఏది యుద్ధ ప్రచారంలో భాగం అన్నది కూడా కీలకంగా మారింది.
మొత్తంగా చూస్తే.. ఇప్పుడు అమెరికా-ఇరాన్ మధ్య పోరు కేవలం క్షిపణులు, డ్రోన్ల దాడులకే పరిమితం కావడం లేదు. ఒకవైపు అమెరికా ఇరాన్ చమురు రవాణా వ్యవస్థపై దెబ్బకొడుతోంది. మరోవైపు ఇరాన్ అమెరికా సైనిక నిఘా వ్యవస్థలను సవాల్ చేస్తోంది. హర్ముజ్ జలసంధి ఈ పోరుకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ పరిస్థితి మరింత దిగజారితే.. దాని ప్రభావం యుద్ధ ప్రాంతం దాటి ప్రపంచ చమురు మార్కెట్లపై పడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అందరి చూపు హర్ముజ్‌పైనే ఉంది. అసలు, అమెరికా-ఇరాన్ మధ్య ఈ ప్రతిదాడుల పరంపర ఎక్కడ ఆగుతుంది? ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధి ఇకపై ఎంతవరకు సురక్షితంగా ఉంటుందన్నదే.. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న.

Leave a Reply